
అప్రమత్తతతో మలేరియా అంతం
● డీఎంహెచ్‌వో డాక్టర్ దుర్గారావు దొర
● అమలాపురంలో అవగాహన ర్యాలీ
అమలాపురం టౌన్: మలేరియా మహమ్మారిని మనమంతా అప్రమత్తతతో అంతం చేద్దామని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఎం. దుర్గారావు దొర జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో శుక్రవారం జరిగిన మలేరియా నిర్మూలన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ ఏడాది మలేరియా దినోత్సవం సందర్భంగా ‘మలేరియా మనతోనే అంతం’ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన కార్యాచరణకు అనుగుణంగా ఈ ఏడాదంతా ఆ వ్యాధి నిర్మూలనకు నడుం బిగించాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గ దర్శక సూత్రాల ప్రకారం జిల్లాలోని ప్రతి ఒక్కరూ మలేరియా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మలేరియా రోగ నిర్ధారణకు పాటించాల్సిన విధానాలు, నియంత్రణకు వహించాల్సిన జాగ్రత్తలను వివరించారు. మలేరియా సోకితే మనిషికి ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, వైద్య మార్గాలపై అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నుంచి ముమ్మిడివరం గేటు సెంటరు వరకూ మలేరియాపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని డీఎం అండ్‌హెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, మలేరియా, ఫైలేరియా సిబ్బంది నినాదాలతో కూడిన ఫ్ల కార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు, ప్రభుత్వ వైద్యాధికారి ఎం.ఎం.మణిదీప్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు ఎన్‌వీ రామారావు, ఎస్.రాజబాబు, ఫైలేరియా సూపర్‌వైజర్ ఎస్.సత్యనారాయణ, హెల్త్ విజిటర్ ఎ.లక్ష్మి పాల్గొన్నారు.