
సజ్జలను కలిసిన జగ్గిరెడ్డి
కొత్తపేట: రాష్ట్ర వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పీఏసీ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లా నూతన అధ్యక్షునిగా జగ్గిరెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జగ్గిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి, శాలువాతో సత్కరించారు. తనను జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. తనపై ఎంతో నమ్మకంతో జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కో ఆర్డినేటర్‌గా, పీఏసీ కన్వీనర్‌గా మీరు నిర్థేశించిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తానని సజ్జలకు హామీ ఇచ్చారు. దానిలో భాగంగా జిల్లాలో నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.
కార్మికులకు వెనుదన్నుగా
ఈ–శ్రమ్ కార్డు
అమలాపురం రూరల్: కార్మికుల సంక్షేమానికి, భద్రతకు వెనుదన్నుగా ఈ–శ్రమ్ కార్డు నిలుస్తుందని జిల్లా సహాయ కార్మిక శాఖ కమిషనర్ టి.నాగలక్ష్మి ప్రకటనలో పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ఈ– శ్రమ్ సామాజిక భద్రత కల్పించి, సంక్షేమ పథకాల్లో మరింతగా భాగస్వాములను చేయడం ద్వారా వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత డేటా బేస్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా, గ్రామీణ అభివృద్ధి సంస్థ, మెప్మా డ్వామా శాఖల భాగస్వామ్యంతో ఆన్‌లైన్ డేటా రూపొందిస్తామన్నారు. 16–50 ఏళ్ల మధ్య వయసు కలిగిన వివిధ రంగాల కార్మికులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు ఇందుకు అర్హులన్నారు. ఈ కార్డు పొందేందుకు, ఈ–శ్రమ్ నమోదుకు ఖర్చు లేదని పైగా ఆటో రెన్యువల్ సదుపాయం ఉందన్నారు. నమోదైన కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించినా శాశ్వత అంగవైకల్యం పొందిన రూ.2లక్షల సహాయం అందుతుందన్నారు. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష వస్తుందన్నారు. ఈ–శ్రమ్ కార్డు నమోదు అన్ని గ్రామ వార్డు సచివాలయాలు, కస్టమర్ సర్వీస్ కేంద్రాలలో చేసుకోవచ్చునన్నారు.