
ఆకాశమే హద్దు
అనుకున్నది సాధించాలంటే కష్టపడాలి
మేము సైతం అంటూ అనేక రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అంటూ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా పురుషులకే పరిమితం అని భావించే రంగాల్లో ప్రవేశించి ప్రతిభకు జెండర్‌తో సంబంధం లేదని నిరూపిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కెమెరా మహిళగా వెండి తెరపై అడుగు పెట్టి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ఒడిశాకి చెందిన ఫల్గు సత్‌పతి గురించి తెలుసుకుందాం. దశాబ్దానికి పైగా ఈ వృత్తిలో కొనసాగుతూ తన క్రియేటివిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఫల్గుకి ఒడిస్సీ నృత్యం అంటే చిన్నప్పటినుంచీ ఇష్టం ఏర్పడింది. అయిదేళ్ల వయస్సులోనే తల్లి ప్రోత్సాహంతో ఒడిస్సీ నేర్చుకుంది. గురువు పల్లవి దాస్ వద్ద శిక్షణ పొందింది. అనేక ప్రదర్శనలిచ్చింది. నృత్యాకారిణిగా రాణించింది. దీంతో పాటు, బాల్యంనుంచే నాటకాల పట్ల ఆకర్షితురాలైంది. బాలనటిగా, బిజయ్ మొహంతి, తాండ్రా రే వంటి అనుభవజ్ఞులతో కలిసి దూరదర్శన్‌లో నటించింది. కనిపించాను. ఈ సందర్భంలోనే వెండితెర వెలుగుల వెనుక ఇంకా చాలామంది ఉంటారని గమనించింది. సినిమాలంటే ఇష్టంగా మారింది. అమ్మమ్మ ఒడియా సినిమాలు చూడటానికి థియేటర్స్‌కి వెళ్లేది. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా , ప్రతీ అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించేది ఫల్గు. ఒకసారి అనుకోకుండా 'కరణ్ అర్జున్' చూసి దర్శకత్వంపై మోజు పెంచుకుంది.

ఈ క్రమంలో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ BPFTIO (బిజు పట్టనాయక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒడిశా)గురించి అక్కడ దీనికి సంబంధించిన కోర్సులో చేరాలని ప్రయత్నించింది. కానీ సెలెక్ట్ కాకపోవడంతో సినిమాటోగ్రఫీలో చేరేలా చేసింది. ఎందుకంటే దర్శకుడు తర్వాత కెమెరామన్ పనితీరు అత్యద్భుతమని ఆమె నమ్మకం. అయితే, ఇక్కడ చదువుకుంటున్న క్రమంలో , సినిమా తీయడం వెనుక చాలా మంది నిపుణులు, కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారని ఫల్గు గుర్తించింది. ఇక్కడ చదువు పూర్తైన తరువాత, కాలేజీలో తన సీనియర్ దగ్గర తొలుత ఒక రియాలిటీ షోకి పనిచేసింది. తర్వాత సుశాంత్ మణి, శుభ్రాంశు దాస్‌లాంటి పేరెన్నికగన్న ఛాయాగ్రాహకులతో కలిసి వర్క్ చేసింది.
తొలి ప్రాజెక్ట్‌తోనే ప్రశంసలు
ఫల్గు తొలి స్వతంత్ర ప్రాజెక్ట్ , ఒడియా చిత్రం 'పుష్కర. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) గా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇంకా శిక్షా మండల్, ఫౌజీ కాలింగ్ (హిందీ ఫీచర్ ఫిల్మ్) , దివానా దివానీ, హలో ఇన్ లవ్, సపనార పాథే పాథే', 'లవ్ యు జెస్సికా', 'ము తారా కియే' వంటి ఒడియా చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేసింది. అనేక రియాలిటీ షోలకు వెబ్ సిరీస్‌లకు కూడా సహాయ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసింది.'బెటర్ హాఫ్' అనే మరాఠీ చిత్రానికి వర్క్ చేసింది.
ఫల్గు కెమెరా పనితనానికి నిదర్శనంగా ‘పడే ఆకాశ’ ఈ మహిళా దినోత్సవానికి విడుదల కానుంది. దివ్యాంగుల హక్కుల కోసం వీల్ చైర్ నుంచే అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒడియా మహిళ డా. శ్రుతి మహాపాత్ర జీవితం ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. అంతేకాదు ఒడియాలో మంచి హిట్ సాధించిన పుష్కర మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఘనత కూడా ఫల్గుదే కావడం విశేషం. ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయమైన నటుడు హరా రాత్‌ని 2013 లో వివాహం చేసుకుంది.
ఆకాశమే హద్దు..
‘‘మహిళ సినిమాటోగ్రఫీ అనే ఈ వృత్తిని ఎంచుకోవడం అంత సులభం కాదు. శారీరకంగా , మానసికంగా చాలా కష్టపడాలి. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, పోరాడాలసిందే. ఈ విషయంల అత్తమామలు నా కుటుంబం మద్దతు చాలా ఉందని తెలిపింది. ఫల్గు. సమాజంలోని కట్టుబాట్ల నుంచి అమ్మాయిలను విముక్తి పొందనివ్వాలి. గొప్పగా ఆలోచించి, విజయాలు సాధించేలా వారిని ప్రోత్సహించాలి. ఈ ప్రపంచంలో ఏదీ తమ జీవితాల్లో విజయం సాధించకుండా ఆపదని అమ్మాయిలు గ్రహించాలి. ఆకాశమే హద్దు అనే దృఢ సంకల్పంతో ఎదగాలి’’ అంటుంది ఫల్గు. కెరీర్‌కు సంబంధించి మనం ఏ సినిమాకు పనిచేస్తున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఎవరితో కలిసి పనిచేస్తున్నాం అన్నదీ అంతే ముఖ్యం అంటుంది.