
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ చర్యల కారణంగా పలు దేశాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య టారిఫ్‌ల యుద్ధమే నడుస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ట్రంప్ ఏకంగా 104శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో, ట్రంప్ చర్యలపై చైనా ఘాటుగా స్పందించింది.
ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న పన్నులపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తాజాగా స్పందించారు. తాజాగా లీ కియాంగ్ మాట్లాడుతూ..‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నుల పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనిపై మేం చివరివరకు పోరాడతాం. సొంత ప్రయోజనాల కోసమే కాకుండా.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు ప్రయత్నిస్తాం. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకోవడం అమానుషం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగినవిధంగా బదులిచ్చేందుకు విధానపరంగా అన్ని ఆయుధాలు మా వద్ద ఉన్నాయి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.
