
బనానా– మీల్‌మేకర్ పకోడా
కావలసినవి: అరటికాయ– 1 (తొక్క తీసి, ఉడికించి, చల్లారాక గుజ్జులా చేసుకోవాలి) మీల్‌మేకర్– 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుము కోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి– అరకప్పు చొప్పున, శనగపిండి, ఉల్లిపాయ తరుగు– పావుకప్పు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు– 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం– 1 టీ స్పూన్ చొప్పున, పసుపు– చిటికెడు, నిమ్మరసం– 2 టీ స్పూన్లు, నీళ్లు, నూనె– సరిపడా, ఉప్పు– తగినంత
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మీల్ మేకర్ తురుము, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, అరటికాయ గుజ్జు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తురుము అన్ని వేసుకుని సరిపడా నీళ్లుతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత చిన్న బౌల్‌లో శనగపిండి, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలచగా కలుపుకుని, అందులో కొద్ది కొద్దిగా అరటికాయ మిశ్రమాన్ని ముంచి, శనగపిండి మిశ్రమాన్ని బాగా పట్టించి, కాగుతున్న నూనెలో పకోడాలు వేసుకోవాలి. దోరగా వేగాక, వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.
గుజరాతీ ఖండ్వీ..
కావలసినవి: శనగపిండి, పెరుగు– ఒక కప్పు చొప్పున, పసుపు– పావు టీ స్పూన్, ఉప్పు– తగినంత, నీళ్లు– సరిపడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్, నూనె– 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు, నువ్వులు– ఒక టీ స్పూన్ చొప్పున కరివేపాకు– కొద్దిగా, కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము– గార్నిష్ కోసం
తయారీ: ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్ వేసి, ఉండలు లేకుండా సరిపడా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కళాయిలోకి వడకట్టి తీసుకుని చిన్న మంట మీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు మూడు నాలుగు ప్లేట్లు తీసుకుని వెనుక భాగంలో నూనె రాసి, వాటి మీద ఈ మిశ్రమాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే పలుచగా పూయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని, గుండ్రగా చుట్టుకోవాలి. అనంతరం ఆవాలు, నువ్వులు, కొత్తిమీర తురుము, కరివేపాకు వంటివన్నీ నూనెలో తాళింపు వేసుకుని, పచ్చి కొబ్బరి తురుముతో కలిసి.. గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
కొరియన్ యాక్‌గ్వా స్వీట్
కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు (జల్లెడ పట్టుకోవాలి), తేనె, నువ్వుల నూనె– ఒక కప్పు చొప్పున, సోజు లేదా వోడ్కా– ఒక టేబుల్ స్పూన్ (కుకీలను మరింత మెత్తగా ఉండటానికి కొరియన్స్∙వాడతారు), అల్లం పొడి – ఒక టీ స్పూన్, నూనె– సరిపడా, తేనె, నీళ్లు– ఒక కప్పుపైనే, నిమ్మరసం– 1 టేబుల్ స్పూన్, నట్స్ లేదా నువ్వులు– కొన్ని (నేతిలో వేయించాలి, గార్నిష్ కోసం)
తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, నువ్వుల నూనె, ఒక టీ స్పూన్ తేనె, సోజు లేదా వోడ్కా, అల్లం పొడి వేసుకుని, ఉండలు కాకుండా బాగా కలుపుకోవాలి. అనంతరం సరిపడా నీళ్ల పోసి చపాతీ ముద్దలా చేసుకుని, అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ ముద్దను అర అంగుళం మందంతో చపాతీలా ఒత్తుకుని, నచ్చిన మోడల్ కుకీ కట్టర్ సాయంతో కట్ చేసుకుని, వాటిని నూనెలో దోరగా వేయించుకోవాలి.
ఈలోపు ఒక పాత్రలో తేనె, నీళ్లు పోసుకుని చిన్న మంట మీద మరిగించాలి. ఆ మిశ్రమం కాస్త చిక్కబడిన తర్వాత నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం వేయించిన కుకీస్‌ను వేడివేడిగా ఉన్నప్పుడే ఈ తేనె సిరప్‌లో వేసుకుని నానబెట్టుకోవాలి. అనంతరం ప్లేట్‌లో పెట్టుకుని నట్స్ లేదా నువ్వులతో గార్నిష్ చేసుకోవచ్చు.
(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..? ఆఫీస్ వర్క్ చేయొచ్చా..?)