
రండి..రండి.. దయ చేయండి
ప్రయోజనాలు వివరిస్తూ..
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వలన విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. పలు పాఠశాలల పోస్టర్లలో ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు మధ్య తేడాను తెలియజేశారు. పాఠశాలల వద్ద ఆయా పాఠశాలల విద్యార్థులు సాధించిన ప్రగతిని ఫ్లెక్సీల రూపంలో వేశారు.
● విద్యార్థులకు ఉపాధ్యాయుల ఆహ్వానం
● ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు
పెంచేందుకు చర్యలు
● చురుగ్గా ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
రాయవరం: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఈ ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచుకునే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా ఆయా పాఠశాలల ఆవాస ప్రాంతాల్లో పిల్లల తల్లిదండ్రులను కలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను వివరిస్తూ, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కోరుతున్నారు. ఈ నెల 16 నుంచి చేపట్టిన ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ బుధవారంతో ముగియనుంది.
5 ప్లస్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
విద్యార్థులను ఆయా తరగతుల్లో చేర్చించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వారి ఇళ్ల బాట పట్టారు. ముఖ్యంగా ఐదేళ్లు నిండిన చిన్నారులను ఒకటో తరగతిలో చేర్పించేందుకు గ్రామాల్లో హేబిటేషన్ల వారీగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతున్నారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, ఆయా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా తల్లిదండ్రులను కోరుతున్నారు. అడ్మిషన్ల ప్రక్రియను జిల్లా విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి ఐదేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతిలో చేర్పించడం వీరి లక్ష్యం.
ప్రవేశాలు తగ్గకుండా..
ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 9,239 మంది ఐదేళ్లు నిండిన చిన్నారులున్నట్లు గుర్తించారు. వారందరినీ ప్రభుత్వ బడుల్లో తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే గతేడాది ఒకటో తరగతిలో 19,910 మంది చదువుకున్నారు. ఈ ఏడాది కూడా ఆ సంఖ్యకు తగ్గకుండా ప్రవేశాలు కల్పించాలని జిల్లా విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. అలాగే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 1,79,758 మంది విద్యార్థులను పైతరగతులకు పంపించి, ఆయా సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహనకు కృషి చేశారు. అలాగే పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్లస్ 2 పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తున్నారు.
ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరం చివరిలో వారం రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. బడిఈడు చిన్నారులందరినీ పాఠశాలల్లో చేర్చాల్సిందిగా ఆదేశాలిచ్చాం. మండలాల వారీగా ఎంఈవోలతో సమీక్షించాం.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, అమలాపురం

రండి..రండి.. దయ చేయండి