
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ–వేస్ట్‌ను) పర్యావరణహితంగా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పాలనలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలను ఆన్‌లైన్ విధానంలో అందిస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–వేస్ట్ భారీగా పెరిగిపోతుండటాన్ని సర్కారు గుర్తించింది.
ఏటా ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెయ్యి టన్నుల ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతున్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కంప్యూటర్లు, ట్యాబులు, మొబైల్ ఫోన్లు, రూటర్లు, స్విచ్‌లు, వైర్లు వంటి వాటి కాలపరిమితి తీరిపోయి పనిచేయనివాటిని సేకరించి రీసైక్లింగ్, డిస్పోజబుల్ చేసేవిధంగా ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ వేస్ట్ సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్)ని నియమించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు ఈ–వ్యర్థాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ–వ్యర్థాలను సేకరించి వాటిని తీసుకెళ్లి రీసైక్లింగ్, రీ–ఫర్‌బిషింగ్, డిస్పోజబుల్ చేసే బాధ్యతల్ని అప్పగించేందుకు ఏపీటీఎస్ టెండర్లు పిలిచింది.
ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, కార్యాలయాలు, సంస్థల నుంచి ఈ–వేస్ట్ సేకరించే విధంగా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో 40 శాతం లెడ్ ఉంటుంది.
మొత్తం 75 శాతం భార లోహాలను కలిగి ఉండటంతో ఇవి పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించాయి. టెండర్ కమ్ ఆక్షన్ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేయనున్నామని, అత్యధిక ధర కోట్‌చేసిన సంస్థకు ఈ బాధ్యతను అప్పగిస్తామని ఏపీటీఎస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment