వీధుల్లో కాదు విధుల్లోకి... | Telangana CM Revanth Reddy orders officials to appoint transgenders as traffic volunteers | Sakshi
Sakshi News home page

వీధుల్లో కాదు విధుల్లోకి...

Published Fri, Dec 20 2024 12:38 AM | Last Updated on Fri, Dec 20 2024 9:43 AM

Telangana CM Revanth Reddy orders officials to appoint transgenders as traffic volunteers

రిక్రూట్‌మెంట్‌ సమయంలో ట్రాన్స్‌జెండర్లతో మాట్లాడుతున్న హైదరాబాద్‌ నగరపోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

ట్రాన్స్‌‘జెమ్‌’డర్స్‌

కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్‌ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.

ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్‌జెండర్లు 

కట్‌ చేస్తే...
ట్రాన్స్‌జెండర్‌లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్‌ పోలీసు విభాగం ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్‌ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్‌జెండర్‌లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.

‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను  చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ.

 ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్‌ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.

‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.

కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్‌జెండర్‌లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.

అపూర్వ అవకాశం
తెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్‌ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్‌జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్‌జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.

ఎవరూ పని ఇవ్వలేదు
ఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్‌ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ  కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.
– కె.శ్రీవల్లి

బాబాయి పెళ్లికి రావద్దన్నారు! 
సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్‌ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి.  టాన్స్‌జెండర్‌లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.
– కందుల భానుప్రియ

చిన్నప్పటి కల నెరవేరింది
భద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.
– కారం సన

ఎక్కువ జీతం కాదనుకొని...
భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్‌జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్‌జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్‌జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్‌ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్‌ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్‌జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. 
– జెస్సీ

– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement