
వినూత్నంగా ఆవిష్కరించిన అంకుర సంస్థ
ప్లాస్టిక్ కరగడంతో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్యకు చెక్‌పెట్టే ఛాన్స్
రిమోట్ కంట్రోల్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, టీవీ, కంప్యూటర్, క్యాలిక్యూలేటర్, గేమ్ కంట్రోలర్, కీబోర్డ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత విలువైన లోహాలు, ఎల్రక్టానిక్ వస్తువుల సమ్మేళనంగా రూపొందిన ఉపకరణాలెన్నింటినో మనం దైనందిన జీవితంలో వాడి పాడుచేసి పడేస్తున్నాం. ఈ ఎల్రక్టానిక్ వ్యర్థ్యాలు అలాగే భూమిలో కలుస్తూ భూకాలుష్యానికి కారణమవుతున్నాయి. ఏటా పేరుకుపోతున్న ఇ–వేస్ట్‌లో తిరిగి పునఃశుద్ధికి నోచుకునే లోహాల పరిమాణం అత్యంత సూక్ష్మం. అత్యంత విలు వైన, అరుదైన లోహాలు, ఖనిజాలతో తయారైన వస్తువుల నుంచి కేవలం 1 శాతం లోహాలనే తిరిగి రీసైక్లింగ్ చేయగల్గుతున్నాం.
ఇలా ఇప్పటికే రూ.5.32 లక్షల కోట్ల విలువైన లోహాలు ఎల్రక్టానిక్ డివైజ్‌ల నుంచి రీసైక్లింగ్‌కు నోచుకోకుండా మట్టిలో కలిసిపోయాయి. వీటిని ఇలా వృథాగా పోనివ్వకుండా పూర్తిగా ఒడిసిపట్టే అద్భుత ఆలోచనను పెంటాఫామ్ అనే అంకుర సంస్థ అమల్లోకి తెచ్చింది. ఎల్రక్టానిక్ డివైజ్, దాని సర్క్యూట్‌ను నీటిలో కరిగిపోయే ప్లాస్టిక్ మదర్‌బోర్డ్‌కు అమరిస్తే ఆ డివైజ్ పాడయ్యాక నీటిలో ఉంచితే ఆ సర్క్యుట్‌లోని విలువైన లోహాలను తిరిగి సులభంగా సంగ్రహించవచ్చు. ఇలా ఇ–వేస్ట్ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతున్న అద్భుత ‘ఆక్వాఫేడ్’ప్లాస్టిక్ కథాకమామిషు ఇదీ..
ఆరు గంటల్లో పూర్తిగా కరుగుతుంది
మూడేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఇ–వేస్ట్ పోగుబడిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ ఎల్రక్టానిక్స్ చెత్తను కోట్లాది లారీల్లో నింపితే అవి భూమధ్యరేఖ పొడవునా దారి కడతాయని ఐరాస పేర్కొంది. పాదరసం, లెడ్ వంటి వాటితోపాటు బంగారం వంటి అత్యంత ఖరీదైన లోహాలతో కొన్ని ఎల్రక్టానిక్ డివైజ్‌ల సర్క్యూట్‌లను తయారుచేస్తారు.
భూమి ఎల్రక్టానిక్ వ్యర్థ్యాల కుప్పగా తయారవుతున్న దారుణ పరిస్థితుల్లో ఓవైపు ఇ–వేస్ట్‌ను తగ్గిస్తూనే మరోవైపు లోహాలను సంగ్రహించేలా ఆక్వాఫేడ్ ప్లాస్టిక్‌ను తయారుచేశామని పెంటాఫామ్ వ్యవస్థాపకులు, ఆక్వాఫేడ్ సహ ఆవిష్కర్తలు శామ్యూల్ వాంగ్‌సపుత్రా, జూన్‌సంగ్ లీ చెప్పారు. రీసైక్లింగ్ అవుతున్న వాటితో పోలిస్తే పెరుగుతున్న ఇ–వేస్ట్ పరిమాణం ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ. అందుకే దీనిని పరిష్కారం కనుగొన్నామని సంస్థ వ్యవస్థాపకులు చెప్పారు.
ఆక్వాఫేడ్ ప్లాస్టిక్ కేసింగ్‌తో తయారైన ఎలక్టానిక్ గ్యాడ్జెట్‌ను నీటితో నింపిన పాత్రలో ఉంచితే ప్లాస్టిక్ దాదాపు ఆరు గంటల్లో పూర్తిగా కరుగుతుంది. అప్పడు డివైజ్‌లోని ఖరీదైన లోహాలు, ఇతర ఎల్రక్టానిక్ సూక్ష్మభాగాలను చేతితో విడివిడిగా తీయొచ్చు. ప్లాస్టిక్ కరిగిన నీటిని పారబోస్తే సరిపోతుంది.
ఈ ప్లాస్టిక్ కేసింగ్‌ను గ్యాడ్జెట్ తయారుచేసిన కొత్తలో మొదట నీరు తగిలితే మెత్తబడకుండా ఉండేలా వాటర్‌ప్రూఫ్ కోటింగ్‌తో సిద్ధంచేస్తారు. ‘‘పాడైన ఎల్రక్టానిక్ వస్తువు నుంచి విలువైన లోహాలను జాగ్రత్తగా బయటకు తీయడం ఇ–వేస్ట్ కార్మికులకు తలకు మించిన భారం. ఎంతో కష్టపడినా పూర్తిస్థాయిలో విలువైన లోహాన్ని బయటకు తీయలేం. అదే ఆక్వాఫేడ్ ప్లాస్టిక్‌తో తయారైన గ్యాడ్జెట్ నుంచి సులభంగా లోహాలను వేరేచేయొచ్చు’’అని శామ్యూల్ వాంగ్‌సపుత్రా అన్నారు.
అంట్లు తోముతుంటే మెరిసిన ఆలోచన!
గొప్ప ఆవిష్కరణలెన్నో విచిత్రంగా జరిగాయని వింటుంటాం. ఆక్వాఫేడ్ సైతం అలా వచ్చిందే. ఈ విషయాన్ని స్వయంగా వాంగ్‌సపుత్రా వెల్లడించారు. ‘‘ఓరోజు నేను అంట్లు తోముతుంటే అంట్లు తోమే సబ్బు నీరు తగలగానే పాత్రలను శుభ్రం చేస్తూనే మటుమాయం కావడం చూశా. సబ్బు తన విధి నిర్వర్తించి తర్వాత అంతర్థానమవడం గమనించా.
ఎల్రక్టానిక్ సర్క్యూట్‌లను పట్టి ఉంచే ప్లాస్టిక్ కేసింగ్ కూడా తర్వాత అదృశ్యమైతే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచే ఈ ఆక్వాఫేడ్ పురుడుపోసుకుంది. ఒక వినూత్న పాలిమర్‌తో కొత్తరకం ప్లాస్టిక్ తయారుచేస్తే బాగుంటుందని భావించాం. ఇందుకోసం ఈ రంగంలో నిపుణులైన లండన్ ఇంపీరియల్ కాలేజీలో ‘మెటీరియల్’శాస్త్రవేత్తలు ఎన్రికో మ్యాన్‌ఫ్రెడీ–హేలాక్, మరియం లామారిలతో చేతులు కలిపి కొత్త ప్లాస్టిక్‌ను సృష్టించాం’’అని ఆయన చెప్పారు. ఈ ప్లాస్టిక్‌ను వాణిజ్యపర ఉత్పత్తుల అవసరాల కోసం ఇంకా వినియోగించలేదు. పూర్తిస్థాయి పరీక్షల తర్వాత ఇది భిన్నరకాల డివైజ్‌ల కేసింగ్ కోసం ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్