
ఖమ్మంక్రైం: తనకు సంబంధించిన నగదు, బంగారం, వెండి నగలు ఇంట్లో పెట్టుకొని అత్త, మామ ఇంటి నుంచి గెంటేశారని, తనకు న్యాయం చేయాలంటూ శుక్రవారం వివాహిత మెట్టినింటి ఎదుట నిరసనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. ముదిగొండ మండలానికి చెందిన జరీనాకు నగరంలోని త్రీటౌన్ ఎఫ్‌సీఐ గోదాముల ప్రాంతానికి చెందిన షేక్ షరీఫ్‌తో 2020లో వివాహమైంది. వారికి నాలుగేళ్ల పాప ఉంది.
కొన్ని నెలల కిందట షరీఫ్ అనారోగ్యంతో మృతిచెందాడు. అత్తవారింటి వద్ద ఉన్న జరీనాను.. అత్త, మామలు గెంటేశారు. పుట్టింటివారు ఇచ్చిన రూ.10 లక్షల నగదు, 10 తులాల బంగారం, వెండి ఆభరణాలు, ఇంటి సామగ్రి వారి వద్దనే పెట్టుకొని తనను బయటకు పంపించారని, తనకు న్యాయం చేయాలని మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా న్యాయం జరగలేదని బాధితురాలు వాపోయింది. త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సర్దిచెప్పారు. తన మామ సైదా, అత్త సఫియాబేగం, మరిది రంజాన్‌పాషాపై చర్యలు తీసుకోవాలని కోరింది.