Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Manchu Lakshmi Instagram hacked with a hilarious message for fans1
మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాక్‌.. ఎవరూ నమ్మొద్దని ట్వీట్!

టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌ గురైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ వాటిని ఎవరూ నమ్మవద్దని అభిమానులను, సన్నిహితులను కోరింది. తనకు డబ్బులు అవసరమైతే డైరెక్ట్‌గా అడుగుతానని తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరినీ నేను డబ్బులు అడగనని ట్వీట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. కాగా.. మంచు లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బిట్‌కాయిస్‌, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన మంచు లక్ష్మీ వెంటనే ట్విటర్‌ ద్వారా అభిమానులను, సన్నిహితులను అలర్ట్‌ చేస్తూ ట్వీట్ చేసింది. చివరికీ నా మొబైల్ నంబర్ కూడా హ్యాకర్స్ గుర్తించారని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆఫ్రికా దేశం నైజీరియాకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.కాగా.. మంచు లక్ష్మీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌ ఫ్యాషన్ షో నిర్వహించింది. టీచ్ ఫర్ ఛేంజ్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్‌లో పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరైన సందడి చేశారు. ఆమె తమ్ముడు మంచు మనోజ్ సైతం ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే మంచు లక్ష్మీ చివరిసారిగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్‌ మాన్‌స్టర్‌లో కనిపించింది. ఇందులో మోహన్‌లాల్, హనీ రోజ్, జానీ ఆంటోనీ, జగపతి బాబు కూడా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీలో కనిపించనుంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, మహేశ్, వీరేన్ తంబిదొరై కూడా నటించారు. And they got to my number too! Wow! This is very scary! pic.twitter.com/3rOeiTgpwn— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025 My Instagram has been hacked. Kindly do not engage with anything that is on my stories. If I need money, I will ask you directly not on social media 😂Will tweet once I get it all back in order…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025

 degigners Abu Jani Sandeep Khosla Store Launch Nita Ambani Wore Mirror-Work Black Saree2
ఇది కదా నీతా అంబానీ ఫ్యాషన్‌ : ​ స్టైలిష్‌ లుక్‌లో మెరిసిపోతూ..!

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన​ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఖరీదైన చేనేత పట్టుచీరలు, కోట్ల విలువచేసే డైమండ్‌ ఆభరణాలు అనగానే ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ గుర్తు రాక మానరు అంటే అతిశయోక్తికాదు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్యగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా , ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానిగా, గొప్ప దాతగా ఎపుడూ ఆకర్షణీయంగా ఉంటారు. తాజాగా జియో వరల్డ్‌ ప్లాజాలో స్టైలిష్‌గా మెరిశారు.ఆరుపదుల వయసులో కూడా చాలా ఫిట్‌గా ఉంటారు. వ్యాయామం, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన స్నేహితులకు టైం కేటాయించడంలో ముందుంటారు. ఏప్రిల్ 16న నీతా అంబానీ తన ప్రాణ స్నేహితులు అబు జాని , సందీప్ ఖోస్లా స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైనారు. ఈ సందర్భంగా నీతా అంబానీ అద్దాలతో అలంకరించిన చీరలో అద్భుతంగా కనిపించి అందరి కళ్లూ తమవైపు తిప్పుకున్నారు. తెల్లని ఛాయలో మెరిసి నీతా అంబానీకి బ్లాక్‌ కలర్‌ శారీకి మిర్రర్‌-వర్క్ అలంకరణ హైలైట్‌గా నిలిచింది. దీనికి సీక్విన్డ్ గోల్డెన్ బ్లౌజ్‌ మరింత అందాన్నిచ్చింది. ఈ చీరకు తగ్గట్టు లేయర్డ్ ముత్యాల నెక్లెస్‌ మ్యాచింగ్ చెవిపోగులు , డైమండ్ బ్యాంగిల్స్‌ మరింత స్టైల్‌గా నప్పాయి. బంగారు పొట్లీ బ్యాగ్ సొగసుగా అమిరింది. మరోవైపు, డిజైనర్ ద్వయం అబు జాని , సందీప్ ఖోస్లా తెల్లటి దుస్తులు, ముత్యాల నగలతో రాయిల్‌లుక్‌తో అలరించారు. (రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్‌, ఫోటోలు వైరల్‌)అంతకుముందు పారిస్‌లో జరిగిన ఫెసిలిటేషన్ డే కోసం నీతా అంబానీ అబు జాని , సందీప్ ఖోస్లాద్వజం డిజైన్‌ చేసిన వింటేజ్ దుస్తులను ఎంచుకున్నారు. తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకల్లో ఒక్కో సందర్భానికి ఒక్కోలా ముస్తాబై తనదైన ఫ్యాషన్‌ స్టైల్‌ను చాటుకున్నారు. నీతా అంబానీ. ఎపుడూ చీరలకు ప్రాధాన్యత ఇచ్చే నీతా నూతన సంవత్సర వేడుకల కోసం, కేప్ స్టైల్ డిటైలింగ్‌తో సీక్విన్డ్ వర్క్ ఫ్లోర్‌ లెంత్‌ గౌను, గ్రే షాల్‌, డైమండ్ చెవిపోగులు , రింగ్‌, తన లుక్‌ను స్టైల్ చేసుకున్న సంగతి తెలిసిందే.చదవండి: షారూక్‌ ఖాన్‌ భార్య హోటల్‌లో ఫేక్‌ పనీర్‌ ఆరోపణల దుమారం : టీం స్పందన

Religion now plays a more important role in the economy than in politics3
పెరుగుతున్న మత సమ్మతి

దేశంలో మతతత్వం పెరిగిపోతోంది. కొన్నే ళ్లుగా ఈ ధోరణి మరీ ఎక్కువైంది. అడు గడుక్కీ గుళ్లు, మసీదులు వెలుస్తున్నాయి. నేనీ మధ్య తెలంగాణ వెళ్లాను. చిన్న పల్లె టూళ్లలో సైతం రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి. హిందువులకు దేవుళ్లు చాలామంది, కాబట్టి గుళ్ళు కూడా ఎక్కువ గానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. హిందూ సమాజం కులాలు, గోత్రాలు, జాతులు,వంశాలుగా చీలిపోయి ఉంది. గుళ్లు గోపురాలు అసంఖ్యాకంగా పుట్టుకురావడానికి ఈ భిన్నవర్గాల సమాజం ఒక ప్రధాన కారణం.జనంలో పెరుగుతున్న వ్యాపార దృష్టి ఇందుకు మరొక ముఖ్య కారణం అనిపిస్తోంది. పౌర సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు న్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏజెంట్లకు, బళ్లపై పళ్లు అమ్ముకునే వారికి, అనేకానేక చిల్లర పనులకు రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు ‘లైసెన్స్’లు ఇచ్చి డబ్బు పోగేసు కోవడం మనకు తెలుసు. గ్రామాల్లో సైతం ఈ తరహా సంస్కృతి విస్తరించింది. గ్రామ కమిటీలు అంటూ తయారయ్యాయి. ఇవీ ఇదే మాదిరిగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టాయి. ఇసుక మైనింగు, అక్రమ మద్యం అమ్మకాల వంటి కార్యకలాపాలను ఈ కమిటీలు నియంత్రిస్తున్నాయి. ఆ డబ్బును ప్రజల రోజువారీ జీవితాలను బాగు పరచేందుకు వాడతారా అంటే అదీ లేదు. బహుశా ఇక్కడికంటే పరలోకపు జీవితాలకు గిరాకీ ఎక్కువలా ఉంది. అందుకే, ఇలా ఆర్జించిన డబ్బును గుళ్లు కట్టడానికి వాడుతున్నారు.పెరుగుతున్న భక్తిమతం ఇప్పుడు రాజకీయాల్లో కంటే ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88శాతం. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ–ఆగ్రా–జైపూర్‌ ‘స్వర్ణ త్రిభుజం’ మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వర సలో నిలుస్తాయి. కారణం – మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరుపతి వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందింది. రెలిజియస్‌ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం. గడచిన నాలుగైదు ఏళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ‘ప్యూ’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్‌ యాటిట్యూడ్‌’ సర్వే తేల్చింది. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడింది. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు 2007–15 మధ్య ఏకంగా 80 శాతానికి పెరిగారు. 11 శాతం పెరుగుదల! ఎన్‌ఎస్‌ఎస్‌ఓ (నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీస్‌) నివేదిక ప్రకారం, మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు (ఇందులో శ్లేష లేదు). ఇది ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. సంతోషమే! మరి మత భావన పెరుగుతూ పోవడం వల్ల తలెత్తే ఇతర పరిణామాల మాటేమిటి? సమాజంలో మూఢనమ్మకాలు, అంధభక్తి, మతపిచ్చి పెచ్చరిల్లుతాయి. ఒక ఆధునిక సమాజంగా ఇండియా ఆవిర్భవించకుండా ఇవి అడ్డుపడే ప్రమాదం ఉంది. లాభదాయక వ్యాపారంగుళ్లు లేదా మసీదులు నిర్మించడం లాభదాయక వ్యాపారం.అందుకే, ప్రార్థనా మందిరాల పేరిట నీతి లేని మనుషులు బహిరంగ ప్రదేశాలను కబ్జా చేయడం రివాజుగా మారుతోంది. ఒకసారి దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే, ఇక వాటిని ఎవరూ తొలగించలేరు. నగరాల్లో ట్రాఫిక్‌ చిక్కులకు ఈ నిర్మాణాలే చాలావరకు కారణాలు.సంత్‌ కబీర్‌ దాసు ఎంతో సరళంగా చెప్పిన కవితను ఈ సంద ర్భంగా నేను ప్రస్తావిస్తాను: ‘రాతిని పూజించడం వల్ల దేవుడు లభిస్తే, నేను పర్వతాన్ని పూజిస్తాను. కానీ ఈ చక్కీ (తిరగలి రాయి)మంచిది, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని పోషిస్తుంది’. చేదు నిజం ఏమిటంటే, రాతి విగ్రహం తిరగలి రాయి కంటే మంచి ప్రతిఫలం ఇస్తోంది. మతభావన, మతపిచ్చి వ్యాపారంగా మారబట్టే, ప్రభు త్వాలు సైతం ‘రెలిజియస్‌ టూరిజం’కు పెద్దపీట వేస్తున్నాయి.వాస్తవానికి, ‘మీ విగ్రహం కంటే మా విగ్రహం మంచిది’ అనే రీతిలో ఒక కనిపించని పోటీకి దారి తీస్తోంది. తిరుమల ఆలయం ఇండియాలోనే అతి పెద్ద ‘మనీ స్పిన్నర్‌’. ఈ వైష్ణవ ఆలయాన్ని ఏటా 4 కోట్ల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టను పెద్ద మత పర్యాటక కేంద్రంగా ప్రమోట్‌ చేస్తోంది. సీపీఎం కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ దేవాలయ బోర్డులు విగ్రహాల ‘మహిమల’ గురించి ప్రచారం చేస్తున్నాయి. దేవుడు మానవుడి ఊహాకల్పన అంటూ మనల్ని హేతుబద్ధంగా ఆలోచింప జేయాల్సిన సిద్ధాంతం ఆ ప్రభుత్వానిది. కానీ మాస్కో రెడ్‌ స్క్వేర్‌ , చైనా తియనాన్మెన్‌లలో మమ్మీలుగా మారిన శవాల నుంచి స్ఫూర్తి పొందే సిద్ధాంతం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?బహిరంగ సమర్థనా?మన తొలి ప్రధాన మంత్రి, నవ భారత వ్యవస్థాపక పితా మహుడు జవహర్‌లాల్‌ నెహ్రూ దేశం శాస్త్రీయ దృక్పథంతోముందుకు సాగాలని తలచారు. ఇప్పుడేం జరుగుతోంది? పిడివాదం, అంధవిశ్వాసం మనల్ని నడిపిస్తున్నాయి. మతం, మూఢభక్తి దేశానికి ప్రమాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సమాజంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నెహ్రూ ఎప్పుడూ ప్రార్థనా స్థలాలు సందర్శించలేదు. విశ్వాసి అయినప్పటికీ ఇందిరా గాంధీ సైతం ఆలయాలకు దూరంగానే ఉండే వారు. అయితే ఆమె మనవడు రాహుల్‌ గాంధీ బొట్టు పెట్టుకుని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. జంధ్యం కూడా ధరిస్తానని ప్రకటించారు. తాను శివభక్తుడిననీ చెప్పుకొంటారు. అమిత్‌ షా కూడా అదే చేస్తారు. ఇద్దరికీ కావల్సింది ఓట్లు! రేపిస్టుగా రుజువైన రామ్‌ రహీం సింగ్‌ను నరేంద్ర మోదీ ప్రశంసించడం అతడి నుంచి రాజకీయ మద్దతు ఆశించే కదా? రాజ్యాంగ పరిరక్షకులు, ప్రముఖ వ్యక్తులు ఆర్భాటంగా మత స్థలాలు సందర్శించడం పెరిగింది. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల ఆల యంలో ప్రార్థనలు చేయడం మనకు తెలుసు. అంతకు ముందు ఏడాది మోదీ కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ పుణ్య క్షేత్రాలు దర్శించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్‌ తిరుమల ఆలయంలో బాహాటంగా పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాథాలయంలో ఆయన అవమానం పాలైనట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని కేదార్‌నాథ్‌ లేదా అయోధ్య సందర్శించినా, మరొకరు అజ్మీర్‌ షరీఫ్‌ వెళ్లినా అది వాటిని ఆమోదించడమే అవుతుంది. అలా వెళ్లడం... షారుఖ్‌ ఖాన్‌ కోక్‌ బ్రాండ్‌కు ప్రచారం చేయడం కంటే భిన్నమైనమీ కాదు.- వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత- mohanguru@gmail.com

NTR To Enter Dragon Shoot With A Massive Action Sequence4
హాలీవుడ్‌ రేంజ్‌లో ఫైట్‌

యాక్షన్‌తో ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) షూటింగ్‌ను ఆరంభించనున్నారట ఎన్టీఆర్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ‘డ్రాగన్‌’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకాలపై కల్యాణ్‌ రామ్, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా సెట్స్‌లోకి ఎన్టీఆర్‌ రానుండటం ఇదే తొలిసారి. కాగా ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఎన్టీఆర్‌ పాత్ర చిత్రీకరణ ప్రారంభం అవుతుందని, ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌కు హాలీవుడ్‌ స్థాయి స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ వర్క్‌ చేస్తారని సమాచారం. అంతే కాదు... ఈ సినిమాలో ఎంతో కీలకమైన ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ని ముప్పై రోజులకు పైగానే తీస్తారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరి... ఈ హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ ఏ లెవల్లో ఉంటుందో తెరపై చూడాలంటే చాలా సమయం ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేస్తామని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టొవినో థామస్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్‌.

IMD announces that monsoon is going to be regular5
చల్లటి కబురు!

భానుడు ఉగ్రరూపం దాల్చే ఏప్రిల్‌ నెలలోనే ప్రాణం కుదుటపడేలా జూన్‌లో ఆగమించే నైరుతి రుతుపవనాల తీరుతెన్నులు చెప్పడం మన వాతావరణ సంస్థలకు అలవాటు. ఈసారి భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించినదాన్నిబట్టి సాధారణ వర్షపాతంకన్నా అధికంగానే వానలు పడొచ్చు. అంతేకాదు... వర్షాభావానికి దారితీసి కరువు కాటకాలకు కారణమయ్యే ఎల్‌ నినో బెడద కూడా ఉండకపోవచ్చని కూడా ఆ విభాగం తెలియజేసింది. అయితే వాతావరణ స్థితి గతులను అంచనా వేసే మరో సంస్థ స్కైమెట్‌ మాత్రం ‘సాధారణ’ స్థాయిలోనే రుతుపవనాలుంటాయని చెబుతోంది. ఈ నెల మొదట్లోనే ఇందుకు సంబంధించిన లెక్కలు ప్రకటించి, సాధారణంకన్నా అధికంగా వర్షాలు పడే అవకాశం 30 శాతం మాత్రమే ఉన్నదని తెలిపింది. నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్‌ 1న ప్రవేశించి చకచకా విస్తరించుకుంటూపోయి సెప్టెంబర్‌ మధ్య కల్లా నిష్క్రమిస్తాయి. దేశ జనాభాలో 42.3 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం పూర్తిగా రుతుపవనాలపై ఆధారపడి వుంటుంది. అది సక్రమంగా వచ్చి వెళ్తే దేశం కళకళలాడుతుంది.మందగమనంతో అడుగులేస్తే, అంతంతమాత్రంగా ముగిసిపోతే అనేక సమస్యలకు దారితీస్తుంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం వాటా 18.2 శాతం. అయితే ‘వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరికీ తెలియద’న్న నానుడి మరిచిపోకూడదు. వర్షపాతం బాగుంటుందన్నా, అది అధికంగా ఉండొచ్చని చెప్పినా దేశవ్యాప్తంగా అన్నిచోట్లా అదే మాదిరిగా ఉంటుందని ఆశించలేం. స్థానిక కాలమాన పరిస్థితులనుబట్టి కొన్నిచోట్ల అధిక వర్షపాతం, మరికొన్నిచోట్ల అవసరమైన దానికన్నా తక్కువగావుండొచ్చు. బ్రిటిష్‌ వ్యంగ్య రచయిత జెరోమ్‌ కె. జెరోమ్‌ ఒక సందర్భంలో చెప్పినట్టు వాతావరణం అనేది ప్రభుత్వం వంటిది. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది!ఎక్కడో భూమధ్య రేఖకు ఆనుకునివున్న పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడివున్న వర్తమాన వాతావరణ పరిస్థితులు మన రుతుపవనాలను నిర్దేశిస్తాయి. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితలంపై, ముఖ్యంగా దక్షిణమెరికా తీర ప్రాంతంవైపు ఉష్ణోగ్రతలు అధికంగావుంటే గాలిలో తేమ శాతం పెరిగి ఎల్‌ నినో ఏర్పడి రుతుపవనాలు బలహీనపడతాయి. వర్షాలు లేక కరువుకాటకాలు విజృంభిస్తాయి. ఆ ఉష్ణోగ్రతలు తక్కువుంటే లానినా ఏర్పడి కుంభవృష్టికి దారితీసి వరదల బెడదవుంటుంది. ప్రస్తు తానికి అక్కడ తటస్థ పరిస్థితులున్నాయంటున్నారు.ఒక్కోసారి మన హిందూ మహాసముద్రంపై ఆవరించివుండే మేఘాల స్థితిగతులు, ఆ వాతావరణంలోవుండే గాలి తుంపరలు, మనకుండే అటవీ సాంద్రత వంటివి ఎల్‌ నినోను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంవల్లనే పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌ నినో ఏర్పడినా ఒక్కోసారి మన రుతుపవనాలు సజావుగా వచ్చివెళ్తాయి. అందుకే ఎల్‌ నినో గురించి పట్టించుకోవటం, రుతుపవనాలను ముందుగా అంచనా వేయటం అశాస్త్రీయం అంటారు కొందరు శాస్త్రవేత్తలు. ఎల్‌ నినోను నియంత్రించే ఇతరేతర పరిస్థితులు అనేకం ఉన్నప్పుడు దాని ఆధారంగా వర్షాల గురించి అంచనా వేయటం వృధా ప్రయాస అని వారి భావన. వర్షరుతువులో ఏటా వర్షపాత సగటు(ఎల్‌పీఏ) ఎంతవుంటున్నదో లెక్కేయటం ఐఎండీ పని. ఆ సగటు దీర్ఘకాలంలో ఎంతవుందో గణించి, దానికన్నా ఎంత ఎక్కువగా లేదా ఎంత తక్కువగా వర్షాలు పడే అవకాశం వుందో తెలియజేస్తారు. ఎల్‌పీఏను 87 సెంటీమీటర్ల వర్షపాతంగా గణించి, ఈసారి వర్షాలు దీన్నిమించి 105 శాతంవరకూ ఉండొచ్చని అంచనా కట్టారు. నిరుడు మొదట్లో 106 శాతం అధిక వర్షపాతం అంచనా వేయగా, అది 108 శాతం వరకూ పోయింది. ఎల్‌పీఏ 96 శాతంకన్నా తక్కువుంటే సాధారణంకన్నా తక్కువ వర్షపాతంగా లెక్కేస్తారు. 96–104 మధ్యవుంటే సాధా రణ వర్షపాతంగా, 104–110 శాతం మధ్యవుంటే అధిక వర్షపాతంగా పరిగణిస్తారు. ఐఎండీ 105 శాతంవరకూ ఉండొచ్చని అంచనా వేయగా, స్కైమెట్‌ మాత్రం 103 శాతానికి పరిమితమైంది. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతంవరకూ వర్షాధారమే. కనుక వర్షాలు సమృద్ధిగా పడితేనే మన సాగురంగం బాగుంటుంది. అందరికీ పనులు దొరికి సుఖసంతోషాలతో వుంటారు. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వర్షపాతం అంచనాలు సక్రమంగావుంటే ఎక్కడ ఎలాంటిపంటలు వేసుకోవచ్చునో, వేటికి అననుకూలతలు ఏర్పడవచ్చునో తెలుస్తుంది. రైతులు నష్టపో కూడదంటే ఇలాంటి అంచనాలు ఎంతో అవసరం. కానీ నిర్దుష్టంగా అంచనాలు చెప్పటం అన్ని వేళలా సాధ్యపడకపోవచ్చు. గతంతో పోలిస్తే వాతావరణ విభాగం అంచనాలు మెరుగ్గా ఉంటు న్నాయి. ఆ రంగంలో పెరిగిన సాంకేతికతలే అందుకు కారణం.వర్షాలు సాధారణంకన్నా ఎక్కువుంటాయని వేసిన అంచనాలు చూసి మురిసిపోలేం. ఎందుకంటే కురిసిన వర్షాన్నంతటినీ ఒడిసిపట్టి తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చుకునే మౌలిక సదుపాయాలు మనదగ్గరుండాలి. తొలకరినాటికల్లా సాగుపనుల కోసం రైతులకు డబ్బు అందు బాటులో వుండాలి. సకాలంలో నాట్లు పడకపోతే పైరు ఎదుగుదల బాగుండదు. భిన్న దశల్లో ఎరువులూ, పురుగుమందులూ దొరకాలి. అన్నిటికన్నా ముందు విత్తనాల లభ్యత సక్రమంగావుండాలి. కల్తీ విత్తనాల బెడద నిరోధించాలి. వీటికోసం ఎలాంటి ముందస్తు చర్యలు అమలు కావాలో, రైతులకు బ్యాంకుల నుంచి రుణసదుపాయాలెలా కల్పించాలో ప్రభుత్వాలు ఆలోచించాలి. రుతుపవనాలు సక్రమంగా ఉండబోతున్నాయని ఐఎండీ ప్రకటించింది కనుక ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికలు రూపుదిద్దుకోవాలి.

Scientists find promising hints of life on distant planet K2-18b6
సౌర వ్యవస్థకు ఆవల జీవం!

అనంతమైన విశ్వంలో మన భూగోళంపైనే కాకుండా ఇంకెక్కడైనా జీవజాలం ఉందా? జీవులు మనుగడ సాగించే వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టడానికి శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ అందుకు కచ్చితమైన ఆధారాలైతే లభించలేదు. గ్రహాంతర జీవులు కాల్పనిక సాహిత్యానికే పరిమితమయ్యాయి. కానీ, మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ‘కే2–18బీ’ అనే గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే 8.5 రెట్లు పెద్దది. కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ‘నాసా’కు చెందిన జేమ్స్‌వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ద్వారా ఈ గ్రహంపై డైమిౖథెల్‌ సల్ఫైడ్‌(డీఎంఎస్‌), డైమిౖథెల్‌ డైసల్ఫైడ్‌(డీఎండీఎస్‌) అనే రకాల వాయువుల కెమిల్‌ ఫింగర్‌ఫ్రింట్స్‌ను గుర్తించారు. ఈ రెండు రకాల వాయువులు భూమిపైనా ఉన్నాయి. ఇవి కేవలం జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. సముద్రంలోని ఆల్గే(మెరైన్‌ ఫైటోప్లాంక్టన్‌)తోపాటు ఇతర జీవుల నుంచి ఈ వాయువుల ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. దీన్నిబట్టి కే2–18బీ గ్రహంపై జీవం ఉందని తేల్చారు. అచ్చంగా భూమిపై ఉన్నట్లుగా అక్కడ జీవించి ఉన్న ప్రాణులు లేనప్పటికీ జీవసంబంధిత ప్రక్రియలు జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే, దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని పేర్కొంటున్నారు. మనం ఒంటరివాళ్లం కాదు: మధుసూదన్‌ జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పడానికి ఇది తొలి సంకేతమని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌లో అస్ట్రోఫిజిక్స్, ఎక్సోప్లానెటరీ సైన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నిక్కు మధుసూదన్‌ వెల్లడించారు. సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికిని పరిశోధించే విషయంలో ఇదొక కీలకమైన మలుపు అని తెలిపారు. ఇతర గ్రహాలపై మన సహచర జీవులు ఉన్నాయని కచ్చితంగా చెప్పే రోజు మరికొన్ని సంవత్సరాల్లో వస్తుందని మధుసూదన్‌ స్పష్టంచేశారు. మనం ఒంటరివాళ్లం కాదన్నారు. హైసియన్‌ ప్రపంచాలు కే2–18బీ గ్రహం సబ్‌–నెప్ట్యూన్‌ తరగతికి చెందినది. అంటే ఇలాంటి గ్రహాల వ్యాసం భూమి వ్యాసం కంటే ఎక్కువ, నెప్ట్యూన్‌ వ్యాసం కంటే తక్కువ. కే2–18బీ గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. దీనిపై మిథేన్, కార్బన్‌డయాక్సైడ్, డైమిౖథెల్‌ సల్ఫైడ్, డైమిౖథెల్‌ డైసల్ఫైడ్‌ వాయువులు సమృద్ధిగా ఉన్నట్లు 2023లో కనిపెట్టారు. 1990 నుంచి ఇప్పటివరకు సౌర వ్యవస్థ బయట 5,800 గ్రహాలను గుర్తించారు. వీటిని ఎక్సోప్లానెట్స్‌ అని పిలుస్తున్నారు. హైసియన్‌ ప్రపంచాలు అని కూడా అంటున్నారు. వీటిలో చాలావరకు ద్రవరూపంలోని నీటి సముద్రాలతో కప్పి ఉన్నాయని, ఎక్సోప్లానెట్స్‌పై హైడ్రోజన్‌తో కూడిన వాతావరణం ఉందని చెబుతున్నారు. ఆయా గ్రహాలపై జీవులు ఉండేందుకు వంద శాతం ఆస్కారం ఉందని, వాటిని గుర్తించడమే మిగిలి ఉందని పేర్కొంటున్నారు. పరిశోధనల దిగ్గజం నిక్కు మధుసూదన్‌ ఇండియన్‌–బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ నిక్కు మధుసూదన్‌ ఎక్సోప్లానెట్స్‌ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సమర్పించిన ఎన్నో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు అధ్యయనాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. మధుసూదన్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ–వారణాసిలో బీటెక్‌ పూర్తిచేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఎంఎస్, పీహెచ్‌డీ అభ్యసించారు. 2020లో వాస్ప్–19బీ అనే గ్రహంపై టైటానియం ఆౖక్సైడ్‌ను గుర్తించిన బృందంలో ఆయన కూడా ఉన్నారు. కే2–18బీ గ్రహంపై పరిశోధనలు సాగిస్తున్నారు.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Mumbai beat Sunrisers Hyderabad by 4 wickets7
రైజర్స్‌ ఓటమి బాట

ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్‌లో మెరుపులు కనిపించక టీమ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్‌ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. ముంబై: ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్‌ రికెల్టన్‌ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. కనిపించని దూకుడు... ఇన్నింగ్స్‌ తొలి బంతికే అభిషేక్‌కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్‌ చహర్‌ వేసిన బంతి అభిక్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తీసుకొని స్లిప్‌ వైపు దూసుకెళ్లగా విల్‌ జాక్స్‌ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్‌ హెడ్‌ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్‌ ఓవర్లో అభిషేక్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్‌ను నిలువరించారు. తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్‌ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్‌ ఇచ్చినా... నోబాల్‌తో బతికిపోయిన హెడ్‌ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్‌ కిషన్‌ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్‌) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. పవర్‌ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్‌ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌ వరకు ఒక్క సిక్స్‌ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్‌ స్కోరు 160 దాటింది. చహర్‌ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్‌ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్‌ 2 సిక్స్‌లు, కమిన్స్‌ ఒక సిక్స్‌ కొట్టారు. కీలక భాగస్వామ్యం.. ఎప్పటిలాగే ఫటాఫట్‌ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్‌ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను హెడ్‌ వదిలేశాడు. రికెల్టెన్‌ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్‌ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) (సబ్‌) బావా (బి) పాండ్యా 40; హెడ్‌ (సి) సాంట్నర్‌ (బి) జాక్స్‌ 28; ఇషాన్‌ కిషన్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) జాక్స్‌ 2; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) తిలక్‌ వర్మ (బి) బౌల్ట్‌ 19; క్లాసెన్‌ (బి) బుమ్రా 37; అనికేత్‌ వర్మ (నాటౌట్‌) 18; కమిన్స్‌ (నాటౌట్‌) 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–47–0, బౌల్ట్‌ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్‌ జాక్స్‌ 3–0–14–2, హార్దిక్‌ పాండ్యా 4–0–42–1, సాంట్నర్‌ 1–0–8–0. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) హెడ్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 31; రోహిత్‌ (సి) హెడ్‌ (బి) కమిన్స్‌ 26; విల్‌ జాక్స్‌ (సి) అన్సారీ (బి) కమిన్స్‌ 36; సూర్యకుమార్‌ (సి) అన్సారీ (బి) కమిన్స్‌ 26; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 21; పాండ్యా (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) మలింగ 21; నమన్‌ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్‌: షమీ 3–0–28–0, కమిన్స్‌ 4–0–26–3, ఇషాన్‌ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్‌ 3–0–31–1, రాహుల్‌ చహర్‌ 1–0–9–0. అనూహ్య ‘నోబాల్‌’ క్యాచ్‌ను అందుకునే లేదా స్టంపింగ్‌ ప్రయత్నంలో వికెట్‌ కీపర్‌ గ్లవ్స్‌ స్టంప్స్‌ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్‌ ఆడి కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే దీనిని ‘నోబాల్‌’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. జరిగిందేమిటంటే రికెల్టన్‌ షాట్‌ ఆడక ముందే క్లాసెన్‌ గ్లవ్స్‌ ముందుకు వచ్చాయి. ఇది ఐసీసీ రూల్స్‌ 27.3.1కు విరుద్ధం. అందుకే నోబాల్‌ ఇచ్చారు. క్లాసెన్‌ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. ఐపీఎల్‌లో నేడుబెంగళూరు X పంజాబ్‌ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

SIT is creating anarchy in the name of investigating an illegal case8
కిడ్నాప్‌లు.. బెదిరింపులు

సాక్షి, అమరావతి: కిడ్నాపర్ల నుంచి రక్షించాల్సిన పోలీసులే కిడ్నాపులకు పాల్పడితే.. వేధించేందుకు సాక్షి తండ్రిని అపహరిస్తే.. కుమారుడిని బెదిరించేందుకు తండ్రికి నోటీసులు ఇస్తే.. అది కచ్చితంగా చంద్రబాబు మార్కు పోలీసు జులుం అని చెప్పొచ్చు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌ బాబు నేతృత్వంలోని సిట్‌ బృందం ఇంతగా బరితెగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేతిలో కిరాయి మూకగా మారి.. చట్ట నిబంధనలతో పని లేదని, రెడ్‌బుక్కే తమ రాజ్యాంగమని తేల్చి చెబుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ అరాచకం సృష్టిస్తోంది. లేని అక్రమాలను నిరూపించేందుకు అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడమే ఏకైక మార్గమని భావిస్తోంది. అందుకోసం కొందర్ని సాక్షులుగా పేర్కొంటూ అబద్ధపు సాక్ష్యాలు చెప్పాలని వేధిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన కిరణ్‌ రెడ్డి అనే యువకుడిని సిట్‌ బృందం కొన్ని రోజులుగా బెంబేలెత్తిస్తోంది. తాను అబద్ధపు సాక్ష్యం చెప్పనని ఆ యువకుడు స్పష్టం చేయడంతో సిట్‌ పోలీసులు సందిగ్దంలో పడ్డారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు. సివిల్‌ దుస్తుల్లో వెళ్లి కిరణ్‌ నివాసంపై అర్ధరాత్రి దండెత్తారు. ఆయన ఇంట్లో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో కిరణ్‌ ఇంట్లో లేడు. దాంతో ఆయన తండ్రి, రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ సుబ్రమణ్యం రెడ్డిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. తాను పోలీసు కానిస్టేబుల్‌గా పని చేశానని, నిబంధనలకు విరుద్ధంగా తనను ఎలా తీసుకువెళ్తారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినా సిట్‌ అధికారులు ఏమాత్రం పట్టించుకో లేదు. ఈ కేసులో తన కుమారుడిని సాక్షిగా పేర్కొంటూ.. తనను బలవంతంగా తీసుకెళ్లడం ఏమిటని ఆయన ఎంతగా వాదించినా ఫలితం లేకపోయింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాథేయపడినా వినిపించుకో లేదు. అర్ధరాత్రి వేళ ఆయన్ని సిట్‌ బృందం కిడ్నాప్‌ చేసింది. ఈ వ్యవహారంపై సుబ్రమణ్యంరెడ్డి బంధువు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో గురువారం పిటిషన్‌ వేశారు. తన మామను పోలీసులు కిడ్నాప్‌ చేశారని, ఆయన్ను వెంటనే ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుబ్రమణ్యం రెడ్డి ఎక్కడ ఉన్నా న్యాయస్థానంలో హాజరయ్యేందుకు అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. మరోవైపు కిరణ్‌ కూడా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను కూడా పోలీసులే అపహరించుకుపోయి ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కొడుకు మీద కేసు.. తండ్రికి నోటీసులా? అక్రమ కేసు అయినా సరే.. ఎవరి మీద కేసు పెడితే వారిని విచారణకు పిలవడం అన్నది దర్యాప్తు ప్రాథమిక సూత్రం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అరాచకానికి తెగబడుతోంది. వైఎస్సార్‌సీసీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో అప్పటి ప్రభుత్వ సలహాదారు రాజ్‌ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన్ని నిందితుడిగా చేర్చారో.. సాక్షిగా చేర్చారో అన్నది స్పష్టత ఇవ్వకుండా వేధింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్‌ కసిరెడ్డిని విచారించాలని సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం విచారణకు రాలేనని, సమయం కావాలని కోరారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆయనతో సిట్‌ అధికారులు సంప్రదించాలి. తగిన రీతిలో చట్టబద్ధంగా విచారించాలి. కానీ చంద్రబాబు జమానాలో పోలీసులు తమకు రెడ్‌బుక్కే రూల్‌ బుక్‌ అని పేట్రేగిపోతూ రాజ్‌ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో విచారణకు రావాలని ఆయనకు సైతం నోటీసులు ఇచ్చారు. ఏ ప్రాతిపదికన ఆయనకు నోటీసులు ఇస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిందితులో, సాక్షులో అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేస్తాం.. విచారణకు పిలుస్తాం.. అని ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసుతో సంబంధం లేని వారిని వేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్రరెడ్డి తన న్యాయవాదితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వచ్చారు. కానీ కార్యాలయం ప్రధాన గేటు వద్దే ఆ న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. ఉపేంద్ర రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించారు. పలు దఫాలుగా రాత్రి 7.30 గంటల వరకు విచారించారు. ఉద్దేశ పూర్వకంగా ఏకంగా 8 గంటలపాటు సిట్‌ అధికారులు ఆయన్ను ఒత్తిడికి గురిచేశారు. ఈ కేసుతోగానీ, అందుకు సంబంధించిన కంపెనీలతోగానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా అంత సుదీర్ఘ సమయం కార్యాలయంలోనే ఉంచడం సిట్‌ అధికారుల వేధింపులకు తార్కాణం. మేం చెప్పినట్లు వినాల్సిందే విచారణలో ఉపేంద్ర రెడ్డిని విజయవాడ సీపీ, సిట్‌ చీఫ్‌ రాజశేఖర్‌బాబు తీవ్ర స్థాయిలో బెదిరించారు. తాము చెప్పినట్లు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే కుమారుడు రాజ్‌ కసిరెడ్డినే కాకుండా యావత్‌ కుటుంబ సభ్యులందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు. తమ మాట వినకపోతే మును ముందు మరింతగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని చెప్పారు.21న హాజరుకండి తీవ్రంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనంఏం నేరం చేశారో చెప్పకుండా.. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో తెలియచేయకుండా 60 ఏళ్ల వృద్ధుడిని తిరుపతి నుంచి విజయవాడకు తీసుకొచ్చి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు నిర్బంధించిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21న స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆ వృద్ధుడిని ఆదేశించింది. కోర్టు ముందు హాజరయ్యేందుకు వీలుగా ఈ నెల 20, 21వ తేదీల్లో ఏ అధికారి ముందు గానీ, దర్యాప్తు అధికారి ముందు గానీ హాజరు కానవసరం లేదని స్పష్టం చేసింది. వృద్ధుడిని ఇంటి నుంచి తీసుకెళ్తుండటానికి సంబంధించి పిటిషనర్‌ సమర్పించిన ఫొటోల్లోని పోలీసులు ఎవరో గుర్తించి, ఆ వివరాలను తమ ముందుంచాలని సిట్‌ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడు, మాజీ పోలీసు అయిన టి.బాల సుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారని, ఆయన ఆచూకీ తెలియడం లేదని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలని బంధువు మేకా వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం లంచ్‌మోషన్‌ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణు తేజ వాదనలు వినిపించారు.

Chandrababu Naidu has committed massive irregularities in the liquor policy9
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే

సాక్షి, అమరావతి: మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి, సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడికీ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఈ 40 ఇయర్స్‌ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. రెడ్‌బుక్‌ కుట్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్య విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. ఐదేళ్ల పాటు పాదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా.. అసలు మద్యం దందా ఘనాపాఠి చంద్రబాబే అన్నది మరుగునపరచాలన్నది పన్నాగం. కానీ, టీడీపీ మద్యం సిండికేట్‌ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులు ఇచ్చి.. టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్‌ ఏర్పాటు చేసి.. ఊరూరా బెల్ట్‌ దుకాణాలు తెరిచి.. ఊరూపేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి.. మూడు బార్లు ఆరు దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు.. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్ల పన్ను రాబడికి గండికొట్టారు. సిండికేట్‌ ద్వారా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధా­నంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్‌ను రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతినివ్వ లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయి. కానీ, తగ్గితే కమీషన్లు ఇవ్వవన్నది ఎవరైనా ఠక్కున చెప్పే వాస్తవం. కానీ, కుట్రపూరితంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాతిపెట్టిన ప్రైవేట్‌ మద్యం సిండికేట్‌ భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం తవ్వి తీసి ప్రజలపైకి వదిలింది. యథేచ్ఛగా దోపిడీకి బరితెగిస్తోంది. అందుకే.. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు.. చంద్రబాబు మద్యం దోపిడీ సమగ్ర కుట్రను చాటేందుకు.. మద్యం మాఫియాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసిన విధానాన్ని చెప్పేందుకు.. ప్రస్తుతం మళ్లీ పేట్రేగుతున్న మద్యం దందాను తెలియజేస్తోంది ‘సాక్షి’. » 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా.. వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఈ విషయమై.. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. » చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, ఎక్సైజ్‌ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్‌ నరేష్, అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 5 డిస్టిలరీల నుంచే.. ముసుగులో చంద్రబాబు దందా డిస్టిలరీలతో కుమ్మక్కయి కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015–19 మధ్య ఇలా కేవలం ఐదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... » 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో రూ.4,122.28 కోట్లు ఐదు డిస్టిలరీలలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్‌ డిస్టిలరీకే రూ.1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. పెర్నోడో రిచర్డ్‌ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్‌ డిస్టిలరీస్‌కు రూ.395.1 కోట్లు, అలైడ్‌ బ్లెండర్స్‌–డిస్టిలరీస్‌కు రూ.457.86కోట్లు, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రూ.319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. » 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. » పెర్ల్‌ డిస్టిలరీస్‌కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. సెంటిని బయో ప్రొడక్ట్స్‌కు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్‌ రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం ఈ మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09 శాతం మద్యం కొనుగోలు చేశారు. బార్లలోనూ అదే బరితెగింపు.. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్‌ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్‌ కమిషనర్‌ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్‌ ఇచ్చారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దుపై 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపారు. సెపె్టంబరు 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజులు ముందుగానే సెపె్టంబరు 1నే ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్క్యులర్‌ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్‌ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబరు 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్‌ ఫైళ్లపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబరు 3న సంతకం చేయగా సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబరు 4న డిజిటల్‌ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. డిస్టిలరీలన్నిటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబరులో జీవో నంబర్‌ 993 ప్రకారం రెవెన్యూ (ఎౖక్సైజ్‌2) డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేబినెట్‌కు చెప్పకుండానే.. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చింది. నాడు కేబినెట్‌ సమావేశానికి ముందు ఎక్సైజ్‌ కమిషనర్‌ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్‌ ఫైల్‌ను పంపారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్‌ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి 2015 జూన్‌ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్‌ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ, అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రివిలేజ్‌ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ, ఎక్సైజ్‌ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్‌ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు ‘కాపీ టు పీఎస్‌ టు సీఎం’ అని నోట్‌ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్‌ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే.. 2015 జూన్‌ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్‌లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్‌ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. ‘పవర్‌ స్టార్‌’, ‘లెజెండ్‌’లను తెచ్చింది ఎవరు?పవర్‌ స్టార్, లెజెండ్‌.. ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు.. ఊరూ పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని .. ప్రెసిడెంట్‌ మెడల్‌: ఈ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ అంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా బ్రాండ్‌ బీర్‌ ఉత్పత్తులకు 2017 జూన్‌ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. గవర్నర్‌ రిజర్వ్, లెఫైర్‌ నెపోలిన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబరు 26న అంగీకారం తెలిపారు. రాయల్‌ ప్యాలస్, న్యూ కింగ్, సైన్‌ అవుట్‌ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్‌ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చింది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్‌ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే.. » మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? » మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? » విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? » మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? »దుకాణాలకు తోడు పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్‌ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? » 2014 - 19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్‌ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? » మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? » ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? » ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్‌సీపీ హయాంలో.. » 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్‌ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. » లిక్కర్‌ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. » 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. » మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. » మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. » మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరు టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం. 2014లో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌ అప్పటి టీడీపీ సీనియర్‌ నేత, ప్రస్తుత స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది.

Effective functioning of the police system in Andhra Pradesh during the YSRCP government10
జగన్‌ పాలనలోనే అత్యుత్తమ పోలీసింగ్‌!

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయా­ంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ సమర్థ పనితీరుకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. మూడు ప్రధాన విభాగాలు– పోలీసుల పనితీరు, న్యాయ సహాయం, జైళ్ల పరిస్థితికి సంబంధించి మొత్తం 102 అంశాల ప్రాతిపదికన విడుదలైన ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌– 2025’­నివేదిక రాష్ట్ర పోలీసింగ్‌ వ్యవస్థను రెండవ స్థానంలో (10 పాయింట్లకు 6.32 స్కోర్‌) నిలిపింది. 2024 క్యాలñ­æండర్‌ ఇయర్‌ ప్రాతిపదికన ఈ నివేదిక విడుదలైంది. 2024 సంవత్సరం జూన్‌లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటికీ, అప్పటికి గడచిన ఐదేళ్లలో పోలీసింగ్‌ వ్యవస్థలో జగన్‌ ప్రభుత్వం అత్యుత్తమ సంస్కరణలను తెచ్చింది.ఈ సంస్కరణల ప్రభావం తాజా ర్యాంకింగ్‌లో ప్రతిబింబించింది. అలాగే 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దిగజారిన పోలీసు వ్యవస్థలో అన్ని విభాగాలూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా మెరుగుపడుతూ వచ్చినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కామన్‌కాజ్‌ సంస్థతో కలిసి లోక్‌నీతి ‘సెంటర్‌ ఫర్‌ ద స్డడీ డెవలపింగ్‌ సొసైటీ’(సీఎస్‌డీఎస్‌) గతంలో ‘ద స్టేటస్‌ ఆఫ్‌ పోలీసింగ్‌ ఇన్‌ ఇండియా రిపోర్ట్‌–2025’పేరుతో నిర్వహించిన మరో సర్వేలో కూడా జగన్‌ పాలనా కాలం 2023–24లో శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కారంలో ఆంధ్ర ప్రదేశ్‌ పోలీసు శాఖ దేశంలోనే రెండోస్థానంలో నిలవడం గమనార్హం. చంద్రబాబు హయాంలో దేశంలో 13వ స్థానంలో..దేశంలో పోలీసు, న్యాయ సహాయం, జైళ్ల స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశంతో 2018 నుంచి ‘ఇండియా జస్టిస్‌ రిపోర్టు’ ఇస్తున్నారు. కేంద్ర నేర గణాంక విభాగం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు శాఖల గణాంకాలు న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందుతోంది. 18 పెద్ద రాష్ట్రాలు, 11 చిన్న రాష్ట్రాలను వేర్వేరు విభాగాలుగా అధ్యయనం చేస్తూ ఈ నివేదిక విడుదలవుతోంది.2018లో దేశంలోని పోలీసింగ్‌ వ్యవస్థను (మూడు విభాగాలూ కలిసి) విశ్లేషిoచి 2019లో విడుదలైన నివేదిక ప్రకారం 18 పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో నిలిచింది. అంటే కింద నుంచి ఆరో స్థానంలో నిలవడం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసు శాఖ అధ్వాన్న పనితీరుకు దర్పణం పడుతోంది. సంస్కరణల బాటన నడిపిన జగన్‌ ప్రభుత్వం 2019లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచి్చన తరువాత రాష్ట్ర పోలీసు వ్యవస్థను అత్యుత్తమ సంస్కరణల బాటలో నడిపింది. దీనితో 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వాన్న స్థితిలో ఉన్న పోలీసు శాఖ వైఎస్‌ జగన్‌ పాలనా కాలంలో క్రమంగా మెరుగుపడుతూ వచి్చంది. ఈ ఫలితాలు తాజా ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌లో ప్రతిబింబిస్తున్నాయి. 2022 నివేదిక ప్రకారం (2021లో పనితీరు ఆధారంగా) ఆంధ్ర ప్రదేశ్‌ పోలీసింగ్‌ వ్యవస్థ (మూడు విభాగాలూ కలిసి) దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 5వ స్థానానికి ఎగబాకింది. 2025 నివేదిక ప్రకారం (2024లో పనితీరు ఆధారంగా) దేశంలో రెండోస్థానం సాధించింది. 2020, 2021, 2023, 2024లో నివేదికలు విడుదల కాలేదు.బాబు ఘనతగా నమ్మించేందుకు కుయుక్తి తనది కాని ఘనతను తనదిగా చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. తమ సోషల్‌ మీడియా విభాగం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. వైఎ­స్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ పోలీ­­సులు అత్యుత్తమ పనితీరు కనబరిచా­రని ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌’నివేదిక స్పష్టం చేసింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో ఉందని ఆ నివేదిక వెల్లడించింది. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు­త్వ హయాంలో పోలీసు శాఖ పనితీరు క్రమ­ంగా మెరుగుపడిందని సవివరంగా పేర్కొంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2024 నాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుందని తెలిపింది. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ సోషల్‌ మీడియా విభాగం మాత్రం ఆ ఘనతను చంద్రబాబు ప్రభుత్వానికి ఆపాదించేందుకు తప్పుడు ప్రచారాన్ని వైరల్‌ చేసేందుకు పడరానిపాట్లు పడుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement