బాట మార్చుకున్న మానవతావాది | Sakshi Guest Column On Gaddar | Sakshi

బాట మార్చుకున్న మానవతావాది

Published Tue, Aug 6 2024 6:02 AM | Last Updated on Tue, Aug 6 2024 9:30 AM

Sakshi Guest Column On Gaddar

సందర్భం

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక శాంతి యుత పరివర్తన రావాల్సింది పోయి, ఎక్కడికక్కడ ఉద్యమాలు తలెత్తాయి. కేంద్రం, రాష్ట్రాల నుండి బ్రిటిష్‌ పాలకులు వైదొలిగారు. కానీ గ్రామీణ వ్యవస్థలు మారలేదు. భూమిపై ఉన్న హక్కులు రద్దు కాలేదు. దాంతో భూస్వాముల వర్గం అన్ని రంగా ల్లోనూ ఎదుగుతూ వచ్చింది. 

అంబేడ్కర్‌ భూమిని జాతీయం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం ద్వారా సోషలిజాన్ని బహుళ పార్టీ వ్యవస్థలో సాధించడం ఎలాగో రోడ్‌ మ్యాప్‌ వేశారు. కానీ అది జరగలేదు. పర్యవ సానంగా ప్రజలు భూమి కోసం ఉద్యమ బాట పట్టారు. ప్రభు త్వాలు సమస్యను పరిష్కరించే బదులు బల ప్రయోగంతో అణిచి వేయాలని చూశాయి.

రాజ్యాంగం మహోన్నత లక్ష్యా లతో రాయబడింది గానీ ప్రజలకు దాన్ని అందించలేదు, వివరించలేదు, చదివించలేదు. ఏదో రష్యాలో, చైనాలో గొప్పగా వుందట అని చెపితే జనం నమ్మారు. మార్క్సిజం సిద్ధాంతాలు చెప్తే బాగుందనుకున్నారు. ఆదర్శ సమాజం అనే భావన ఆకర్షించింది. ఆ బాటలో సాగిన గద్దర్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 

అంటరాని కులంలో పుట్టి, ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదివి, బ్యాంకులో ఉద్యోగం చేసి, తాను నమ్మిన కళ కోసం, సాంస్కృతిక విప్లవం కోసం ఉద్యోగాన్ని వదిలి,దిగంతాలకు ఎదిగిన మహా కళాకారుడయ్యాడు. అరుదైన గాయకుడిగా, ప్రజా కవిగా విప్లవోద్యమానికి ఊపిరులు ఊదాడు. ప్రజా వాగ్గేయ కారుడిగా విశ్వ వ్యాప్తం అవుతూ వచ్చాడు. గద్దర్‌ ఆట, పాట, కాలి అందెల సవ్వడి జనాన్ని ఉర్రూతలూగించి వేలాదిమంది యువకులను ఉద్యమాల బాట పట్టించింది. 

భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విప్లవో ద్యమానికి ఊపిరులు ఊదిన గద్దర్‌ ఫలితాలు రాక, విస్తరణ కోల్పోయిన ఉద్యమ దశను కళ్లారా చూశాడు. ఆశలు అడియాసలై, ఆత్మావలోకం చేసుకొని ఉద్యమకారులు అజ్ఞా తంలో ఉండి సాధించేది శూన్యం అని గుర్తెరిగి ప్రజాస్వామ్యం వైపు పరివర్తన చెందాడు.

అనుభవం నేర్పిన పాఠాలతో ఉద్యమాల బాట సాధించేది ఏమీలేదనీ, ప్రజాస్వామ్య బాటనే భేష్‌ అనీ భారత రాజ్యాంగాన్ని ఆలస్యంగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అప్పటికి జరగరాని నష్టం జరిగిపోయింది. వేలాది మంది యువకులు నేలకొరిగారు. 

నడిచిన దారి తప్పు అని చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకొక బాధ. ఈ రెండింటి మధ్య గద్దర్‌ చాలాకాలం నలిగి పోయాడు. ఈలోపు మలి తెలంగాణ ఉద్యమం రాజు కోవడంతో ఉవ్వెత్తున లేచాడు. చంద్రబాబు ప్రభుత్వ కాలంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. 6 తూటాలు దిగాయి. అయినా తెలంగాణ కోసమే బతికినట్టయింది. 

ఆ మధ్య ఒక విలేఖరి ఇలా ప్రశ్నించాడు: ‘‘మీరు భారత రాజ్యాంగం, దాని మౌలిక లక్ష్యాలు చదవకుండా, రాజ్యాంగ ఆచరణతో సమాజంలో, జీవితాల్లో వచ్చిన మార్పులు పరిశీ లించకుండా మార్క్సిజం, మావో యిజం కరెక్టు అని ఎలా అనుకున్నారు? సాయుధ విప్లవంలో ఎందుకు చేరారు?’’ ‘‘రాజ్యాంగంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయని మాకె వరూ చెప్పలేదు. 

సోషలిజం సాయుధ పోరాటంతోనే వస్తుందనుకున్నాం. భారత రాజ్యాంగం చదవకుండా విప్లవం చేయాలనుకోవడం తప్పే. సోషలిస్టు రష్యాలో, పీపుల్స్‌ చైనాలో ప్రజల హక్కులు, ప్రభుత్వ నిర్వహణ, న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా విప్లవం చేయాలనుకోవడం పొరపాటే. అందుకే ఇపుడు భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధన, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం’’ అని చెప్పాను. 

గద్దర్‌ ఆశయం ప్రజాస్వామ్య సోషలిజం సాధన.బౌద్ధం, అంబేడ్కరిజం, భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధన అంతిమ లక్ష్యం. అంటరానితనం, అసమానతలు, దోపిడీ, మనిషి పై మనిషి ఆధిపత్యం చేసే సంస్కృతి పోవడం గద్దర్‌తో పాటు మన లక్ష్యం కూడా కావాలి. అదే గద్దర్‌కు నిజమైన నివాళి.

బి.ఎస్‌. రాములు 
వ్యాసకర్త తెలంగాణ బీసీ కమిషన్‌ తొలి చైర్మన్‌
(నేడు గద్దర్‌ తొలి వర్ధంతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement