Electronic waste
-
ఎలక్ట్రానిక్వ్యర్థాల నిర్వహణకు ఓ లెక్కుంది
ఎల్రక్టానిక్ వ్యర్థాల నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్నదిగా మారుతోంది. ఈ–వ్యర్థాల పట్ల అవగాహన, చైతన్యం తగినంతగా లేకపోవడం..దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు తగినంతగా అందుబాటులోకి రాకపోవడం, వీటి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నియమ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడం పెనుసమస్యగా అవతరించింది. ఇవన్నీ కలగలిసి ఈ–వ్యర్థాలను సరైన పద్ధతుల్లో తొలగించకపోవడం వంటి కారణాలతో పర్యావరణానికి నష్టం చేస్తున్నాయి. 2021–22లోనే తెలంగాణలో 50,335.6 టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి కాగా, వాటిలో 42,297 టన్నులు మాత్రమే సరైన పద్ధతుల్లో తొలగించారని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) గతంలోనే వెల్లడించింది. అయితే వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాల వినియోగదారులతోపాటు సాధారణ ప్రజల్లోనూ బాధ్యతాయుతంగా ‘ఎల్రక్టానిక్ వేస్ట్ డిస్పోజల్’విషయంలో సరైన అవగాహన, చైతన్యం లేదని పలు సందర్భాల్లో వెల్లడైంది. ఇళ్లలోనూ నిరుపయోగంగా మారుతున్న వివిధ ఎల్రక్టానిక్ వస్తువుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చార్జర్లు, వైర్లతో కూడిన ఇయర్ఫోన్లు, స్పీకర్లు, ఎలక్ట్రిక్ కెటిళ్లు, కుక్కర్లు, ఇతర పరికరాలు, వస్తువులు పోగుపడుతున్నాయి. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీలు, ఇతర వస్తువులు పాడైతే స్థానికంగా అమ్మేయడమో లేక పాతపేపర్లు, పాతసామాన్లు అమ్మే షాపుల వారికి ఇచ్చేయడమో అధికంగా జరుగుతున్నాయి. అయితే ఈ వస్తువులను చివరకు సురక్షితంగా ఏ విధమైన పద్ధతుల్లో డిస్పోజ్ చేస్తున్నారనే విషయంలో మాత్రం స్పష్టత ఉండడం లేదు. – సాక్షి,హైదరాబాద్ సమగ్ర అధ్యయనంపై దృష్టి రాష్ట్రంలో ఈ–వేస్ట్ ఏయే రూపాల్లో ఎంతెంత పరిమాణంలో పోగుపడుతున్నదనే విషయంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ–వేస్ట్ ఇన్వెంటొరైజేషన్ను చేపట్టి ఈ వ్యర్థాలు ఎక్కువగా ఎక్కడ, ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయి ? వాటి పరిమాణం ఎంత ? ప్రస్తుతం వాటిని ఏయే రూపాల్లో సేకరించి, సురక్షితంగా తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలు తదితరాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు, 2022లో ఏఏ అంశాలను పొందుపరిచారు, ఆయా విషయాలను ఏ మేరకు వ్యర్థాల నియంత్రణ, నిర్వహణలో అనుసరిస్తున్నారనే దానిపై అధ్యయనం చేయనున్నారు. ఈ–వ్యర్థాలకు సంబంధించి సేకరించే సమాచారం, వివరాల ఆధారంగా...ఎల్రక్టానిక్ వస్తువుల సేకరణ, మెటీరియల్ రికవరీ, వీటి ద్వారా ఈ–వేస్ట్ మేనేజ్మెంట్లో ఉపాధి అవకాశాల కల్పనతో ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి సారించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలనేది ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ట్రాక్ చేయడంతోపాటు ఆయా వస్తువులు, పరికరాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలుసుకొని అక్రమ డంపింగ్‌ను నిరోధించడంతోపాటు కచ్చితమైన విధానాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా సంస్థల సేవలు వినియోగించుకునే దిశగా టీపీసీబీ జాతీయస్థాయిలో పేరొందిన కన్సల్టెన్సీ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశోధక సంస్థల సేవలను టీపీసీబీ ఉపయోగించుకోనున్నట్టు సమాచారం. మొత్తం 150 రోజుల్లో ఈ అధ్యయ నాన్ని పూర్తిచేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రటిక్ ఎక్విప్మెంట్ (ఈఈ ఈ) కేట గిరీలో ఎంత స్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయో అంచనా వేస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన సంస్థ, ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రీసైకిల్ చేసేవారు, వేర్వేరు పద్ధతులు, మార్గాల్లో వ్యర్థాలను సేకరించే వారి వివరాలను తీసుకుంటారు.వీరి నుంచి ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతున్న తీరు, పరిమాణం, వాటిని తొలగిస్తున్న తీరు, వీటి నిర్వహణలో ఎదురవుతున్న అంతరాలు, సమస్యలు వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ సంస్థలు సేకరిస్తాయి. అనంతరం ఆయా సమస్యలు, అంతరాలను అధిగమించేందుకు పలు సూచనలు, సలహాలతో సిఫార్సులు చేస్తారు. ఈ అధ్యయనంలో భాగంగా సవివర ఇన్వెంటరీ ద్వారా ‘వేస్ట్ ఫ్రం ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఎక్విప్మెంట్ (డబ్ల్యూఈఈఈ) బిజినెస్ చెయిన్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సలహాలు ఇవ్వనుంది. స్టేక్ హోల్డర్స్ గ్రూపులు ఇలా...ప్రొడ్యూసర్స్, సెల్లర్స్: దిగుమతిదారులు, తయారీదారులు, సరఫరాదారులు, వ్యాపారులు, రిటైల్, డీలర్లు వినియోగదారులు: కుటుంబాలు, వ్యాపార సంస్థలు, ఐటీ కంపెనీలు, బీపీవోలు, విద్యాసంస్థలు, రైల్వే, ఎయిర్‌లైన్స్, డిఫెన్స్, రవాణా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగసంస్థలు కలెక్ట్ చేసేవారు: ఈ–వేస్ట్‌ను సేకరించే స్క్రాప్ డీలర్లు, మాల్స్, ఇతర ప్రైవేట్ సంస్థలు రీసైక్లర్స్: డిసెంబ్లర్స్, డిస్మాంట్లర్స్, మెటీరియల్ రికవరీ యూనిట్లు ఇతర వర్గాలవారు: రోడ్డు పక్క విక్రేతలు, అధికారిక, అనధికారిక వేలం పాటలు పాడేవారు, సెకండ్ హ్యాండ్ ఎల్రక్టానిక్ వస్తువులు అమ్మేవారు -
నీటిలో కరిగే ప్లాస్టిక్!
రిమోట్ కంట్రోల్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, టీవీ, కంప్యూటర్, క్యాలిక్యూలేటర్, గేమ్ కంట్రోలర్, కీబోర్డ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత విలువైన లోహాలు, ఎల్రక్టానిక్ వస్తువుల సమ్మేళనంగా రూపొందిన ఉపకరణాలెన్నింటినో మనం దైనందిన జీవితంలో వాడి పాడుచేసి పడేస్తున్నాం. ఈ ఎల్రక్టానిక్ వ్యర్థ్యాలు అలాగే భూమిలో కలుస్తూ భూకాలుష్యానికి కారణమవుతున్నాయి. ఏటా పేరుకుపోతున్న ఇ–వేస్ట్‌లో తిరిగి పునఃశుద్ధికి నోచుకునే లోహాల పరిమాణం అత్యంత సూక్ష్మం. అత్యంత విలు వైన, అరుదైన లోహాలు, ఖనిజాలతో తయారైన వస్తువుల నుంచి కేవలం 1 శాతం లోహాలనే తిరిగి రీసైక్లింగ్ చేయగల్గుతున్నాం. ఇలా ఇప్పటికే రూ.5.32 లక్షల కోట్ల విలువైన లోహాలు ఎల్రక్టానిక్ డివైజ్‌ల నుంచి రీసైక్లింగ్‌కు నోచుకోకుండా మట్టిలో కలిసిపోయాయి. వీటిని ఇలా వృథాగా పోనివ్వకుండా పూర్తిగా ఒడిసిపట్టే అద్భుత ఆలోచనను పెంటాఫామ్ అనే అంకుర సంస్థ అమల్లోకి తెచ్చింది. ఎల్రక్టానిక్ డివైజ్, దాని సర్క్యూట్‌ను నీటిలో కరిగిపోయే ప్లాస్టిక్ మదర్‌బోర్డ్‌కు అమరిస్తే ఆ డివైజ్ పాడయ్యాక నీటిలో ఉంచితే ఆ సర్క్యుట్లోని విలువైన లోహాలను తిరిగి సులభంగా సంగ్రహించవచ్చు. ఇలా ఇ–వేస్ట్ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతున్న అద్భుత ‘ఆక్వాఫేడ్’ప్లాస్టిక్ కథాకమామిషు ఇదీ.. ఆరు గంటల్లో పూర్తిగా కరుగుతుంది మూడేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఇ–వేస్ట్ పోగుబడిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ ఎల్రక్టానిక్స్ చెత్తను కోట్లాది లారీల్లో నింపితే అవి భూమధ్యరేఖ పొడవునా దారి కడతాయని ఐరాస పేర్కొంది. పాదరసం, లెడ్ వంటి వాటితోపాటు బంగారం వంటి అత్యంత ఖరీదైన లోహాలతో కొన్ని ఎల్రక్టానిక్ డివైజ్‌ల సర్క్యూట్లను తయారుచేస్తారు. భూమి ఎల్రక్టానిక్ వ్యర్థ్యాల కుప్పగా తయారవుతున్న దారుణ పరిస్థితుల్లో ఓవైపు ఇ–వేస్ట్‌ను తగ్గిస్తూనే మరోవైపు లోహాలను సంగ్రహించేలా ఆక్వాఫేడ్ ప్లాస్టిక్‌ను తయారుచేశామని పెంటాఫామ్ వ్యవస్థాపకులు, ఆక్వాఫేడ్ సహ ఆవిష్కర్తలు శామ్యూల్ వాంగ్సపుత్రా, జూన్సంగ్ లీ చెప్పారు. రీసైక్లింగ్ అవుతున్న వాటితో పోలిస్తే పెరుగుతున్న ఇ–వేస్ట్ పరిమాణం ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ. అందుకే దీనిని పరిష్కారం కనుగొన్నామని సంస్థ వ్యవస్థాపకులు చెప్పారు. ఆక్వాఫేడ్ ప్లాస్టిక్ కేసింగ్‌తో తయారైన ఎలక్టానిక్ గ్యాడ్జెట్‌ను నీటితో నింపిన పాత్రలో ఉంచితే ప్లాస్టిక్ దాదాపు ఆరు గంటల్లో పూర్తిగా కరుగుతుంది. అప్పడు డివైజ్‌లోని ఖరీదైన లోహాలు, ఇతర ఎల్రక్టానిక్ సూక్ష్మభాగాలను చేతితో విడివిడిగా తీయొచ్చు. ప్లాస్టిక్ కరిగిన నీటిని పారబోస్తే సరిపోతుంది. ఈ ప్లాస్టిక్ కేసింగ్‌ను గ్యాడ్జెట్ తయారుచేసిన కొత్తలో మొదట నీరు తగిలితే మెత్తబడకుండా ఉండేలా వాటర్‌ప్రూఫ్ కోటింగ్‌తో సిద్ధంచేస్తారు. ‘‘పాడైన ఎల్రక్టానిక్ వస్తువు నుంచి విలువైన లోహాలను జాగ్రత్తగా బయటకు తీయడం ఇ–వేస్ట్ కార్మికులకు తలకు మించిన భారం. ఎంతో కష్టపడినా పూర్తిస్థాయిలో విలువైన లోహాన్ని బయటకు తీయలేం. అదే ఆక్వాఫేడ్ ప్లాస్టిక్‌తో తయారైన గ్యాడ్జెట్ నుంచి సులభంగా లోహాలను వేరేచేయొచ్చు’’అని శామ్యూల్ వాంగ్సపుత్రా అన్నారు. అంట్లు తోముతుంటే మెరిసిన ఆలోచన! గొప్ప ఆవిష్కరణలెన్నో విచిత్రంగా జరిగాయని వింటుంటాం. ఆక్వాఫేడ్ సైతం అలా వచ్చిందే. ఈ విషయాన్ని స్వయంగా వాంగ్సపుత్రా వెల్లడించారు. ‘‘ఓరోజు నేను అంట్లు తోముతుంటే అంట్లు తోమే సబ్బు నీరు తగలగానే పాత్రలను శుభ్రం చేస్తూనే మటుమాయం కావడం చూశా. సబ్బు తన విధి నిర్వర్తించి తర్వాత అంతర్థానమవడం గమనించా. ఎల్రక్టానిక్ సర్క్యూట్లను పట్టి ఉంచే ప్లాస్టిక్ కేసింగ్ కూడా తర్వాత అదృశ్యమైతే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచే ఈ ఆక్వాఫేడ్ పురుడుపోసుకుంది. ఒక వినూత్న పాలిమర్‌తో కొత్తరకం ప్లాస్టిక్ తయారుచేస్తే బాగుంటుందని భావించాం. ఇందుకోసం ఈ రంగంలో నిపుణులైన లండన్ ఇంపీరియల్ కాలేజీలో ‘మెటీరియల్’శాస్త్రవేత్తలు ఎన్రికో మ్యాన్ఫ్రెడీ–హేలాక్, మరియం లామారిలతో చేతులు కలిపి కొత్త ప్లాస్టిక్‌ను సృష్టించాం’’అని ఆయన చెప్పారు. ఈ ప్లాస్టిక్‌ను వాణిజ్యపర ఉత్పత్తుల అవసరాల కోసం ఇంకా వినియోగించలేదు. పూర్తిస్థాయి పరీక్షల తర్వాత ఇది భిన్నరకాల డివైజ్‌ల కేసింగ్ కోసం ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేస్ట్ నుంచి ‘బంగారం’: అదిరిపోయే కళ
‘వ్యర్థాల గురించి మాట్లాడుకోవడం పరమ వ్యర్థం’ అనుకోవడం లేదు యువతరం. ఎలక్ట్రానిక్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల వరకు రకరకాల వ్యర్థాలను కళాకృతులుగా రూపొందించి పర్యావరణ సందేశాన్ని అందించడం ఒక కోణం అయితే, ఎలక్ట్రానిక్ వ్యర్థాలలోని విలువైన వాటితో నగలు రూపొందించే ఎమర్జింగ్ ఆర్ట్ ట్రెండ్ లోతుపాతులు తెలుసుకోవడం మరో కోణం... కోల్‌కతాలోని శ్రీశ్రీ అకాడమీ విద్యార్థులు తమ పాఠశాల అవరణలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో అద్భుతాన్ని సృష్టించారు. ‘ట్రాష్ ఇన్స్టాలేషన్’ ప్రాజెక్ట్‌లో భాగంగా స్టూడెంట్స్ యుతిక, ఇషాని, రజనీష్, మంజరీ, అదిత్రిలు ప్లాస్టిక్‌తో తయారుచేసిన డాల్ఫిన్ స్టాచ్యూను పాఠశాల ఆవరణలోని వర్టికల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. నెలరోజుల వ్యవధిలో తయారు చేసిన ‘డాల్ఫిన్ ఇన్ పెరిల్’ అనే ఈ ఆర్ట్ ఇన్స్టాలేషన్ పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, సముద్ర జీవులకు తీవ్రహాని కలుగుతుందనే విషయాన్ని ప్రచారం చేయడానికి కళను ఒక మాధ్యమంలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అంటుంది అదిత్రి. కేరళలోని తిరువనంతపురంలో ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’కు చెందిన యంగ్ టీమ్ 20,000 ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఉపయోగించి 90 అడుగుల పాము ఇన్‌స్టాలేషన్‌ను రూపొదించింది. ప్లాస్టిక్ అనే విషసర్పం భూగోళాన్ని కాటు వేస్తున్నట్లుగా కనిపించే ఈ ఇన్స్టాలేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాషన్ ఆఫ్ ది న్యూ ఎరా 100 శాతం ట్రాష్ అండ్ ప్లాస్టిక్!’ అంటూ ఒక యువ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ముంబైలో ఉంటున్న హరిబాబు ఇ–వేస్ట్ కళలో ఎంతోమంది యూత్‌కు ఇన్స్పైరింగ్గా నిలుస్తున్నాడు. ఇ–వేస్ట్ కళారూపాలతో ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. కేరళలో పుట్టిన హరిబాబు చెన్నైలో పెరిగాడు. చెన్నై గవర్నమెంట్ ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’లో చదువుకున్నాడు. ఇ–వ్యర్థాలతో కళాకృతుల తయారీకి ప్రశంసల మాట ఎలా ఉన్నా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం ఎప్పటికప్పుడూ ఖాళీ అవుతుండేది. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అని తిట్టేవారు మిత్రులు. అయితే బజాజ్ ఆర్ట్ గ్యాలరీ ఫెలోషిప్ అవార్డ్ అందుకున్న తరువాత హరిబాబుకు బ్రేక్ వచ్చింది. ఏడాది తరువాత ‘స్టేట్–ఆఫ్–ది–ఆర్ట్ స్టూడియో’ ముంబైలో ప్రారంభించాడు. టన్నుల కొద్దీ ఇ–వ్యర్థాల నుంచి ఎన్నో శిల్పాలు రూపొందించిన హరిబాబు దగ్గరికి సలహాలు, సూచనల కోసం ఎంతోమంది యంగ్ ఆర్టిస్ట్‌లు వస్తుంటారు. భువనేశ్వర్‌కు చెందిన మ్యూరల్ ఆర్టిస్ట్ దిబూస్ జెనా, ఆర్టిస్ట్ సిబానీ బిస్వాల్ ఆర్గానిక్ స్క్రాప్, రీయూజ్డ్ మెటల్‌లతో ఆర్ట్ ఇన్స్టాలేషన్లను సృష్టించారు. మానవ తప్పిదాల వల్ల సముద్రానికి జరుగుతున్న హాని గురించి తెలియజేసేలా ఉంటుంది జెనా రూపొందించిన తిమింగలం. ‘ఒషాబా బ్రాండ్ గురించి తెలుసుకున్న తరువాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ఆసక్తి పెరిగింది. వృథా అనుకునే వాటి నుంచి ప్రయోజనం సృష్టించాలి అనే వారి ఫిలాసఫీ నాకు నచ్చింది’ అంటుంది భో΄ాల్‌కు చెందిన ఇరవై రెండు సంవత్సరాల రీతిక. కళ తప్పి మూలన పడ్డ ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి గత సంవత్సరం లండన్ కేంద్రంగా ఒషాబా బ్రాండ్‌కు అంకురార్పణ జరిగింది. వాడి పారేసిన స్మార్ట్‌ఫోన్ సర్క్యూట్ బోర్డులు, ప్లగ్, యూఎస్బీ కేబుల్స్, చార్జింగ్ కేబుల్స్..మొదలైన వాటిలోని విలువైన వాటిని ఈ బ్రాండ్ ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. నిజానికి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆభరణాల తయారీలో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. 2018లో అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ‘డెల్’ కాలం చెల్లిన తమ కంప్యూటర్ విడి భాగాల నుంచి సేకరించిన విలువైన వాటితో నగలు రూపొదించడానికి లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘బాయూ విత్ లవ్’తో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలువైన పదార్థాల వృథాను నివారించడానికి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి వినియోగదారులలో అవగాహన కలిగించే సృజనాత్మక విధానాన్ని ‘డెల్’ ఎంచుకుంది. ‘జువెలరీ బ్రాండ్స్ రీ–సైకిల్డ్ అల్టర్నేటివ్స్పై ఆసక్తి చూపుతున్నాయి. వాడిపాడేసిన స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు... మొదలైన వాటిలో గోల్డ్ మైన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూలకు పడి ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో దాగి ఉన్న విలువైన లోహలు, ఒక టన్ను ఇ–వేస్ట్ నుంచి ఎన్ని గ్రాముల బంగారం వస్తుంది... లాంటి వివరాలు నాకు ఆసక్తికరంగా మారాయి’ అంటుంది ముంబైకి చెందిన నవీన. 23 సంవత్సరాల నవీనకు పాత, కొత్త అనే తేడా లేకుండా నగల డిజైనింగ్ ఐడియాలపై ఆసక్తి. ఈ ఆసక్తి ఆమెను ఎలైజా వాల్టర్లాగే నలుగురు మెచ్చిన డిజైనర్‌గా మార్చవచ్చు. నగ దరహాసం ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి నగలు తయారు చేసే బ్రాండ్‌గా బ్రిటన్‌లో మంచి పేరు సంపాదించింది లైలీ జువెలరి. ఎలైజా వాల్టర్ 24వ యేట ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది, యువతలో ఎంతోమందిలాగే ఇ–వ్యర్థాలలోని అపురూప అంశాలపై ఆసక్తి పెంచుకుంది. ‘ప్రపంచంలోని బంగారంలో ఏడు శాతం నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌లో దాగి ఉన్నందున ఆభరణ బ్రాండ్లు వాటిని ముఖ్యమైన వనరుగా చూస్తున్నాయి’ అంటున్న ఎలైజా వాల్టర్ ప్రయాణం యువతలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇ–వ్యర్థాల నుంచి రూపొందించిన ఈ ఆభరణాన్ని ఎలైజా వాల్టర్ డిజైన్ చేసింది. -
ఈ–వ్యర్థాల సేకరణ కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ–వేస్ట్‌ను) పర్యావరణహితంగా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పాలనలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలను ఆన్లైన్ విధానంలో అందిస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–వేస్ట్ భారీగా పెరిగిపోతుండటాన్ని సర్కారు గుర్తించింది. ఏటా ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెయ్యి టన్నుల ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతున్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కంప్యూటర్లు, ట్యాబులు, మొబైల్ ఫోన్లు, రూటర్లు, స్విచ్‌లు, వైర్లు వంటి వాటి కాలపరిమితి తీరిపోయి పనిచేయనివాటిని సేకరించి రీసైక్లింగ్, డిస్పోజబుల్ చేసేవిధంగా ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ వేస్ట్ సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్)ని నియమించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు ఈ–వ్యర్థాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ–వ్యర్థాలను సేకరించి వాటిని తీసుకెళ్లి రీసైక్లింగ్, రీ–ఫర్‌బిషింగ్, డిస్పోజబుల్ చేసే బాధ్యతల్ని అప్పగించేందుకు ఏపీటీఎస్ టెండర్లు పిలిచింది. ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, కార్యాలయాలు, సంస్థల నుంచి ఈ–వేస్ట్ సేకరించే విధంగా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో 40 శాతం లెడ్ ఉంటుంది. మొత్తం 75 శాతం భార లోహాలను కలిగి ఉండటంతో ఇవి పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించాయి. టెండర్ కమ్ ఆక్షన్ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేయనున్నామని, అత్యధిక ధర కోట్‌చేసిన సంస్థకు ఈ బాధ్యతను అప్పగిస్తామని ఏపీటీఎస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
ఎల్రక్టానిక్ వేస్ట్ బంగారమే! త్వరలో హైదరాబాద్ శివార్లలో రీసైక్లింగ్ ప్లాంట్
మన చేతిలోని సెల్‌ఫోన్.. చూసే టీవీ.. కంప్యూటర్.. కీబోర్డు.. ఇలా ఎన్నో ఎల్రక్టానిక్ వస్తువులు. పాడైపోతేనో, పాతబడిపోతేనో పడేస్తూ ఉంటాం. ఇలాంటి ఎల్రక్టానిక్ చెత్త (ఈ–వేస్ట్) నుంచి బంగారం, వెండి, లిథియం వంటి ఎన్నో విలువైన లోహాలను వెలికి తీయవచ్చు తెలుసా? ఎలక్ట్రానిక్ పరికరాల్లోని మదర్‌బోర్డులు, ఇంటిగ్రేటెడ్ చిప్‌లు, పలు ఇతర భాగాల్లో స్వల్ప స్థాయిలో విలువైన లోహాలను వినియోగిస్తారు. బోర్డులు, చిప్‌లు మన్నికగా పనిచేయడంతోపాటు వాటిలో వేగంగా/సమర్థవంతంగా విద్యుత్ ప్రసారానికి ఇవి తోడ్పడతాయి. మరి ఎల్రక్టానిక్ పరికరాలను పడేసినప్పుడు.. వాటి నుంచి సదరు లోహాలను వెలికితీసే ‘ఈ–వేస్ట్ రీసైక్లింగ్’ప్లాంట్ త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతోంది. సాక్షి, హైదరాబాద్: ఎల్రక్టానిక్ వ్యర్థాలను (ఈ–వేస్ట్) రీసైకిల్ చేసి విలువైన లోహాలను వెలికితీసే ప్లాంట్ హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో ఏర్పాటుకానుంది. వివిధ రకాల వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైక్లింగ్, రీయూజ్ చేయడంలో గుర్తింపు పొందిన రాంకీ కంపెనీకి చెందిన ‘రీసస్టెయినబిలిటీ లిమిటెడ్’సంస్థ.. అమెరికాకు చెందిన రెల్డాన్ రిఫైనింగ్ సంస్థతో కలిసి ఈ–వేస్ట్ రిఫైనరీ ప్లాంట్ పనులు చేపట్టింది. పాడైపోయిన కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్స్, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను హైదరాబాద్‌తోపాటు బెంగళూర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, హల్దియా, వైజాగ్ తదితర కేంద్రాల్లో ధ్వంసం చేసి వాటిల్లోని విలువైన మెటల్స్ ఉండే భాగాలను వేరు చేస్తారు. వాటిని హైదరాబాద్ ప్లాంట్‌లో రీసైక్లింగ్ చేస్తారు. మే నాటికి అందుబాటులోకి.. ఈ ప్లాంట్‌లో అధునాతన ‘పైరో మెటలర్జికల్ టెక్నాలజీ’ద్వారా ఈ–వేస్ట్‌తోపాటు పారిశ్రామిక వ్యర్థాలు కలిపి ఏటా దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల వరకు రీసైకిల్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రీసైక్లింగ్ ద్వారా విలువైన బంగారం, వెండి, కోబాల్ట్, లిథియం, నికెల్, పల్లాడియం, ప్లాటినం వంటివి వేరుచేస్తారు. ఈ లోహాలను తిరిగి ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ రంగాలతోపాటు స్టీల్, ఫర్నిచర్, భారీ మెషినరీ పరిశ్రమల్లో వినియోగిస్తారు. దాదాపు రూ.65 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్‌ను వచ్చే మే నెలలో ప్రారంభించే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఫార్మాస్యూటికల్, పెట్రో కెమికల్, జ్యువెలరీ వ్యర్థాలను సైతం రీసైక్లింగ్ చేసే యోచనలో ఉన్నట్టు ‘రీసస్టెయినబిలిటీ’ప్రతినిధులు చెప్తున్నారు. ఉత్పత్తి మేరకు రీసైక్లింగ్ లేదు ప్రపంచంలో ఈ–వేస్ట్ ఎక్కువగా ఉత్పత్తవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ఈ–వేస్ట్‌లో నాలుగో వంతు కంటే తక్కువే రీసైకిల్ చేయగల పరిస్థితులు ఉన్నాయి. దేశంలో 2019లో వెలువడిన ఈ–వేస్ట్ 3.2 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా.. 2030 నాటికి ఇది మరో 21 శాతం పెరుగుతుందని అంచనా. 90శాతం రీసైక్లింగ్ అశాస్త్రీయంగానే.. దేశంలోని ఈ–వేస్ట్‌లో దాదాపు 90 శాతం రీసైక్లింగ్ అనధికారికంగా, అశాస్త్రీయంగా జరుగుతోంది. నీతి ఆయోగ్ గణాంకాల మేరకు దేశవ్యాప్తంగా మూడు వేలకుపైగా కేంద్రాల్లో ఈ పనులు జరుగుతున్నాయి . వాటిలో పనిచేసే కారి్మకులు మాన్యువల్‌గానే వ్యర్థాల్ని వేరు చేస్తుండటంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. వాటి పరిసరాల్లోని ప్రజలు తీవ్ర వ్యాధులబారిన పడే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికతతో పరిష్కారం అధిక మొత్తాల్లో ఈ–వేస్ట్‌ను రీసైక్లింగ్ చేయ గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చైనా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో మాత్రమే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో 13.6 ఎకరాల స్థలంలో ఏర్పాటవుతున్న ఈ–వేస్ట్ రిఫైనరీ ప్లాంట్ కూడా ఆధునికమైనదే. దీనితో ఈ–వేస్ట్ సెక్టార్ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించనుందని.. సర్క్యులర్ ఎకానమీ బలోపేతమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2022 సవ్యంగా అమలు కావాలన్నా ఇలాంటి ప్లాంట్లు అవసరమని అంటున్నారు. -
భాగ్యనగరానికి ఈ-వేస్ట్ బెడద
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ముఖ్య కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ–వేస్ట్) అతిపెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఈ–వేస్ట్ సేకరణ మొదలుకొని దానిని భాగాలుగా విడదీయడం, రీ సైక్లింగ్ చేయడంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించక పోవడంతో పర్యావరణానికి భారీగా హాని కలుగుతోంది. మరోవైపు ఈ–వేస్ట్‌లో ఉండే విలువైన లోహాలు చెత్త రూపంలో భూమి పొరల్లోకి చేరుతుండటంతో ఆర్థికంగా కూడా నష్టం జరుగుతోంది. కొంత మొత్తంలో ఈ–వేస్ట్‌ను సేకరించినా అనియంత్రిత రంగంలో రీసైక్లింగ్ కావడం కూడా అనేక సమస్యలకు దారితీస్తోంది. నిత్య జీవితంలో సాంకేతికత ప్రాధాన్యంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం కూడా భారీగా పెరిగింది. సీపీయూతో పాటు ఇన్ పుట్, ఔట్పుట్ డివైజ్లతో కూడిన పీసీలు, సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, ప్రింటర్లు, కాట్రిడ్జ్‌లు, టెలివిజన్లు ఎల్ఈడీ, ఎల్సీడీ, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం నిత్య జీవనంలో పెనవేసుకుపోయింది. నిరుపయోగంగా మారిన ఈ ఉపకరణాలు, పరికరాలు తదితర ఈ–వేస్ట్‌ను ఎలా వదిలించుకోవాలో తెలియక పోవడం అనేక సమస్యలకు దారితీస్తోంది. వీటి డిస్మాంట్లింగ్, రీ సైక్లింగ్‌లను గుర్తింపు పొందిన సంస్థలు శాస్త్రీయ పద్ధతిలో చేస్తాయి. అయితే ఈ–వేస్ట్‌లో ఎక్కువ భాగం అనియంత్రిత రంగంలో ఉన్న వారి చేతుల్లోకి పోతోంది. ఈ–వేస్ట్ లాభాలను కురిపించే రంగం కావడంతో శాస్త్రీయ రీ సైక్లింగ్, డిస్మాంట్లింగ్పై అవగాహన లేని స్క్రాప్ డీలర్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వీరు ఈ–వేస్ట్‌ను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టి అందులోని విలువైన లోహాలను సంగ్రహిస్తున్నారు. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల విడిభాగాల్లో బంగారం, పల్లాడియం, రాగి, వెండి, అల్యూమినియం వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటితో పాటు మెర్క్యురీ, లెడ్, కాడ్మియం, బేరియం, లిథియం వంటి హానికారక భారలోహాలు, ఇతర రసాయనాలు కూడా ఉంటాయి. వీటిని శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయకపోవడంతో అవి భూమి పొరల్లోకే కాదు గాలి, నీటిలోకీ చేరుతున్నాయి. వాటి నుంచి వెలువడే విషపూరిత వాయువులు వాతావరణంలోకి చేరి మానవ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. దీంతో చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. ‘ఈ–వేస్ట్ పాలసీ’తో కొంత మెరుగు ఈ–వేస్ట్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో ‘ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ’ని రూపొందించింది. పాలసీ పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించారు. ఈ– వేస్ట్ పాలసీకి అనుగుణంగా ప్రొడ్యూసర్లు పలు రీ సైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లతో పాటు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 9 రీ సైక్లింగ్ యూనిట్లు, 14 డిస్మాంట్లింగ్ యూనిట్లు, 35 మంది ఈ వేస్ట్ ప్రొడ్యూసర్లు ఉన్నారు. వీటికి అవసరమైన ముడి సరుకు (ఈ–వేస్ట్) పుష్కలంగా అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో అనేక రీసైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లు స్థాపించేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రీసైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లు కేంద్రీకృతమై ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్ రికవరీలో పేరొందిన ‘అటెరో ఇండియా’ తెలంగాణలో కొత్త యూనిట్ ఏర్పాటుకు గత ఏడాది అక్టోబర్‌లో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు అక్కడ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఈ యూనిట్‌తో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. ∙కల్వల మల్లికార్జున్‌రెడ్డి -
ఈ-వ్యర్థం.. అనర్థం..
ఈ–భూతం.. పంచభూతాలను మింగిస్తోంది. మానవ మేధతో ప్రాణం పోసుకుని.. మనిషిని తన ‘కీ’బోర్డుకు కట్టేసుకున్న కంప్యూటర్.. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టి ‘స్మార్ట్’గా మురిపించిన సెల్.. విజ్ఞానం, వినోదం పంచే టీవీలు.. ఏసీలు..ఇలా ఎన్నో.. అవసరం తీరాక మన మనుగడకే సవాల్ విసురుతున్నాయి. ఈ–వేస్ట్‌లోని రసాయనాల నుంచి విడుదలయ్యే విషవాయులు మన నాడీవ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఈ ముప్పును గుర్తించిన జీవీఎంసీ, ఏపీపీసీబీలు గ్రీన్‌వేవ్స్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ సంస్థ సహకారంతో ఎలక్ట్రానిక్ వృథా పరికరాలను సేకరించి రీసైకిల్ చేసేందుకు రెండేళ్ల కిందేట ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే ప్రజల్లో సరైన అవగాహన లేక.. అధిక భాగం ఈ–వ్యర్థాలు సాధారణ చెత్తలోనే కలిసిపోతున్నాయి. దొండపర్తి(విశాఖ దక్షిణ): ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం విస్తృతమవుతోంది. పెరుగుతున్న సాంకేతికత.. ప్రపంచాన్ని ఈ–కుగ్రామంగా మార్చేసింది. వయసుతో నిమిత్తం లేకుండా గాడ్జెట్లు వినియోగించేస్తున్నారు. ఉత్పత్తిపై దృష్టి సారించిన తయారీ సంస్థలు.. రోజుకో కొత్త ఫీచర్లతో మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే వాటి జీవిత కాలం ముగిసిన తర్వాత ఏం చేయాలనే విషయంపై శ్రద్ధ వహించడం లేదు. సరైన అవగాహన లేని ఫలితంగా నగరంలో ఉత్పత్తి అవుతున్న ఈ–వ్యర్థాలు సాధారణ చెత్తలో కలిసిపోతూ.. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. నిత్యం పర్యవేక్షించి.. ఎప్పటికప్పుడు అప్రమత్త చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి ఇప్పుడిప్పుడే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తీవ్రంగా పెరిగిపోయింది. అవి లేనిదే నిమిషం కూడా ఉండలేని స్థితిలోకి ప్రజలు ఉండటంతో.. వాటి కొనుగోళ్లు కూడా ఏటా గణనీయంగా పెరుగుతోంది. మొబైల్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కీబోర్డులు, మౌస్‌లు, సర్వర్లు, డాటా స్టోరేజీ డివైజ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఫొటో కాపీయింగ్ మెషీన్లు, టీవీలు, వాషింగ్మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు.. ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం జీవితంలో భాగమైపోయాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ–వ్యర్థాల జీవితకాలం పూర్తయ్యాక వాటి పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తే.. పర్యావరణం పెను ప్రమాదంలో పడే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నగరంలో 30 శాతం వ్యర్థాలు ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 50 మిలియన్ టన్నుల ఈ–వేస్ట్ ఉత్పన్నమవుతుండగా, మన దేశంలోనే సుమారు 1 మిలియన్ టన్ను వ్యర్థాలు పోగుపడుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. విశాఖ నగరంలో 2015లో 280 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమవగా, 2016లో 320 మెట్రిక్ టన్నులు, 2017లో 350 మెట్రిక్ టన్నులు, 2018లో 375 మెట్రిక్ టన్నులు, 2019లో 410 మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ ఉత్పత్తి అయినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. విశాఖ డివిజన్ పరిధిలో ఏటా 25 నుంచి 30 శాతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగవుతున్నాయని అధికారిక అంచనా. ఇటీవల కాలంలో తయారీ సంస్థలు సీపీసీబీ నిబంధనలకు లోబడి ఎక్సే్ఛంజ్ ఆఫర్ల ద్వారా పాత ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించడం ప్రారంభించాయి. దీని వల్ల నగరంలో సుమారు 30 నుంచి 35 శాతం వరకు పాత పరికరాలను సంస్థలు సేకరిస్తున్నాయి. అయినప్పటికీ వ్యర్థాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవీ సీపీసీబీ మార్గదర్శకాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) 2016లోనే నూతన మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం ఈ–వ్యర్థాల సేకరణ అనేది ఉత్పత్తిదారులు కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత అని స్పష్టం చేసింది. దీని కోసం ఆయా కంపెనీలు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఎక్స్‌టెండెండ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్‌బిలిటీ(ఈపీఆర్)లో హామీ ఇచ్చినట్లుగా ఆయా కంపెనీలు మొదటి రెండేళ్లలో 30 శాతం, తర్వాత రెండేళ్లలో 40 శాతం, తర్వాత రెండేళ్లలో 50 శాతం, చివరిగా ఏడో సంవత్సరంలో 70 శాతం ఈ–వ్యర్థాల్ని సేకరించాలని సీపీసీబీ స్పష్టం చేసింది. తాజాగా డిపాజిట్ రీఫండ్ స్కీమ్‌ను కూడా తెరపైకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే సమయంలో కొంత డబ్బును ప్రత్యేకంగా వసూలు చేయాలని, ఆ వస్తువు జీవిత కాలం ముగిసిన తర్వాత దాన్ని సేకరించి ఆ డబ్బును తిరిగి చెల్లించాలని సూచించింది. అమ్మకాలు జరిపే డీలర్స్ కూడా ఈ–వేస్ట్ సేకరణను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించింది. ఏపీపీసీబీ ఏం చేస్తోంది.? సీపీసీబీ తీసుకొచ్చిన మార్గదర్శకాలపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కొంత వరకు విఫలమవుతోంది. దీనికి కారణం కొత్త మార్గదర్శకాల ప్రకారం కంపెనీల ఆథరైజేషన్లన్నీ సీపీసీబీ చేతిలోనే ఉండిపోయాయి. ఈపీఆర్ ప్రకారం ఏవైనా ఉత్పత్తి కంపెనీలు స్థానికంగా ఈ–వేస్ట్‌ను సేకరించేందుకు పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెబితే.. అవి సరైనవా కావా అనే విషయాల్ని క్రోడీకరించి.. వాటి నివేదికను సీపీసీబీకి అప్పగించడం వరకే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పాత్ర ఉంది. వ్యర్థాల నిర్వహణపై పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. విశాఖ డివిజన్ పరిధిలోని ఈ–వ్యర్థాలను సేకరించేందుకు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గాజువాకలోని గ్రీన్‌వేవ్స్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్‌తో పాటు ఆటోనగర్‌లోని వశిష్ట, రాంకీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యర్థాల్లోని రసాయనాలతో చేటు ఈ–చెత్తపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో.. ఇందులో చాలా భాగం సాధారణ చెత్తరూపంలోకి వెళ్లిపోతుంది. అశాస్త్రీయంగా వీటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తుండటంతో వీటిలో నిక్షిప్తమైన కాడ్మియం, పాదరసం, సీసం మొదలైన విష రసాయన పదార్థాలు పర్యావరణంలోకి చేరుతున్నాయి. గాలిలోకి కలిసిపోయిన ఈ భార లోహాల్ని పీల్చినప్పుడు అవి శరీరంలోకి చేరిపోయి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంటాయి. అంతే కాకుండా రక్తప్రసరణ, పునరుత్పత్తి, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదముంది. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఈ–వ్యర్థాల సేకరణ, రీసైకిల్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ పరిధిలో వినూత్న ప్రయోగం ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి నగరంలో చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ.. కాలం చెల్లిన పరికరాలను ఏం చేయాలో తెలీని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వారి కోసం జీవీఎంసీ పరిధిలో వినూత్న కార్యక్రమానికి రెండేళ్ల కిందటే శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ, ఏపీపీసీబీ సహకారంతో గ్రీన్‌వేవ్స్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ సంస్థ ఎలక్ట్రానిక్ వృథా పరికరాలను సేకరించి రీసైకిల్ చేసే ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇందుకోసం గాజువాక నుంచి ఎంవీపీ కాలనీ వరకు వివిధ ప్రాంతాల్లో ఈ–వ్యర్థాల కోసం ప్రత్యేక బిన్లు ఏర్పాటు చేసి.. వేస్టేజ్‌ను సేకరిస్తోంది. అయితే ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో అధిక భాగం వ్యర్థాలు సాధారణ చెత్తలోనే కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రజలు ఈ–చెత్తపై అవగాహన పెంచుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ అధికారులు కోరుతున్నారు. -
ఈ-చెత్తతో ఆరోగ్యానికి తూట్లు!
కాంపిటీటివ్ గెడైన్స్ జనరల్ సైన్స్ 20వ శతాబ్దంలో మానవుడు సాధించిన అభివృద్ధిలో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆవిష్కృతమయ్యాయి. తర్వాత కాలంలో ప్రపంచీకరణ ఫలితంగా సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ సాధనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనిషి జీవితం నుంచి వీటిని విడదీయలేనంతగా కలిసి పోయాయి. ఇదే సమయంలో అపరిమితంగా వాడి పారేస్తున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అందువల్లే ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) సమస్య ముందు వరుసలో ఉంది. వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు) అంటారు. పాడైన టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్చార్జర్లు, బ్యాటరీలు, మదర్‌బోర్డులు, ఏసీలు, వాషింగ్మెషిన్లు, రిమోట్లు, సీడీలు, హెడ్ఫోన్లు, జిరాక్స్ యంత్రాలు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు (సీపీయూ), ఐపాడ్, ఫ్యాక్స్ యంత్రాలు మొదలైన వాటిని ఈ-వ్యర్థాలుగా పేర్కొంటారు. వీటి విడుదల రోజురోజుకూ అధికమవుతూ..పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ఈ-వ్యర్థాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి, భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు - వ్యాధులు ఈ-వ్యర్థాలకు సంబంధించి మదర్‌బోర్డు, చిప్, సర్క్యూట్లను ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. వీటి తయారీలో ప్రమాదకరమైన సీసం, ఆర్సినిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, పాదరసం, నికెల్, జింక్ మొదలైన వాటిని ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి తయారు చేసిన వస్తువులను పారేస్తే వాటి భాగాల్లో ఉండే రసాయనాలు మట్టితో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తాయి. వీటిని తగలబెట్టడం ద్వారా వచ్చే విష వాయువులు వాతావరణానికి హాని కలిగిస్తాయి. సీసాన్ని రీచార్జబుల్ బ్యాటరీలు, ట్రాన్సిస్టర్లు, లిథియం బ్యాటరీల తయారీలో అధికంగా వాడతారు. సీసంతో కలుషితమైన నీటిని తాగితే నాడీ వ్యవస్థతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. పిల్లల్లో బుద్ధిమాంద్యం వస్తుంది. కంప్యూటర్ మానిటర్, సర్క్యూట్ బోర్డులు, కంప్యూటర్ బ్యాటరీ తయారీలో కాడ్మియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీర్ఘకాలం కాడ్మియం ప్రభావానికి గురైతే ఐ్ట్చజీఐ్ట్చజీ అనే వ్యాధి కలుగుతుంది. మూత్రపిండాలు, ఎముకలను బలహీనపరచడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. దీంతోపాటు ఈ వ్యాధి వస్తే వెన్నెముక, కీళ్లలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. పాదరసాన్ని (మెర్క్యూరీ) స్విచ్‌లు, పాకెట్ క్యాలిక్యులేటర్, ఎల్సీడీల తయారీలో వాడతారు. పాదరసం ఆహారపు గొలుసు ద్వారా మనిషిలోకి చేరి మినిమెటా వ్యాధిని కలుగజేస్తుంది. సెమికండక్టర్లు, డయోడ్లు, లెడ్‌ల తయారీలో వాడే ఆర్సినిక్ వల్ల క్యాన్సర్, గుండెజబ్బు కలుగుతాయి. అమెరికా నుంచే అధికంగా.. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సరాసరి 93.5 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం అమెరికా అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడుదల చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా చైనా, జపాన్, జర్మనీ దేశాలున్నాయి. భారతదేశం సంవత్సరానికి 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వెలువరిస్త్తూ ఐదో స్థానంలో ఉంది. 2020 నాటికి భారత్‌లో 52 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు విడుదలవుతాయని అసోచామ్ అంచనా. పెరుగుతున్న జనాభా, ప్రపంచదేశాలకు భారతదేశం ప్రధాన మార్కెట్‌గా ఉండటంతో ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులను ముందుగా ఇక్కడ విడుదల చేస్తున్నాయి. భారత్‌లో యువత ఎక్కువ సంఖ్యలో ఉండటం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం వంటివి కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముంబై నగరం 1,20,000 మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానం (98,000 మెట్రిక్ టన్నులు), బెంగుళూరు మూడో స్థానం, చెన్నై నాలుగో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది. దేశంలో విడుదలతున్న ఈ-వ్యర్థాల్లో 70 శాతం కంప్యూటర్ విడిభాగాలు ఉండగా.. 12 శాతం టెలికాం పరికరాలు, 8 శాతం ఎలక్ట్రానిక్ రంగం నుంచి వచ్చిన వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునఃశుద్ధి (రీ సైక్లింగ్ ఆఫ్ ఈ-వేస్ట్) భారతదేశంలో విడుదలయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో కేవలం 1.5 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు అసోచామ్ సర్వే తెలిపింది. రీసైక్లింగ్ ప్రక్రియలో ఈ-వ్యర్థాలను సుత్తెలతో కొట్టి పిండి చేయడం, ముక్కలుగా నరకడం చేస్తారు. ఈ ప్రక్రియలో వాటి నుంచి బయటపడిన రసాయన పదార్థాలు మట్టిలో చేరతాయి. వర్షం వచ్చినప్పుడు అవి నీటిలో కలిసి, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. బాసెల్ ఒడంబడిక ప్రపంచదేశాల మధ్య హానికర వ్యర్థ పదార్థాల రవాణాను నిషేధిస్తూ బాసెల్ ఒడంబడిక జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి హానికర వ్యర్థ పదార్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు రవాణా చేయడాన్ని బాసెల్ ఒడంబడిక నిషేధిస్తుంది. అయితే ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు తమ దేశాల్లో విడుదలైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆఫ్రికాలోని ఘనా, నైజీరియా, ఆసియాలోని భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, చైనా వంటి దేశాలకు తరలిస్తున్నాయి. ఈ విధంగా భారత్‌లోకి ఏడాదికి 50,000 టన్నుల ఈ-వ్యర్థాలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. భారతదేశ ఎగుమతి-దిగుమతి చట్టాల ప్రకారం 10 సంవత్సరాలు వాడిన సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని ఆయా దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను భారత్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి ధనిక దేశాలు ఈ-వ్యర్థాలను పేద దేశాలకు తరలిస్తున్నాయి. హానికర ఈ-వ్యర్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆఫ్రికా ఖండంలోని 12 దేశాలు కలిసి బమాకో కన్వెన్షన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది 1999 నుంచి ఆఫ్రికా ఖండంలో అమల్లోకి వచ్చింది. తర్వాత కాలంలో హానికర రసాయన వ్యర్థ పదార్థాల రవాణాను మరింత కఠినతరం చేస్తూ 1998లో 140 దేశాలు రోటర్డ్యామ్ కన్వెన్షన్‌ను ఆమోదించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 2004, ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశం 2005, మే 24న దీన్ని ఆమోదించింది. హానికర రసాయన వ్యర్థ పదార్థాల వల్ల జరుగుతున్న హానిని గ్రహించిన భారత ప్రభుత్వం ఇటీవల హానికర వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమావళిని (మార్చి, 2016) తీసుకొచ్చింది. మాదిరి ప్రశ్నలు 1. Itai-Itai అనే వ్యాధి దేని ప్రభావం వల్ల కలుగుతుంది? 1) సీసం 2) ఆర్సెనిక్ 3) కాడ్మియం 4) పాదరసం జవాబు: 3 2. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? 1) అమెరికా 2) చైనా 3) జపాన్ 4) జర్మనీ జవాబు: 1 3. భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ఏది? 1) ఢిల్లీ 2) కోల్‌కతా 3) చెన్నై 4) ముంబై జవాబు: 4 - ప్రవీణ్ దత్తు లెక్చరర్ ఇన్ జువాలజీ,ఎల్.హెచ్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం -
ఈ-వ్యర్థాల్లో 4.5 లక్షల మంది బాలలు
ప్రమాదకర పరిస్థితుల్లో కార్యకలాపాలు అసోచామ్ ఆందోళన కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల(ఈ-వేస్ట్) సేకరణ, రీసైక్లింగ్ వంటి కార్యకలాపాల్లో సుమారు 4.5 లక్షల మంది బాల కార్మికులు పనిచేస్తున్నారని అసోచామ్ వెల్లడించింది. 10-14 ఏళ్ల మధ్య వయసుల్లోనే ఉన్న వీరంతా సరైన రక్షణ, ప్రమాణాలు లేని వర్క్‌షాపుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. ఈ-వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ వంటి పనులకు బాలలను వినియోగించకుండా చట్టాన్ని తీసుకురావాలని సిఫారసు చేసింది. మౌలిక వసతుల లేమి కారణంగా సేకరించిన మొత్తం ఈ-వ్యర్థాల్లో 4 శాతం మాత్రమే రీసైకిల్(పునర్వినియోగం) అవుతున్నాయని, దీనివల్ల పర్యావర ణానికీ నష్టం కలుగుతోందని తెలిపింది. ఈ-వ్యర్థాల్లో 95% అసంఘటిత రంగం నుంచే వస్తున్నాయని, వాటిని తుక్కు డీలర్లు రీసైకిల్ చే యకుండా భాగాలుగా విడగొట్టి పారేస్తున్నారంది. అసోచామ్ ప్రకారం.. దేశంలో ఏటా 12.5 లక్షల మెట్రిక్‌టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. 2015 నాటికి 15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనుంది. ఈ-వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి అవుతున్న నగరాల్లో ముంబై (96 వేల మెట్రిక్ టన్నులు) మొదటిస్థానంలో ఉండగా.. తర్వాత ఢిల్లీ (67 వేలు), బెంగళూరు (57 వేలు), చెన్నై (47 వేలు), హైదరాబాద్ (25 వేలు) ఉన్నాయి.