
యువతులతో బలవంతంగా సెక్స్ రాకెట్ నడిపిన వ్యవహారంలో ప్రముఖ అమెరికన్ నటి ఎలిసన్ మాక్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నటి ఎలిసన్ పలువురు యువతులను బలవంతంగా ఈ రొంపిలోకి లాగిందనే ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెపై దర్యాప్తు చేపట్టిన అనంతరం బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు ఈ విధమైన తీర్పును వెలువరించింది. ఆమెకు ఈ శిక్ష సెప్టెంబరు 29 నుంచి అమలుకానున్నదని సమాచారం. కాగా అదే కోర్టులో జడ్జిల సమక్షంలో తాను చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నానని ఎలిసన్ పేర్కొంది.
కాగా ఈ తీర్పు వెలువడక ముందు ఎలిసన్ బాధితులతో, వారి కుటుంబ సభ్యుల ముందు ఏడుస్తూ తాను చేసిన పనులు అమానవీయమైనవని, తాను ఎన్‌ఎక్స్‌ఐవీఎం నేత కీథ్ రెనాయర్‌ను పూర్తిగా విడిచిపెట్టేశానని తెలిపింది. అతనికి కొంతకాలం క్రితం అపహరణ, ఇతర నేరాల కింద 120 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
కీథ్ ఎన్‌ఎక్స్‌ఐవీఎం పేరుతో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. దానిలో ఆయన మినహా మిగిలినవారంతా మహిళా సభ్యులే ఉన్నారు. ఈ గ్రూపు సభ్యులు మహిళలతో జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించేవారు. ఈ గ్రూపులోని మహిళా సభ్యులు కీథ్‌తో శారీరక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు ఇతర మహిళలపై ఒత్తిడి తీసుకువచ్చేవారు. ఈ గ్రూపులోని ఎలిసన్ ఇటువంటి పనులకు ఎంతగానో సహకరిస్తుంటుంది. యువతులను అపహరించడం లాంటి అక్రమ కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించేది.
‘స్మాల్ విలే’తో అనూహ్య ఆదరణ
ఎలిసన్ మాక్ డబ్ల్యుబీ టెలివిజన్ సిరీస్ ‘స్మాల్ విలే’తో ఎంతో ప్రజాదరణ పొందింది. ఎలిసన్ అత్యధిక వెబ్‌సిరీస్‌లలో నటించింది. ఆమె నటించి బోల్డ్ సీన్స్ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. 1982 జూలై 29న జన్మించిన ఎలిసన్ చిన్న వయసులోనే తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. 2001 నుంచి 2011 వరకూ ప్రసారమైన సూపర్‌మ్యాన్ స్టోరీ ఆధారంగా రూపొందిన టెలివిజన్ షోలో ఆమె విలేకరి క్లో సులివన్‌గా నటించి అందరి అభినందనలు అందుకుంది.
ఇది కూడా చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ!