
ప్రాణహాని ఉందని సీపీకి ఫిర్యాదు
ఎడపల్లి(బోధన్): తనకు, కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన సుండు సతీష్ శనివారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. తనపై కక్ష గట్టిన సుండు యాదగిరి, అరుణ్ కుమార్, సుండు నర్సయ్యలు తనను చంపడానికి యత్నిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకువాలని, తనకు కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటి వరకు తనపై తన ఇంటిపై రెండు సార్లు దాడి చేశారని, దాడులకు సంబంధించిన వీడియోలను ఎడపల్లి పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశానన్నారు. కానీ ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీపీ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు.
షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లో రైతుబజార్ పక్కనే ఉన్న బేకరి, ఎగ్ సెంటర్ రేకుల షెడ్ దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దుకాణంలో మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా దగ్ధం అయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. రూ. 2లక్షలకు పైగా నష్టం జరిగిందని దుకాణం యజమాని ఆసిఫ్ తెలిపారు.