
సింధూలోయ నాగరికతను వెలుగులోకి తెచ్చిన రఖల్‌దాస్ బెనర్జీ
మొహెంజోదారోలో తవ్వకాలతో బయటపడిన గొప్ప నగరం
బ్రిటిష్ పాలకుల కుట్రలతో భారతీయుడికి దక్కని గుర్తింపు
ఘనత కొట్టేసిన బ్రిటిష్ జాతీయుడు జాన్ మార్షల్
భారతదేశంలో 5,300 సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత వషిల్లింది. అదే సింధూలోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. ప్రణాళికాబద్ధమైన వీధులు, ఇళ్లు, మురుగు నీటి వ్యవస్థతో ఈ నాగరికత ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది. 1990వ దశకం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సింధూలోయ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. భూమి పొరల కింద శతాబ్దాలుగా కప్పబడి ఉన్న శిథిలాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అవిశ్రాంతమైన తవ్వకాలతో ఈ గొప్ప నాగరికతను నేటి తరానికి పరిచయం చేశారు.
ఈ మహాయజ్ఞం వెనుక ఉన్నది ఎవరో తెలుసా? భారతీయుడైన రఖల్‌దాస్ బెనర్జీ. కానీ, మొత్తం క్రెడిట్ కొట్టేసింది మాత్రం అప్పటి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్‌ఐ) చీఫ్, బ్రిటిష్ జాతీయుడైన జాన్ మార్షల్. సింధూలోయ నాగరికతను బయటపెట్టింది జాన్ మార్షల్ అని బ్రిటిష్ ప్రభుత్వం లోకాన్ని నమ్మించింది. పాఠ్య పుస్తకాల్లోనూ అదే చేర్చారు. ఇప్పటికీ పిల్లలు అదే చదువుకుంటున్నారు. కానీ, వాస్తవం అది కాదని చరిత్రకారులు, పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. అసలైన కథానాయకుడు రఖల్‌దాస్ బెనర్జీ అనామకంగా ఉండిపోవడానికి కారణం ఏమిటి? అసలు ఆయనెవరు? ఆ మహా మనిషిని మనం ఎందుకు మర్చిపోయాం?
చిన్నప్పుడే చరిత్రపై ఆసక్తి
పురావస్తు పరిశోధకుడైన రఖల్‌దాస్ బెనర్జీ 1885లో పశ్చిమ బెంగాల్‌లో ఓ సంపన్న కుటుంబంలో జని్మంచారు. బహరాంపూర్ పట్టణంలో పెరిగారు. ఆ మధ్య యుగాల నాటి కట్టడాలు అధికంగా ఉండేవి. ఆయన వాటిని చూస్తూ ప్రాచీన నాగరికతలు, చరిత్రపై ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీలో చేరి చరిత్రను అధ్యయనం చేశారు. మధ్యయుగ భారతదేశ చరిత్రపై వ్యాసం రాసే బాధ్యత అప్పగించగా, అందుకోసం స్వయంగా పరిశోధన ప్రారంభించారు. పొరుగు రాష్ట్రం వెళ్లి అక్కడి శిల్పాలు, రాతపత్రులను పరిశీలించారు. దాంతో చరిత్ర, నాగరికతలపై ఆసక్తి మరింత పెరిగింది. 1910లో ఏఎస్‌ఐలో ఎక్సవేషన్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. చురుకైన వ్యక్తి కావడంతో తక్కువకాలంలోనే సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు స్థాయికి ఎదిగారు. 1917లో విధుల్లో భాగంగా పశ్చి మ భారతదేశానికి చేరుకున్నారు. 1919లో సింధూ ప్రాంతంలోని మొహెంజోదారోలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్‌తో లర్కానాలో జిల్లాలో ఉంది.
ఇప్పటికైనా గుర్తింపు దక్కేనా?
సింధూలోయలో ప్రాచీన నగరాన్ని తవ్వకాల్లో బయటకు తెచ్చిన ఘనత నిశ్చయంగా రఖల్‌దాస్ బెనర్జీదే. అందుకోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నారు. కానీ, ఒక భారతీయుడికి ఆ పేరు ప్రఖ్యాతలు దక్కడం బ్రిటిష్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయింది. ఆయనపై ఎన్నో అభియోగాలు మోపింది. అంతేకాకుండా రఖల్‌దాస్‌ది ధిక్కరించే తత్వం. తనపై ఎవరైనా పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేవారు కాదు.
ఈ లక్షణమే ఆయనను బ్రిటిష్ అధికారులకు విరోధిగా మార్చింది. నిధులు దురి్వనియోగం చేశారని, అవినీతికి పాల్పడ్డారని రఖల్‌దాస్‌పై నిందలు మోపారు. అరుదైన శిల్పాలు, పెయింటింగ్‌లు దొంగిలించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో చోరీకి గురైన ఒక బుద్ధిస్టు దేవత విగ్రహం కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అవమానాలు భరించలేక ఆయన 1927లో ఏఎస్‌ఐలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, ఆయనపై వచ్చిన అభియోగాలను తర్వాత కోర్టులు కొట్టివేశాయి.
ఉపాధి కోసం రఖల్‌దాస్ 1928లో బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1930లో మరణించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 45 ఏళ్లు. గొప్ప చరిత్రను వెలికితీసిన రఖల్‌దాస్‌కు చివరకు చరిత్రలో స్థానం లేకుండాపోవడం ఒక వైచిత్రి. ఇప్పటి తరానికి ఆయనెవరో తెలియదు. సింధూలోయలో ప్రాచీన నగరా>న్ని సందర్శించేవారికి కూడా ఆయన గొప్పతనం ఏమిటో తెలిసే అవకాశం లేదు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించాలని, రఖల్‌దాస్ బెనర్జీకి తగిన గుర్తింపు ఇవ్వాలని చరిత్రకారులు కోరుతున్నారు.
5,300 ఏళ్ల నాటి నగరం
మొహెంజోదారో అంటే సింధీ భాషలో మృతిచెందిన మనిషి దిబ్బ అని అర్థం. ఇదే చోట రఖల్‌దాస్ బెనర్జీ తవ్వకాలు ప్రారంభించారు. తొలుత బౌద్ధ స్తూపాలు, నాణేలు, ముద్రలు, కుండలు, ఇతర కళాకృతులు లభించాయి. మరిన్ని ఆధారాల కోసం 1922, 1923లో తవ్వకాలు ఊపందుకున్నాయి. ప్రాచీన సింధూలోయ నాగరికత బయటపడింది. కాల్చిన ఇటుకలతో నిర్మించిన అప్పటి భవనాలు, నీటి తొట్టెలు, స్నానపు గదులు, రహదారులు వెలుగులోకి వచ్చాయి. ఇది 5,300 ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు. సింధూనది లోయ 3.86 లక్షల చదరపు మైళ్ల మేర విస్తరించి ఉండేది. ఈశాన్య అఫ్గానిస్తాన్ నుంచి వాయువ్య భారత్ దాకా గొప్ప రాజ్యం వర్థిల్లింది. తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరదల కారణంగా చాలావరకు తుడిచిపెట్టుకుపోయింది.
– సాక్షి, నేషనల్ డెస్క్