
అంబలి కేంద్రం, చలివేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్
కామారెడ్డి క్రైం: ఉద్యోగ జేఏసీ, టీఎన్‌జీవోఎస్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలివేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ అవసరాల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ఈకేంద్రాలను ఏర్పాటు చేసిన ఉద్యోగ జేఏసీ, టీఎన్‌జీవోఎస్ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, టీఎన్‌జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతి..
దోమకొండ: అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమాన్ని ముగించుకొని కామారెడ్డికి వెళ్తుండగా మార్గమధ్యలో షేక్ అల్మా బేగం ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. తాను, తన భర్త కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్లాస్టిక్ కవర్‌లతో కప్పిన గుడిసెలో ఉంటున్నామని వారు ఆయనకు తెలిపారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, ఎంపీపీవో ప్రవీణ్‌కుమార్, జీపీ కార్యదర్శి యాదగిరి, తదితరులున్నారు.