
బీమా.. లేదిక ధీమా!
కూటమి ప్రభుత్వంలో నిలిచిన పథకం
● పది నెలలుగా బాధిత కుటుంబాల ఎదురుచూపులు ● రెట్టింపు సాయం అంటూ ఎన్నికల సమయంలో హామీలు ● గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా సాయం అందజేత ● 2023–24లో 714 మందికి రూ.9.82 కోట్ల చెల్లింపు
భీమవరం(ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుటుంబ యాజమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అందించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణం పొందితే రూ.లక్ష సాయం అందించి బాధితులను ఆదుకుంది. దీంతో బాధిత కుటుంబ బతుకు దెరువు ముందుకు సాగేది. ఎవరైన వ్యక్తి చనిపోయారని తెలిసిన వెంటనే సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబం ఇంటికి వెళ్ల్లి వెంటనే బీమా పథకం క్లయిమ్ కోసం ఆన్‌లైన్ చేసేవారు. ఆన్‌లైన్ చేసిన 21 రోజుల్లో నామినీకి (కుటుంబ సభ్యులు) బీమా సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. అయితే ఇంతటి ప్రాధాన్యమున్న బీమా పథకం అమలుపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఎన్నికల సమయంలో రెట్టింపు భరోసా అంటూ హామీ ఇచ్చి ఇప్పటికీ పథకం అమలుకు విధివిధానాలు ప్రకటించలేదు.
బీమాకు ఎసరు
కూటమి మేనిఫెస్టోలో చంద్రన్న బీమా కింద సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారం చేపట్టి 10 నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ పథకం ఊసే ఎత్తడం లేదు. కేవలం పేరు మార్పుతో సరిపెట్టిన సర్కారు అమలు దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో బీమా పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పాలనలో సహజ మరణం, ప్రమాదవశాత్తూ మరణం పొందిన కుటుంబాల్లో బాధితులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. పేదల జీవితాలకు భరోసాగా ఉండే బీమా పథకం అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో 800 మంది వరకు..
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీమా పథకానికి అర్హులైన సుమారు 800 మంది వరకు జిల్లాలో మరణించారు. వీరిలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారు 200 మంది వరకు ఉండగా, సహజ మరణం పొందిన వారు 600 మంది ఉన్నారు. ప్రమాదాల్లో శాశ్వత అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యం పొందిన వారు 200 మంది వరకూ ఉన్నారు. ఆయా కుటుంబాలు బీమా సొమ్ముల కోసం ఎదురుచూస్తున్నాయి. గత ప్రభుత్వంలో నిబంధనల మేరకు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉండి ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు సహజ మరణం పొందితే రూ.లక్ష, శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం పొందితే రూ.2.50 లక్షలు బీమా సొమ్ములు అందించారు.
గత ప్రభుత్వంలో (2023–24) బీమా చెల్లింపు
పశ్చిమగోదావరి జిల్లా
కేటగిరీ సంఖ్య సాయం
(రూ.కోట్లలో)
ప్రమాదవశాత్తూ
మరణించిన వారు 30 1.50
సహజ మరణం
పొందిన వారు 266 2.66
మొత్తం 296 4.16
ఏలూరు జిల్లా
కేటగిరీ సంఖ్య సాయం
(రూ.కోట్లలో)
ప్రమాదవశాత్త్తూ
మరణించిన వారు 37 1.85
సహజ మరణం
పొందిన వారు 381 3.81
మొత్తం 418 5.66
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2023–24 సంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 714 కుటుంబాలకు బీమా పరిహారం కింద రూ.9.82 కోట్లు చెల్లించారు. వీరిలో 67 మంది ప్రమాదవశాత్తూ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3.35 కోట్లు, 647 మంది సహజ మరణం పొందిన వారి కుటుంబాలకు రూ.6.47 కోట్ల సాయం అందించారు.

బీమా.. లేదిక ధీమా!