
సరస్వతీ నదీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
అమలాపురం రూరల్: మే 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే కాళేశ్వర సరస్వతీ నదీ పుష్కరాలకు కోనసీమ జిల్లా నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్‌టీపీ రాఘవ కుమార్ తెలిపారు. అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ యాత్ర ప్యాకేజీలో వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప దేవాలయాలతో పాటు ముఖ్యంగా సరస్వతి నదిలో పుష్కర స్నానం ఏర్పాటు చేశారన్నారు. అమలాపురం డిపో నుంచి ఇంద్ర ఏసీ సర్వీసు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బస్సులకు ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. రిజర్యేషన్ టికెట్ కోసం సెల్ నంబర్ల 99592 25576, 99592 25550, అసిస్టెంట్ మేనేజర్ 70138 68687 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. సూపర్ లగ్జరీ బస్సు టికెట్ చార్జి ఒక్కరికీ రూ.2,200, ఇంద్ర ఏసీ బస్సు టికెట్ చార్జి రూ.2,700, బస్సు సరిపడే ప్రయాణికులు వస్తే వారి కోరిన గ్రామం నుంచి నేరుగా బస్సులను పంపిస్తామని అమలాపురం డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవకుమార్ కోరారు.
మార్పులతో కుంటు పడుతున్న విద్యాభివృద్ధి
అమలాపురం టౌన్: ప్రభుత్వ విధానాల వల్ల రోజు రోజుకు విద్యా విధానంలో మార్పుల అనివార్యమై విద్యాభివృద్ధి కుంటుపడుతోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌కుమార్ అన్నారు. స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉద్యమ శిక్షణ తరగతుల్లో మనోహన్ కుమార్ మాట్లాడారు. శిక్షణకు జిల్లా గౌరవాధ్యక్షుడు పెంకే వెంకటేశ్వరరావు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. విద్యా రంగానికి నిధుల తగ్గింపు, ఉపాధ్యాయుల సంఖ్య కుదింపుతో రాబోయే కాలంలో విద్య బడుగు బలహీన వర్గాలకు దూరమవుతుందని మనోహర్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర మరో కార్యదర్శి అరుణకుమారి ‘ప్రస్తుత విద్యా రంగ పరిస్థితులు– ఉపాధ్యాయుల కర్తవ్యం’ అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ‘బదిలీల చట్టం, ఉపాధ్యాయుల పని పద్ధతులు’ అనే అంశాలపై కూడా వివరించారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీ సుబ్బారావు మాట్లాడుతూ అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించినప్పుడే సమ సమాజ స్థాపన జరుగుతుందన్నారు.

సరస్వతీ నదీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు