
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుల నియామకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులను నియమించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ముగ్గురిని నియమిస్తూ పార్టీ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచీ పీఏసీ, సీజీసీ సభ్యురాలిగా పదవులు నిర్వహించిన జక్కంపూడి విజయలక్ష్మిని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలిగా నియమించారు. కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడిగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం తంగేడు గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ దాట్ల వెంకట సూర్యనారాయణరాజును నియమితులయ్యారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గానికి విశాఖపట్నానికి చెందిన తిప్పల గురుమూర్తిరెడ్డిని నియమించారు. అలాగే కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన పార్టీ నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడిగా నియమితులయ్యారు. పార్లమెంటరీ పరిశీలకులు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు అనుసంధానంగా పని చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నీట్‌గా నిర్వహించాలి
రాజమహేంద్రవరం సిటీ: వైద్య కళాశాలల్లో ప్రవేశానికి జరిగే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. నీట్ నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో తన చాంబర్‌లో మంగళవారం ఆయన సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 8 కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ ఈ పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 2,760 మంది ఈ పరీక్ష రాయనున్నారన్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద మే 3, 4 తేదీల్లో ఇంటర్నెట్, జిరాక్స్ షాపులు మూసివేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు. ఆయా కేంద్రాలకు అన్ని బస్ స్టేషన్ల నుంచీ ఉదయం 8 నుంచి ఒంటిగంట వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జేసీ అన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, నోడల్ అధికారి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ జి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుల నియామకం

వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుల నియామకం

వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుల నియామకం