
భాషకు రెండువైపులా పదును ఉంటుంది! అందుకే దాన్ని జెండర్ ఈక్వాలిటీతో న్యూట్రల్ చేద్దాం!
చాలారోజుల కిందట ...
‘అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డుపాత్రలతో కుస్తీ పడుతున్నారు’ అంటూ తన ప్రొడక్ట్ అయిన అంట్లు తోమే సబ్బు గురించి ఒక యాడ్ ఇచ్చింది ప్రాక్టర్ అండ్ గాంబుల్ సంస్థ. వెంటనే ఆ కంపెనీకి ఓ పదకొండేళ్ల అమ్మాయి నుంచి ఉత్తరం వచ్చింది.. ‘భోజనం అందరికీ కావాలి, అంట్లతో కుస్తీ మాత్రం ఆడవాళ్లే పట్టాలి.
మగవాళ్లెందుకు అంట్లు తోమకూడదు? దయచేసి మీ యాడ్‌లో అమెరికాలోని ఆడవాళ్లు అని తీసేసి అమెరికా ప్రజలు అని మార్చండి?’ అని! ప్రాక్టర్ అండ్ గాంబుల్ తన తప్పు తెలుసుకుని ‘అమెరికా ప్రజలు’ అని మార్చుకుంది. ఆ ఉత్తరం రాసిన అమ్మాయెవరో కాదు.. మీడియా పర్సనాలిటీ, బ్రిటిష్ రాచకుటుంబం కోడలు మెఘన్ మార్కల్.
ఈ మధ్య..
‘మా సోషల్ బుక్‌లో ఒకచోట ‘మ్యాన్ మేడ్ ఆర్ నేచురల్?’ అని ఉంది. విమెన్ అని ఎందుకు లేదు? వాళ్లకు చేతకాదనా? మ్యాన్ లేదా ఉమన్ అనే బదులు ప్రజలు అనొచ్చు కదా? అబ్రహం లింకన్ కూడా ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అన్నాడు. ప్రజలంతా సమానమే అనుంటే బాగుండేది కదమ్మా!’ నిండా పదేళ్లు లేని ఓ చిన్నారి ఆలోచన!
సవరించుకోవాలి..
పై రెండు ఉదాహరణల్లోని విషయం.. భాషకూ జెండర్ ఈక్వాలిటీ ఉండాలనే! కొడుకు, కూతురు ఇద్దరూ సమానమనే ఎరుక పెంపకంతోనే మొదలవ్వాలని ఎలా అనుకుంటున్నామో.. భాష విషయంలోనూ అలాగే అనుకోవాలి. పనికి సామర్థ్యం, నిర్దేశిత అర్హతలు ప్రామాణికమవుతాయి కానీ స్త్రీ, పురుష జెండర్లు కావు కదా! ఆడవాళ్లు అల్లికలకే పరిమితమై పొవట్లేదు.. అంతరిక్షానికీ వెళ్తున్నారు. అందుకే తదనుగుణంగా భాషను సవరించుకోవాలి.
వాళ్లూ మినహాయింపు కారు..
జెండర్ స్పృహ ఉన్న రచయితలు, దర్శకులూ వాస్తవికత, రానెస్ పేరుతో స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరచే తిట్లన్నిటినీ రచనల్లో, సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. అదేమంటే ‘దాన్నెందుకు జెండర్ కోణంలోంచి చూస్తారు? కోపానికో.. ఆవేశానికో ఎక్స్‌ప్రెషన్‌గా చూడాలి కానీ’ అంటూ బదులిస్తున్నారు. అలా స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే మాటలను భావోద్వేగ వ్యక్తీకరణగా భాషలో సర్దేసి.. దాన్నో సాధారణ విషయంగా మన మెదళ్లకు తర్ఫీదునిచ్చిందీ పితృస్వామ్యమే!
కానీ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆలోచనను మార్చుకోవలసిన .. ఆ భాషను సరిదిద్దుకోవలసిన అవసరాన్ని గ్రహించాలి. పనులు, వృత్తులకున్న పేర్ల నుంచే ఇది మొదలవ్వాలి. ఈ కసరత్తు వల్ల లైంగిక పరిభాష, స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే భావోద్వేగ వ్యక్తీకరణలూ నెమ్మదిగా మెదళ్ల నుంచి డిలీట్ అవుతాయి.
దస్తావేజులు.. పాఠ్యపుస్తకాల్లోనూ..
ఈ విషయంలో పాశ్చాత్యదేశాల్లో కృషి జరుగుతోంది. ముఖ్యంగా ఇంగ్లిష్‌లో! ఎయిర్ హోస్టెస్‌ని ఫ్లయిట్ అటెండెంట్‌గా, మ్యాన్.. ఉమన్ అనే పదాలను పర్సన్‌గా, బాలుడు.. బాలికను చైల్డ్‌గా, వెయిటర్.. వెయిట్రస్‌ను సర్వర్‌గా, యాక్టర్.. యాక్ట్రెస్‌ను పెర్‌ఫార్మర్‌గా.. ఇంకా ఫైర్‌ఫైటర్, పోలీస్ ఆఫీసర్ వంటి ఎన్నో జెండర్ న్యూట్రల్ పదాలను ఉపయోగిస్తున్నారు.
ఇంకో అడుగుముందుకేసి జెండర్‌ను కేవలం స్త్రీ, పురుషులకే పరిమితం చేయకుండా మిగిలిన ఐడెంటీలనూ కలుపుకుంటూ అతడు, ఆమెకు బదులు They అనే పదాన్ని వాడుకలోకి తెచ్చుకున్నారు. స్కాండినేవియన్ దేశాలు సహా జర్మనీ, పోర్చుగల్, నెదర్లండ్స్ లాంటి యూరోపియన్ దేశాలైతే అధికారిక వ్యవహారాలు, దస్తావేజులు, పాఠ్యపుస్తకాల్లోనూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్‌ను ప్రోత్సహిస్తున్నాయి.
చట్టాలు కూడా
ప్రగతిశీల దేశాలు కొన్ని లింగ వివక్షను రూపుమాపేందుకు థర్డ్ జెండర్‌నీ కలుపుకుంటూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్‌ను ్ర΄ోత్సహించే చట్టాలనూ తెచ్చుకున్నాయి. ఆ జాబితాలో అమెరికా (ట్రంప్ వచ్చాక మార్పు వచ్చి ఉండొచ్చు), కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాలున్నాయి. ఇదివరకు స్త్రీకి చదువు లేదు.
ఇంటిపట్టునే ఉండేది కాబట్టి ఆ పనులు ఆడవాళ్లకే పరిమితమై వాటి పరిభాష అంతా స్త్రీ లింగంలోనే స్థిరపడింది. ఇప్పుడు మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమంగా రాణిస్తున్నారు. వాళ్ల పనికి గుర్తింపు, గౌరవ మర్యాదలు కావాలి. ఆ ప్రయత్నంలో తొలి అడుగు భాషదే. స్త్రీ, పురుష సమానత్వ ప్రయాణంలోని ప్రతి మార్పునూ గమనిస్తూ తదనుగుణంగా భాషను దిద్దుకోవాలి.
భాషకూ జెండర్‌కూ సంబంధం ఉంది
భాషకు, జెండర్‌కు ఉన్న సంబంధాన్ని సామాజిక శాస్త్రం, సాంస్కృతిక సిద్ధాంతాలు, భాషాశాస్త్రం, స్త్రీవాద కోణాల నుంచి చూడవచ్చు. విశ్లేషించవచ్చు. దీనిపై 1970ల నుంచే పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.
నిత్యజీవితంలో భాషను జెండర్‌ను నిర్దేశిస్తూ కాక, జెండర్ న్యూట్రల్‌గా వాడడానికి అవకాశం ఉందా అన్నది ఇటీవల మనదేశంలోనూ జరుగుతున్న చర్చ. పనిగట్టుకుని స్త్రీ అని చెప్పాలా లేక ఆ హోదా, ఆ పదవి, ఆ స్థానం మాత్రమే చెప్పి, అందులో ఉన్నది స్త్రీ అయినా, పురుషుడైనా సమానమేనని ధ్వనించేలా పదప్రయోగం ఉండాలా అన్నది దీని సారాంశం.
ఫలితంగా తెలుగులో అధ్యక్షుడు, అధ్యక్షురాలు అనకుండా ‘అధ్యక్షులు’ అని, మేనేజింగ్ డైరెక్టర్‌ని కార్యనిర్వహణాధికారి అంటే చాలనే అవగాహనకు వచ్చేశాం. మంత్రి, ఆచార్య, గురువు అనే పదాలనూ ఇద్దరికీ వాడుతున్నాం. చెప్పొచ్చేదేంటంటే భాషకూ జెండర్‌కూ సంబంధం ఉంది. స్త్రీలు మొరటుగా మాట్లాడినా, బూతులు వాడినా వెంటనే గగ్గోలవుతుంది. పురుషుడి దుర్భాషలను సహజంగా తీసుకునే అలవాటు ఇంకా పోలేదు. ఇవన్నీ స్త్రీవాద విమర్శలో చర్చించాల్సిన విషయాలు.
– సి. మృణాళిని, రచయిత
అనాగరికులుగా పరిగణిస్తారు..
మా ఫినిష్ భాష స్వతహాగా జెండర్ న్యూట్రల్ భాష. స్త్రీ, పురుషులిద్దరికీ ఒకే సర్వనామం ఉంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా కూడా లేకుండా అందరికీ ఒకేరకమైన సంబోధన ఉంటుంది. తెలుగులో స్త్రీకి ఇది, అది అనే పదాలున్నట్టు మా భాషలో లేవు. అందుకే స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరచే మాటలు ఉండవు. ఎప్పుడైనా ఎవరినోటి నుంచైనా అలాంటి ఇంగ్లిష్ మాటలు వినిపిస్తే వాళ్లను అనాగరికులుగా పరిగణిస్తారు. – ముచ్చర్ల రైతా ప్రదీప్, ఆంట్రప్రెన్యూర్ (తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్న ఫిన్లండ్ వనిత)
– సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: కాంతివంతమైన కళ్లకోసం...)