
Russian Citizenship Forall citizens of Ukraine: తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులకు దిగుతున్న రష్యా దాదాపు చాలా ప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకుంది. ఆ మేరకు రష్యా అనుకూల వేర్పాటు వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్‌స్క్ ప్రావిన్సుపై పట్టు సాధించాయి రష్యా బలగాలు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పౌరులందరికి రష్యన్ ఫెడరేషన్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే హక్కు ఇచ్చేలా డిక్రీని వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే ఉక్రెయిన్‌లో రెండు ప్రాంతాల నివాసితులకు పౌరసత్వాన్ని వేగవంతం చేశారు. అంతేకాదు దాదాపు రష్యన్ దళాల నియంత్రణలో ఉన్న ఖేర్సన్, జపోరిజ్జియా వంటి ఆగ్నేయా ప్రాంతాల్లో ఈ విధానాన్ని వేగవంతం చేశారు. ఇలానే 2019లో తూర్పు ఉక్రెయిన్ నుంచి విడిపోయిన మాస్కో అనుకూల వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుగాన్క్స్ వంటి ప్రాంతాల్లోని నివాసితులకు ఇలాంటి డిక్రీని ఆదేశించి తనలోకి కలిపేసుకుంది. వాస్తవానికి ఈ డిక్రీ ద్వారా సరళీకృత విధానంలో రష్యా పౌరసత్వాన్ని పోందేలా దరఖాస్తు చేసుకునే హక్కుని ఉక్రెయిన్ పౌరులకు అందిస్తోంది రష్యా. దీంతో మాస్కో నియంత్రణలో ఉన్న ప్రాంతాలలోని నివాసితులు, అధికారులు రష్యాలో భాగమవుతారు.