
ఏదీ ఎండాకాలం వచ్చిందన్నారు.. నాకేం కనిపించలేదేం... తెల్లారితే మొదలయ్యే కోయిల కూతలు ఎక్కడా లేవేం.. రెండు నెలలపాటు పెరట్లోని మామిడి చెట్టుమీద కూర్చుని పొద్దల్లా కచేరీ చేసే కోయిలల గుంపు లేనేలేదేం.. ఒకటి గొంతు ఆపగానే ఇంకోటి కూ.. కూ.. అంటూ అందుకునే రాగాలు కనిపించవేం..
ఒంటిపూట బడులు ఇచ్చాక స్కూలు వదిలిపెట్టగానే నేరుగా ఇంటికి రాకుండా మామిడితోటలు.. జీడీ తోటల్లో తిరుగుతూ పచ్చిమామిడి కాయలన్నీ ఏరుకుని పుస్తకాల సంచుల్లో వేసుకుని ఎవరెక్కువ కాయలు ఏరుకుంటే వాడే హీరో అని చెప్పుకునే పిల్లలేరీ... ఆ పిల్లగ్యాంగులు ఎక్కడా కనిపించవేం..
ఒరేయ్ ఎండల్లో ఎక్కడికి తిరక్కండి.. పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగలు తిరుగుతున్నారు.. వాళ్లకు కానీ దొరికితే మిమ్మల్ని మాయచేసి పిల్లులు.. కుక్కపిల్లల్లా మార్చేసి తీసుకెళ్ళిపోతారు అని తల్లిదండ్రులు చెప్పి మరీ ఎండాకాలం కాసేపు నిద్ర పుచ్చడానికి తాపత్రయపడిన సందర్భాలేవీ.. తల్లిదండ్రులు అలా నడుం వాల్చగానే పిల్లిలా అడుగులో అడుగువేసుకుంటూ బయటకు పారిపోయి చెట్లకింద
మామిడి తోటల్లో చెట్లకింద జీడిపిక్కలు.. మామిడి టెంకలతో ఆటలాడుతున్న పిల్లలు ఏరీ.. ఏమైపోయారు వాళ్లంతా చెరువులు ఎండిపోయే కాలం. బురదలో దిగి నిక్కర్ ఎగేసుకుని చేపలు పట్టి ఇళ్లకు తీసుకెళ్తే ఎండల్లో మీకు ఇదేం పనిరా.. ఆ బురదలో పురుగుపుట్రా ఉంటే ఎంత ప్రమాదం అని నాన్న టెంకి జెల్లలు తగిలించిన సన్నివేశాలు ఊళ్లలో లేవేంది..
స్కూళ్లకు సెలవులు ఇస్తున్నాను పట్నంలోని మామయ్య ఇంటికి వెళ్ళాలి అంటూ నాలుగురోజులు ముందే నిక్కర్లు .. చొక్కాలు సంచిలో సర్దుకుని అమ్మను కంగారు పెట్టె పిల్లకాయలు లేనేలేరేం... వాళ్ళంటా ఏమైపోయారు.. అసలు ఎండాకాలం అంటేనే గోళీకాయలు ఆట.. రౌండ్ గా ఒక వృత్తం గీసి మధ్యలో గోళీలు పెట్టి వృత్తం అవతలికి ఎగిరిపడేలా గోళీకాయలను కొట్టే ఛాంపియన్లు ఎక్కడికెళ్ళిపోయారు..
రూపాయి తీసుకుని గంటకు అర్ధరూపాయి చొప్పున సైకిల్ అద్దెకు తీసుకుని గరుకు మెరకల్లో తొక్కడం నేర్చుకునే క్రమంలో మోకాలి చిప్పలు గీక్కుపోయిన పిల్లలూ లేరేం.. అసలు అద్దె సైకిళ్ళు ఇచ్చేవాళ్లంతా ఏమైపోయారు...
ఒరేయ్ జాగ్రత్తగా దించండి.. ముంజెలు మాత్రం నాకు రెండు ఎక్కువ ఇవ్వాలి అంటూ. వాంతులు వేసుకుని మరీ తాటిముంచెలు పంచుకుని తినే పిల్లలెక్కడున్నారు...
ఊళ్లలో ఐదారు ఇళ్లల్లోని ఆడాళ్ళంతా ఒక చోట చేరి చింతపండు పిక్కలు తీస్తూ కబుర్లు చెబుతూ.. సినిమా పాటలు పాడుకుంటూ గడిపే సన్నివేశాలు ఈ ఊళ్లోనూ లేవేంది..
సెలవులకు పిన్ని.. బాబాయ్.. మేనత్తలు ఇళ్లకు వెళ్లి వచ్చేటపుడు వాళ్ళిచ్చే చిల్లర డబులు జేబులో ఉంచుకుని స్కూళ్ళు తెరిచాక వాటిని ఇంటర్వెల్లో ఐస్ క్రీములు.. చేరుకుముక్కలు కొనుక్కునేందుకు వాడుకునే పొదుపరి పిల్లలు కనిపించరేం..
రానున్నది వానాకాలం .. ఈలోపే ఇల్లు నేయించాలి.. పాత రెల్లుగడ్డి తీసేసి కొత్త గడ్డి వేయించాలి అనే బాధ్యత.. బెంగతో గెడ్డలు.. వాగులు వంకలవద్ద రెల్లుగడ్డి కోసే ఇంటి పెద్ద లేనేలేడు
అటు ఎండ కాస్తుండగా ఇటు చినుకులు రాల్తుంటే ఎండ వాన కుక్కలకు నక్కలకు పెళ్లి.. పెళ్లి అంటూ వీధుల్లో ఎగిరే చిన్నారుల సందడి ఎక్కడుంది...
ఎండాకాలంలో ఒకేసారి పెద్దగా గాలివీయగానే మామిడి తోటలకు పరుగెత్తి రాలిన కాయలు ఏరుకొచ్చే పిల్లలూ.. పెద్దలూ ఎక్కడున్నారో...
స్కూళ్లకు సెలవులిచ్చేశారు.. ఎండాకాలంలో మేము తిరప్తి వెళ్తాం.. సింహాచలం వెళ్తాము.. యాత్రలు తీర్థాలకు వెళ్లొస్తాం తెలుసా అంటూ తోటి పిల్లలతో గొప్పలు చెప్పుకునే గడుగ్గాయిలు కూడా లేరు.. ఇవేం లేకుండా వేసవికాలం ఎలా ఉంటుంది.. ఎలా వస్తుంది.. ఏమో కలం మారింది. వాటన్నిటినీ మింగేసిన వేసవికాలం మాత్రం వచ్చింది.. వేడిని తెచ్చింది.. ఇంట్లో ఏసీలు లేకుండా బతకలేని పరిస్థితిని తెచ్చింది. ఒకళ్ళ ఇళ్లకు ఇంకొకరు వెళ్లకుండా ఎవరిళ్ళలో వాళ్ళే ఉండేలా గిరిగీసేసిన అసూయలు .. తెచ్చింది...
- సిమ్మాదిరప్పన్న