
సమానత్వ సాధనే లక్ష్యం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి 115 సంవత్సరాలైంది. అమానవీయమైన అణచివేతను, వివక్షను ఎదుర్కొన్న మహిళా కార్మికులు నెత్తురు ధారబోసి హక్కులకోసం తెగించి పోరాడారు. ఫలితంగా 8 గంటల పని దినాన్ని, వేతన పెంపుదలను, మరికొన్ని హక్కులను సాధించుకున్నారు. అయినప్పటికీ మహిళలు నేటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు. మన సమాజంలో, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో మహిళా లోకం పురుషుల కంటే తక్కువగానే ఉంటూ వస్తోంది. ఇంట్లోనూ, బయట ఉద్యోగాల్లోనూ – మహిళలు పూర్తి బాధ్యతను మోస్తున్నప్పటికీ – ఈ అసమానత కొనసాగుతుంది.
మహిళలు బలమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ, వారి మీద లైంగిక హింస పెరుగుతూనే వుంది. దళిత, మైనారిటీ మహిళలు ఎక్కువగా దాడులకు గురి అవుతున్నారు. ప్రొఫెసర్లు, సైంటిస్టులు, డాక్టర్ల దగ్గర నుండి పారిశుధ్య కార్మికుల వరకు – అందరికీ కాంట్రాక్టు, తాత్కాలిక పనులే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఈ పనుల్లో కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు రావడం లేదు. ఉద్యోగ బీమా పథకాన్ని కోల్పోవడం అంటే మహిళలను ప్రసూతి ప్రయోజనాలకుదూరంగా పెట్టినట్లే.
చదవండి! International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
1970లో పురుడు పోసుకున్న ‘ప్రగతిశీల మహిళా సంఘం’ ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించింది. నిర్బంధానికి అణచివేతకు గురయ్యింది. అనేక మంది వీరవనితలు అమరులయ్యారు. 12 రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన మహిళా పోరాటాలు నిర్వహించింది. భూమికోసం, ఇళ్ళస్థలాలకోసం, స్త్రీ పురుష సమానత్వంకోసం లైంగిక హింసకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నిర్మించాం. ఈ క్రమంలో 2013లో సంస్థ చీలికకు గురయ్యింది. ఫలితంగా మహిళా ఉద్యమాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూసాయి. వీటిని సమీక్షించుకొన్న తర్వాతరెండు సంస్థలు కలిసి భవిష్యత్లో ఒకే సంస్థగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 8వ తేదిన అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా విలీనం కావాలని రెండు సంస్థలు భావించాయి. ఈ విలీనానికి ఒంగోలు వేదిక కాబోతుంది.
– బి.పద్మ, ప్రధాన కార్యదర్శి,
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ), ఏపీ