
ఎవరు ఎంతగా వ్యతిరేకించినా వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారబోతోంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా స్వోత్కర్షలకు పోవచ్చు. కానీ క్లిష్ట సమయాలే ఎవరేమిటన్నది నిగ్గుదేలుస్తాయి. బిల్లు పార్లమెంటులో గట్టెక్కడం మాట అటుంచి టీడీపీ ఇన్నాళ్లుగా వేస్తున్న సెక్యులర్ వేషాలకు తెరపడింది. టీడీపీ, జేడీ(యూ)ల మద్దతు లేనిదే కేంద్రంలో ప్రభుత్వాన్నే నడపటం సాధ్యం కాని దీనస్థితిలోవున్న ఎన్డీయే సర్కారు... ఇప్పుడు వక్ఫ్ బిల్లుపై సునాయాసంగా తన పంతం నెగ్గించు కోవటం ఎలా సాధ్యమైందో అందరికీ తేటతెల్లమైంది.
వీరితోపాటు మొదట వీరావేశంతో మాట్లాడిన ఒడిశాకు చెందిన బీజేడీ ఆఖరి నిమిషంలో స్వరం మార్చి పార్టీ ఎంపీలకు స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రకటించటం ప్రభుత్వానికి కలిసొచ్చింది. నిరుడు ఆగస్టులో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆదరా బాదరాగా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తహతహలాడినా విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించటంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) పరిశీలనకు పంపక తప్పలేదు.
ఎన్డీయే సర్కారు ఏర్పాటైన పదేళ్లలో ఒక బిల్లు జేపీసీకి వెళ్లటం అదే ప్రథమం. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెరిగిన బలం వల్లనైతేనేమి, ఏపీకి చెందిన కొందరు దిగజారుడు ఎంపీలతో రాజీనామాలు చేయించటం వల్లనైతేనేమి అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీయే బలం పెరిగింది. అందుకే వక్ఫ్ బిల్లు సునాయాసంగా గట్టెక్కుతుందని అధికారపక్షం నిర్ణయానికొచ్చింది.
వక్ఫ్ ఆస్తులకు సంబంధించి సమస్యలు లేవని ఎవరూ అనరు. ఎన్నడో 1954లో వచ్చిన తొలి వక్ఫ్ చట్టం అవసరాలకు అనుగుణంగా లేదన్న ఉద్దేశంతో 1995లో దాని స్థానంలో మరో చట్టం తీసుకొచ్చారు. 2013లో సవరణలు చేశారు. అయినా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వక్ఫ్‌కు సంబంధించిన ఆస్తుల్లో దాదాపు సగంవరకూ వాటి యాజమాన్యం లేదా నిర్వహణకు సంబంధించి సమస్యలున్నాయి. అవినీతి ఉన్నదనీ, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనీ ఆరోపణలు రావటం కూడా వాస్తవం.
పారదర్శకత పాటించటంలేదన్న విమర్శ కూడా ఉంది. వీటిని సరిదిద్దాలంటే ముస్లిం పండితులతో, నిపుణులతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి సంస్థలతో మాట్లాడాలి. ఎలావుంటే బాగుంటుందన్న అంశంలో సూచనలూ, సలహాలూ తీసుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండా బిల్లు తీసుకురావటంతో ముస్లిం వర్గాల్లో సంశయాలకు అవకాశం ఏర్పడింది. ముస్లింల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెప్పటం బాగానేవున్నా ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంది.
బుజ్జగింపు ధోరణితో, ఓటుబ్యాంకు రాజకీయాలపై దృష్టితోనే బిల్లును వ్యతిరేకిస్తున్నారని విపక్షాలపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం తాను చేసిందేమిటో ఆలోచించిందా? నిజంగా చిత్తశుద్ధి వుంటే బిల్లు రూపకల్పనకు ముందు ఆ వర్గాలతో చర్చించటానికి అభ్యంతరమేమిటి? ముస్లిమేతరులకు వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో స్థానం ఎందుకు కల్పించారన్న విషయమై ప్రభుత్వం ఇచ్చిన సంజా యిషీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు.
మసీదుల నిర్వహణ లేదా మతపరమైన ఇతర అంశాలకు సంబంధించి వక్ఫ్ కౌన్సిళ్లు జోక్యం చేసుకోబోవని, కేవలం వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలనే చూస్తాయని కేంద్రమంత్రులు అమిత్ షా, కిరణ్ రిజుజు చెబుతున్నారు. కానీ మౌలికంగా వక్ఫ్ ఆస్తి అంటే సంపన్న ముస్లింలు భక్తిభావనతో మతపరమైన అవసరాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం దానం చేసే ఆస్తి.
అటువంటప్పుడు ఆ ఆస్తుల నిర్వహణలో అన్యులకు చోటీయటం అసమంజసం కాదా? ఇతర మతాలకు సంబంధించిన ధార్మిక ఆస్తుల నిర్వహణలో కూడా ముస్లింలకు అవకాశం ఇస్తారా? ఒకవేళ అలా ఇచ్చినా అందుకు ఆ మతస్తులు అంగీకరిస్తారా? ఇంతకాలం ముస్లిమేతరులు సైతం తమ ఆస్తిని కారుణ్య భావనతో వక్ఫ్‌కు ఇవ్వొచ్చన్న నిబంధన ఉండేది.
కానీ తాజా సవరణ ప్రకారం అయిదేళ్లపాటు ఇస్లామ్‌ను ఆచరిస్తేనే అందుకు అర్హత వస్తుంది. అయితే ఇస్లామ్ ఆచరణే మిటో బిల్లు వివరించలేదు. 2013లో ఆ మరుసటి సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఆదరా బాదరాగా వక్ఫ్ చట్టానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం సవరణలు తెచ్చిందని, అందువల్ల ఒక్క ఢిల్లీలోనే అనేక ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా మారాయని ప్రభుత్వం చెబుతున్నది. కానీ ఆ సవరణలను నాటి బీజేపీ నేతలు ఎల్‌కే అడ్వాణీ, సుష్మాస్వరాజ్ సమర్థించారు. సవరణలు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించటంలో తోడ్పడ్డారు.
వక్ఫ్ బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశంపై దేశవ్యాప్తంగావున్న 20 కోట్లమంది ముస్లింలలో ఎన్నో సంశయాలున్నాయి. బిల్లులోని నిబంధనలు ఆ సంశయాలను మరింత పెంచేవిగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల్ని ఆర్నెల్లలోపు డేటా బేస్‌లో నమోదు చేయనిపక్షంలో వాటికి సంబంధించిన వివాదాలపై న్యాయస్థానాల మెట్లెక్కటం అసాధ్యమని బిల్లు చెప్పటం సమంజసంగా అనిపించదు.
వివాదంలో పడిన వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ ఉన్నతాధికారి నిర్ణయం అంతిమం కావటం కూడా సమస్యాత్మకం. ఏ ఉన్నతాధికారైనా ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటం సాధ్యమేనా? ఇది అనుమానాలు రేకెత్తించే అవకాశం లేదా? మొత్తానికి తెలుగుదేశం వంటి పక్షాలు బిల్లుకు ఓటేసి, ఆపైన సవరణలు తీసుకొచ్చామంటూ లీకులిస్తూ, తమ సవరణలతో బిల్లు పకడ్బందీగా వచ్చింద నడం హాస్యాస్పదం.
అందులోని డొల్లతనం ఏమిటో ఈ నిబంధనలే చెబుతున్నాయి. క్లిష్ట సమయాల్లో తటస్థత వహించటం ద్రోహంతో సమానం. తటస్థత మాట అటుంచి నిస్సంకోచంగా బిల్లును సమర్థించి టీడీపీ తన నైజాన్ని బయట పెట్టుకుంది. ఇందుకు మూల్యం చెల్లించక తప్పదు.