
లోకంలో దుఃఖం మాత్రమే ఉందా? లేదు, సంతోషం కూడా ఉంది. శత్రుత్వపు చేదు మాత్రమే ఉందా? లేదు, ఆపదలో ఆదుకునే స్నేహమాధుర్యమూ ఉంది. సమరమే కాదు, శాంతీ; సంఘర్షణే కాదు, సామరస్యమూ; భయబీభత్సాలే కాదు; కరుణారౌద్రాలూ ఉన్నాయి. ఒక్కోసారి ప్రళయ తాండవంతో భయపెట్టే ప్రకృతిలోనే, సేదదీర్చే అందాలూ, ఆహ్లాదాలూ ఉన్నాయి.
కానీ ఎంత సేపూ పెద్ద పెద్ద కష్టాలనే ఊహించుకుంటూ చిన్న చిన్న సంతోషాలను విస్మరిస్తాం. జీవితాన్ని ముళ్ళకంపగా భావించుకుంటూ పక్కనే ఉన్న మల్లెపొదల గుబాళింపును గమనించలేకపోతాం. జీవించడం కోసం చేసే ప్రయత్నంలో మనసారా జీవించడాన్ని మరచిపోతాం.
మన పక్కనే ఉన్న మంచినీ, మానవత్వాన్నీ గుర్తించడంలో ఎలా విఫలమవుతామో ఒక చక్కని కథలో రావిశాస్త్రి చిత్రిస్తాడు. ఆ కథలో ఇద్దరు మిత్రులుంటారు. ఒకతను ఎప్పుడూ ఏదో కష్టంలో చిక్కుకుని కుంగిపోతూ ఉంటాడు; నిరాశానిస్పృహలకు ప్రతిరూపంగా మారి జీవితంపై విరక్తుడ వుతుంటాడు. రెండో వ్యక్తి ప్రతిసారీ అతనికి చేయందించి సమస్య నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు.
అలా అతను తేరుకున్న ఓ రోజున తన ఖర్చుతో సినిమాకు తీసుకెడతాడు. ఆ సినిమాలోని ప్రతి నాయకుడు నాయికానాయకులను పెడుతున్న ముప్పుతిప్పలు చూసి, లోకంలో ఎక్కడా మంచి తనం, మానవత్వమే లేవంటూ అతను భారంగా నిట్టూర్చుతాడు. పక్కనే ఉన్న మిత్రుడు అతని వైపు ఒకసారి వింతగా చూసి మనసులోనే నవ్వుకుంటాడు.
ఇప్పుడు కొంత మారి ఉండచ్చు కానీ, నిన్నమొన్నటివరకు పెళ్లి అనగానే కట్నాలు, కయ్యాలు, అలకలు, మాటపట్టింపులు, మనస్పర్థలే గుర్తుకొచ్చేవి. గుండె బరువెక్కించే ఇలాంటి అలవాటు పడిన చిత్రణకు భిన్నంగా అడుగడుగునా ఆహ్లాదం నింపేలా ఎవరైనా పెళ్లి కథను నడిపిస్తే అది మండువేసవిలో హఠాత్తుగా వీచిన మలయానిలంలా అలరిస్తుంది. ‘వసుంధర’ రాసిన ‘పెళ్ళిచేసి చూడు’ అనే నవల అలాంటి ఓ అరుదైన ఆశ్చర్యం. అందులో ముగ్గురు అన్నదమ్ములు, వారి భార్యలు ఆడబడచు పెళ్లిని తలకెత్తుకుంటారు.
అన్ని విషయాలూ కలసి చర్చించుకుంటారు, సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు, సమానంగా బరువు బాధ్యతలు పంచుకుంటారు, సంఘ టితంగా అడుగులు వేస్తారు. మగపెళ్ళివారి నుంచి సాధారణంగా ఎదురయ్యే సమస్యలే వస్తాయి. జయప్రదంగా పెళ్లి చేయడం ఒక్కటే లక్ష్యంగా వాటిని తెలివిగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఎలాంటి క్లిష్టపరిస్థితిలోనూ ఆందోళనకు లోనుకారు; ఒకరిపై ఒకరు లోక్తులు విసురుకుంటూ, ఒకరి నొకరు ఆటపట్టించుకుంటూ పరిసరాలను సంతోషభరితం చేసుకుంటారు. కల్యాణాన్నే కాదు, కల్యాణం చేయించిన తీరునూ కమనీయం చేస్తారు.
ఈ ‘పెళ్ళిచేసిచూడు’ నమూనా పెళ్లికే కాదు; తమలో తమకున్న అన్ని విభేదాలనూ పక్కన పెట్టి పదిమందీ ఉమ్మడిగా నిర్వర్తించాల్సిన ఏ బాధ్యతకైనా వర్తిస్తుంది. ఉదాహరణకు, దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమన్న ఉమ్మడి లక్ష్యం దిశగా విజయవంతంగా నడిపించడంలో అధికారపక్షానికీ, ప్రతిపక్షాలకూ కూడా చక్కని ఒరవడి అవుతుంది.
గొప్ప తాత్విక గాంభీర్యమూ, బహిరంతర్ఘర్షణా, జీవితం గురించిన చిక్కు ప్రశ్నలూ, ఒడుదొ డుకులూ ఉన్న రచనల్లోనూ, బరువైన పాత్రల సరసనే, వాతావరణాన్ని తేలిక చేసి ఉల్లాసపరిచే పాత్రలూ కనిపిస్తూ ఉంటాయి. అవి జీవితం తాలూకు అన్ని పార్శ్వాలనూ స్పృశించే రచయిత దృష్టివైశాల్యాన్ని పట్టి చూపుతాయి. బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ నవలలోని జగన్నాథం అలాంటి పాత్ర. సమస్యలకు అతీతంగా, దేనిమీదా ఎలాంటి ఫిర్యాదూ లేకుండా, సరదాగా, స్నేహంగా, హాస్యంగా ప్రవర్తించే జగన్నాథం చిన్నపాత్రే అయినా నాయకుడు దయానిధితో సమా నంగా గుర్తుండిపోతాడు.
గమనించే చూపే ఉండాలి కానీ, అలాంటి వ్యక్తులు మన నిజజీవితంలోనూ మన చుట్టుపక్కల తారసపడుతూనే ఉంటారు. తను రచయితా, గొప్ప చదువరీ కాక పోయినా ప్రతి సాహిత్యసమావేశంలోనూ, రచయితల గోష్ఠుల్లోనూ విలక్షణమైన వాక్చాతుర్యంతో తన ఉనికిని ప్రముఖంగా చాటుకునే సంకు పాపారావు అనే రావిశాస్త్రి మిత్రుని గురించి వైజాగ్ లోనూ, బయటా కూడా సాహితీ ప్రముఖులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.
తమ ఉజ్జ్వల వ్యక్తిత్వంతో శత్రుమిత్రుల తేడా లేకుండా అందరి మధ్యా సమానంగా తళుకులీనే పాత్రలూ ఆ యా విశిష్ట రచనల్లో కనిపిస్తాయి. అమెరికా అంతర్యుద్ధం నేపథ్యంగా మార్గరెట్ మిచెల్ రచించిన ‘గాన్ విత్ ద విండ్’ నవలలోని మెలనీ పాత్ర అలాంటిది. చాలా అర్భకంగా, అమాయకంగా ఉండే మెలనీ, ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియని తన ఉదాత్త వ్యక్తిత్వంతో ఆ నవలలోని ఇతర ప్రధాన స్త్రీ, పురుషపాత్రలను మించి ఎంతో ఎత్తుకు ఎదిగిపోతుంది.
అభద్రత, అల్లకల్లోలం, ఉద్రిక్తత, స్థానభ్రంశం, లేమి నిండిన ఆ యుద్ధ వాతావరణం వజ్రం లాంటి ఆమె వ్యక్తిత్వానికి మరింత సానపట్టి కొత్త కాంతుల్ని ఆవిష్కరింపజేస్తుంది. యుద్ధం వరకే శత్రుత్వమని చెప్పి స్వపక్షంతో ఒంటరి పోరాటం చేసి, శత్రు సైనికుల సమాధుల వద్ద కూడా మెలనీ పుష్ప గుచ్ఛాలు ఉంచి వస్తుంది.
ఇలాంటి పాత్రలూ, వ్యక్తులూ ప్రపంచాన్ని మరింత ఆశావహంగానూ, వాసయోగ్యం గానూ రూపిస్తారు. బతుక్కి ఓ అర్థాన్ని, పరమార్థాన్ని సంతరిస్తారు. ప్రేమనూ, స్నేహాన్నీ ఇచ్చి పుచ్చుకుని జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోడానికి స్ఫూర్తినిస్తారు. మిట్టపల్లాల చీకటిదారిలో దీపస్తంభాలవుతారు.