ఈ–భూతం.. పంచభూతాలను మింగిస్తోంది. మానవ మేధతో ప్రాణం పోసుకుని.. మనిషిని తన ‘కీ’బోర్డుకు కట్టేసుకున్న కంప్యూటర్.. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టి ‘స్మార్ట్’గా మురిపించిన సెల్.. విజ్ఞానం, వినోదం పంచే టీవీలు.. ఏసీలు..ఇలా ఎన్నో.. అవసరం తీరాక మన మనుగడకే సవాల్ విసురుతున్నాయి. ఈ–వేస్ట్‌లోని రసాయనాల నుంచి విడుదలయ్యే విషవాయులు మన నాడీవ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఈ ముప్పును గుర్తించిన జీవీఎంసీ, ఏపీపీసీబీలు గ్రీన్‌వేవ్స్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ సంస్థ సహకారంతో ఎలక్ట్రానిక్ వృథా పరికరాలను సేకరించి రీసైకిల్ చేసేందుకు రెండేళ్ల కిందేట ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే ప్రజల్లో సరైన అవగాహన లేక.. అధిక భాగం ఈ–వ్యర్థాలు సాధారణ చెత్తలోనే కలిసిపోతున్నాయి.
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం విస్తృతమవుతోంది. పెరుగుతున్న సాంకేతికత.. ప్రపంచాన్ని ఈ–కుగ్రామంగా మార్చేసింది. వయసుతో నిమిత్తం లేకుండా గాడ్జెట్‌లు వినియోగించేస్తున్నారు. ఉత్పత్తిపై దృష్టి సారించిన తయారీ సంస్థలు.. రోజుకో కొత్త ఫీచర్లతో మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే వాటి జీవిత కాలం ముగిసిన తర్వాత ఏం చేయాలనే విషయంపై శ్రద్ధ వహించడం లేదు. సరైన అవగాహన లేని ఫలితంగా నగరంలో ఉత్పత్తి అవుతున్న ఈ–వ్యర్థాలు సాధారణ చెత్తలో కలిసిపోతూ.. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. నిత్యం పర్యవేక్షించి.. ఎప్పటికప్పుడు అప్రమత్త చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి ఇప్పుడిప్పుడే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తీవ్రంగా పెరిగిపోయింది. అవి లేనిదే నిమిషం కూడా ఉండలేని స్థితిలోకి ప్రజలు ఉండటంతో.. వాటి కొనుగోళ్లు కూడా ఏటా గణనీయంగా పెరుగుతోంది. మొబైల్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కీబోర్డులు, మౌస్‌లు, సర్వర్లు, డాటా స్టోరేజీ డివైజ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఫొటో కాపీయింగ్ మెషీన్లు, టీవీలు, వాషింగ్‌మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు.. ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం జీవితంలో భాగమైపోయాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ–వ్యర్థాల జీవితకాలం పూర్తయ్యాక వాటి పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తే.. పర్యావరణం పెను ప్రమాదంలో పడే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
నగరంలో 30 శాతం వ్యర్థాలు
ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 50 మిలియన్ టన్నుల ఈ–వేస్ట్ ఉత్పన్నమవుతుండగా, మన దేశంలోనే సుమారు 1 మిలియన్ టన్ను వ్యర్థాలు పోగుపడుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. విశాఖ నగరంలో 2015లో 280 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమవగా, 2016లో 320 మెట్రిక్ టన్నులు, 2017లో 350 మెట్రిక్ టన్నులు, 2018లో 375 మెట్రిక్ టన్నులు, 2019లో 410 మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ ఉత్పత్తి అయినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. విశాఖ డివిజన్ పరిధిలో ఏటా 25 నుంచి 30 శాతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగవుతున్నాయని అధికారిక అంచనా. ఇటీవల కాలంలో తయారీ సంస్థలు సీపీసీబీ నిబంధనలకు లోబడి ఎక్సే్ఛంజ్ ఆఫర్ల ద్వారా పాత ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించడం ప్రారంభించాయి. దీని వల్ల నగరంలో సుమారు 30 నుంచి 35 శాతం వరకు పాత పరికరాలను సంస్థలు సేకరిస్తున్నాయి. అయినప్పటికీ వ్యర్థాలు పెరుగుతూనే ఉన్నాయి.
ఇవీ సీపీసీబీ మార్గదర్శకాలు
ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) 2016లోనే నూతన మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం ఈ–వ్యర్థాల సేకరణ అనేది ఉత్పత్తిదారులు కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత అని స్పష్టం చేసింది. దీని కోసం ఆయా కంపెనీలు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఎక్స్‌టెండెండ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్‌బిలిటీ(ఈపీఆర్)లో హామీ ఇచ్చినట్లుగా ఆయా కంపెనీలు మొదటి రెండేళ్లలో 30 శాతం, తర్వాత రెండేళ్లలో 40 శాతం, తర్వాత రెండేళ్లలో 50 శాతం, చివరిగా ఏడో సంవత్సరంలో 70 శాతం ఈ–వ్యర్థాల్ని సేకరించాలని సీపీసీబీ స్పష్టం చేసింది. తాజాగా డిపాజిట్ రీఫండ్ స్కీమ్‌ను కూడా తెరపైకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే సమయంలో కొంత డబ్బును ప్రత్యేకంగా వసూలు చేయాలని, ఆ వస్తువు జీవిత కాలం ముగిసిన తర్వాత దాన్ని సేకరించి ఆ డబ్బును తిరిగి చెల్లించాలని సూచించింది. అమ్మకాలు జరిపే డీలర్స్ కూడా ఈ–వేస్ట్ సేకరణను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించింది.
ఏపీపీసీబీ ఏం చేస్తోంది.?
సీపీసీబీ తీసుకొచ్చిన మార్గదర్శకాలపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కొంత వరకు విఫలమవుతోంది. దీనికి కారణం కొత్త మార్గదర్శకాల ప్రకారం కంపెనీల ఆథరైజేషన్లన్నీ సీపీసీబీ చేతిలోనే ఉండిపోయాయి. ఈపీఆర్ ప్రకారం ఏవైనా ఉత్పత్తి కంపెనీలు స్థానికంగా ఈ–వేస్ట్‌ను సేకరించేందుకు పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెబితే.. అవి సరైనవా కావా అనే విషయాల్ని క్రోడీకరించి.. వాటి నివేదికను సీపీసీబీకి అప్పగించడం వరకే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పాత్ర ఉంది. వ్యర్థాల నిర్వహణపై పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. విశాఖ డివిజన్ పరిధిలోని ఈ–వ్యర్థాలను సేకరించేందుకు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గాజువాకలోని గ్రీన్‌వేవ్స్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్‌తో పాటు ఆటోనగర్‌లోని వశిష్ట, రాంకీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
వ్యర్థాల్లోని రసాయనాలతో చేటు
ఈ–చెత్తపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో.. ఇందులో చాలా భాగం సాధారణ చెత్తరూపంలోకి వెళ్లిపోతుంది. అశాస్త్రీయంగా వీటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తుండటంతో వీటిలో నిక్షిప్తమైన కాడ్మియం, పాదరసం, సీసం మొదలైన విష రసాయన పదార్థాలు పర్యావరణంలోకి చేరుతున్నాయి. గాలిలోకి కలిసిపోయిన ఈ భార లోహాల్ని పీల్చినప్పుడు అవి శరీరంలోకి చేరిపోయి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంటాయి. అంతే కాకుండా రక్తప్రసరణ, పునరుత్పత్తి, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదముంది. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఈ–వ్యర్థాల సేకరణ, రీసైకిల్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
గ్రేటర్ పరిధిలో వినూత్న ప్రయోగం
ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి నగరంలో చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ.. కాలం చెల్లిన పరికరాలను ఏం చేయాలో తెలీని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వారి కోసం జీవీఎంసీ పరిధిలో వినూత్న కార్యక్రమానికి రెండేళ్ల కిందటే శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ, ఏపీపీసీబీ సహకారంతో గ్రీన్‌వేవ్స్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ సంస్థ ఎలక్ట్రానిక్ వృథా పరికరాలను సేకరించి రీసైకిల్ చేసే ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇందుకోసం గాజువాక నుంచి ఎంవీపీ కాలనీ వరకు వివిధ ప్రాంతాల్లో ఈ–వ్యర్థాల కోసం ప్రత్యేక బిన్లు ఏర్పాటు చేసి.. వేస్టేజ్‌ను సేకరిస్తోంది. అయితే ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో అధిక భాగం వ్యర్థాలు సాధారణ చెత్తలోనే కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రజలు ఈ–చెత్తపై అవగాహన పెంచుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ అధికారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment