
నీటి అడుగున వ్యాయామాలతో అదనపు లాభాలు
సమ్మర్ సీజన్‌లో స్విమ్మింగ్‌తో పాటు మరెన్నో
ఎక్సర్‌సైజ్‌లు, ఫన్ యాక్టివిటీస్‌కు చిరునామాగా పూల్స్
అన్ని మెట్రో నగరాల్లోనూ ఆక్వా ఫిట్‌నెస్ పట్ల క్రేజ్
పొద్దున్నే లేచి వ్యాయామం కోసం జిమ్‌కి వెళదామని ట్రాక్ సూట్, షూ ధరించేలోగానే చెమట్లతో తడిపేసే సీజన్ ఇది. అందుకే నగరవాసులు నీటి అడుగునే జిమ్‌దగీకి జై కొడుతున్నారు. చల్లని నీటిలో ఓ వైపు శరీరాన్ని చల్లబరుస్తూ.. మరోవైపు వ్యాయామాలు చేస్తూ సేదతీరుతున్నారు. ముంబై, బెంగళూర్ తదితర నగరాలతో పాటు భాగ్యనగరిలో కూడా ఆక్వా వర్కవుట్స్‌కి ఫిదా అవుతోంది నగర యువత.
– సాక్షి, సిటీబ్యూరో
పింగ్ జాక్‌లు, ఆర్మ్ లిఫ్ట్‌లు, లెగ్ కిక్స్, లెగ్ షూట్స్ ఇవన్నీ.. రోజూ జిమ్‌లో చేసేవే కదా అనుకోవచ్చు. అయితే అవన్నీ ఇప్పుడు నీటిలోనూ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు అనుసరిస్తున్న ఆక్వా వర్కౌట్‌లు/హైడ్రో ఎక్సర్‌సైజ్‌లు నగరంలోనూ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. సిటీలో ఏప్రిల్, మే నెలల్లో ఆక్వా సంబంధిత వ్యాయామాలకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక కొత్తఎత్తయిన భవనాల్లోనూ, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ అందుబాటులో ఉన్న పూల్స్‌లో ఈ వ్యాయామాల సందడి కనిపిస్తోంది. ‘ఇది సాధారణ వ్యాయామాల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే నీటిలో ఉన్నప్పుడు కాళ్లూ, చేతుల కదలికలకు పరికరాల కదలికను జోడించడం సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో క్యాలరీలను బాగా ఖర్చు చేయడంలో ఇది సహాయపడుతుంది. నీటిలో సౌకర్యవంతంగా ఉన్నంత వరకూ (ఇది పూల్స్‌లో ఎక్కువ లోతులేని వైపు ఉంటుంది) ఈ ఫార్మాట్ అన్ని వయసుల వారికీ పని చేస్తుంది అని చెబుతున్నారు ఆక్వా ఫిట్ ఇన్‌స్ట్రక్టర్ కవితారెడ్డి.
చదవండి : 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీ
వ్యాయామాలెన్నో..
ఆక్వా ఎరోబిక్స్‌ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు సిటీలో క్యాలరీలను బర్న్ చేసి రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడే అనేక నీటి ఆధారిత వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆక్వాటిక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఆక్వా జుంబా, హెచ్‌ఐఐటీ, తబాటా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఆక్వా యోగా, కిక్–బాక్సింగ్ వంటి అనేక రకాలైన వర్కవుట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘డంబెల్స్, నూడుల్స్, ఆక్వా బాక్సింగ్ గ్లోవ్స్, రెసిస్టెన్స్ ట్యూబింగ్, వాటర్ వాకింగ్, ఆక్వా థ్రెడ్‌మిల్స్, వాటర్ బైక్‌లు ఇంకా ఎన్నో.. పరికరాలతో చేసేందుకు ఆక్వా వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రయోజనాలెన్నో..
నీటి అడుగున వ్యాయామాలు బరువు తగ్గడానికి, కండరాలను టోన్ చేయడానికి, శక్తిని పెంచడానికీ సహాయపడతాయని అధ్యయనాలు నిరూపించాయి. తక్కువ అలసటతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. ఆర్థరైటిస్ రోగులకు ఇవి ఉత్తమమైనవి. అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఆక్వా వర్కౌట్‌లు గర్భిణులకు కూడా మంచిదని చెబుతున్నారు కవిత. ఈ వ్యాయామం వల్ల కీళ్లకు కూడా మేలైన రక్షణ ఉంటుంది. అందుకే సాధారణంగా గాయం నుంచి కోలుకునే క్రమంలో తరచూ హైడ్రో థెరపీని ఉపయోగిస్తారు. కార్డియో–ఇన్‌టెన్సివ్‌గా ఉంటాయి, గాలి కంటే నీరు 13 రెట్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి నీటి వ్యాయామాలు మరింత పటిష్టంగా ఉంటాయి. నేలమీది వ్యాయామం కంటే ఎక్కువ నిరోధకతను అందిస్తాయి. ఇది ఒక గంటలో 500–1,200 క్యాలరీలు బర్న్ చేయగలదు. నీటిలో ఉన్నప్పుడు శరీర బరువులో 10 శాతం మాత్రమే బరువు కలిగి ఉంటారు. కాబట్టి కీళ్ళు అన్‌లోడ్ చేయబడినట్లు అనిపిస్తుంది. నేల మీద మనం చేసే వ్యాయామాల్లో తప్పుడు కదలికల వల్ల లిగ్మెంట్స్ చిరిగిపోవడానికి /ఒత్తిడికి / బెణుకు లేదా పగుళ్లకు కారణమవుతుంది. నీటిలో వ్యాయామాల వల్ల గాయం అయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చికిత్స కోసం నీటి వ్యాయామాలు సిఫార్సు చేస్తారు. ఇది చురుకుదనం, వెయిట్‌లాస్ కోసం ప్రభావవంతంగా ఉంటాయి. కాలుతో త్రిభుజం ఆకారంలో ఉండే డెగేజ్ పాస్ వంటివి ఇందులో ఉన్నాయి. పూల్‌లో నీటి సాంద్రత కాలుని ఎక్కువ దూరం కదపడానికి సహాయపడుతుంది.
చదవండి : వాడికి భయపడి పబ్లిక్ టాయ్‌లెట్‌లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
కొన్ని సూచనలు
- మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం స్విమ్మింగ్ క్యాప్ ధరించడం ద్వారా చర్మం, జుట్టుకు క్లోరిన్ నుంచి రక్షణ లభిస్తుంది.
- అలాగే కళ్లను రక్షించడానికి నీళ్లు కంట్లో కలిగించే చికాకును నివారించడానికి గాగుల్స్ ధరించాలి.
- నిదానంగా వ్యాయామం ప్రారంభించి కొంచెం కొంచెంగా తీవ్రతను పెంచాలి.
- శ్వాసను ఎక్కువసేపు బిగబట్టుకోవద్దు. నీటి అడుగున కఠినమైన విన్యాసాలు చేయవద్దు.
- నైపుణ్యం, స్థాయి, సామర్థ్యానికి తగిన వ్యాయామాలు మాత్రమే చేయాలి.
- సరైన శిక్షణ పర్యవేక్షణలో ఉంటే తప్ప అధునాతన వర్కవుట్స్ ఎప్పుడూ ప్రయత్నించవద్దు.
- అనుభవం లేకుంటే డైవింగ్ లేదా ఫ్లిప్ చేయడం మంచిదికాదు.
అన్ని సీజన్స్‌లోనూ ఆరోగ్యకరమే..
ఈ వర్కవుట్ కేవలం వేసవిలో మాత్రమే కాదు అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరం. బెంగళూరులో ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారంగా ఎంచుకున్న ఈ వ్యాయామం నగరానికి వచి్చన తర్వాత నాకు పూర్తి స్థాయి ప్రొఫెషన్‌గా మారింది. దీని కోసం సింగపూర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఏరోబిక్ అండ్ ఫిట్‌నెస్ (ఫిసా) కోర్సును చేశాను. ప్రస్తుతం నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న స్ట్రోక్స్‌తో పార్ట్‌నర్‌గా ఆక్వా వర్కవుట్స్‌లో సిటిజనులకు శిక్షణ అందిస్తున్నాను. ఈ వ్యాయామాల లాభాలపై అవగాహన మరింత పెరిగితే అది మరింతమందికి మేలు కలిగిస్తుంది. – కవితారెడ్డి, ఆక్వా ఫిట్ శిక్షకురాలు