
వాషింగ్టన్ డీసీ: ట్రంప్ సర్కారు హార్వాడ్ విశ్వవిద్యాలయం(Harwad University)పై వేటు వేసింది. యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు ట్రంప్ సర్కారు జారీచేసిన విస్తృత డిమాండ్ల జాబితాను తిరస్కరించిన నేపధ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ల నిధులను(సుమారు రూ. 18,300 కోట్లు) స్తంభింపజేసింది. గతంలో వైట్ హౌస్ పరిపాలన అధికారులు హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
దీనికి స్పందించిన హార్వర్డ్ వర్శిటీ హెడ్ అలాన్ గార్బర్ తమ విద్యాసంస్థ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు. అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ గతంలో పేర్కొంది. గత ఏడాది హార్వార్డ్ పరిధిలోని కళాశాల ప్రాంగణాలలో విద్యార్థులు ఇజ్రాయెల్ యుద్ధాని(Israel's war)కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తదనంతరం అమెరికాలోని విద్యా శాఖ 60 కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూదు వ్యతిరేక వేధింపులు, వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ(Immigration Policy)లతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్ సర్కారు పేర్కొంది. ఈ నిధులను రక్షణ, వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటారు. ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు, పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాగా ట్రంప్ సర్కారు చర్యపై హార్వర్డ్ వర్శిటీ ఇంకా అధికారికంగా ప్రతిస్పందించలేదు.
ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు