21నాటికి ప్రోగ్రెస్‌ కార్డులు అందించాలి | - | Sakshi
Sakshi News home page

21నాటికి ప్రోగ్రెస్‌ కార్డులు అందించాలి

Published Fri, Apr 18 2025 1:54 AM | Last Updated on Fri, Apr 18 2025 1:54 AM

21నాటికి ప్రోగ్రెస్‌ కార్డులు అందించాలి

21నాటికి ప్రోగ్రెస్‌ కార్డులు అందించాలి

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రోగ్రెస్‌ కార్డును ఈనెల 21వ తేదీ నాటికి అందించాలని జేసీ డాక్టర్‌ బి.నవ్య అఽధికారులను ఆదేశించారు. గురువారం పాఠశాలల ముగింపునకు సంబంధించిన అంశాలపై జేసీ వెబెక్స్‌ ద్వారా విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచే విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్‌ చేసి అదే రోజు నుంచి బోధన జరిగేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,21,632 మంది విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్‌ చేయాలన్నారు. 1,886 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ప్రాథమిక విద్యలోకి చేరుతుండడంతో వారంతా పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీఈఓ శామ్యూల్‌పాల్‌ పాల్గొన్నారు.

కనిష్ట స్థాయికి ఉల్లి ధర

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉల్లి ధర కనిష్టస్థాయికి పడిపోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అన్‌ సీజన్‌ కావడంతో అక్కడక్కడ బావులు, బోర్లు, ఇతర నీటిపారుదల కింద ఉల్లి సాగయింది. కర్నూలు మార్కెట్‌కు ఎనిమిది మంది రైతులు మాత్రమే 479 క్వింటాళ్ల ఉల్లి తెచ్చారు. క్వింటాకు కనిష్టంగా రూ.675, గరిష్ట ధర రూ.879 మాత్రమే లభించింది. సగటు ధర రూ.755 నమోదైంది. జిల్లాకు మహారాష్ట్రలో పండించిన ఉల్లి భారీగా దిగుమతి అవుతోంది. ఉల్లితో పాటు మిర్చి, వాము, వేరుశనగ, శనగ తదితర అన్ని పంటల ధరలు పడిపోయాయి.

– క్వింటా మిర్చి ధర రూ.4వేల నుంచి రూ.7వేల వరకు మాత్రమే పలుకుతోంది. రెండు నెలల కిత్రం మిర్చి రైతులకు న్యాయం చేస్తామంటూ హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి నష్టాలనే మిగిల్చారు.

– వాము క్వింటాకు కనిష్టంగా రూ.1880, గరిష్టంగా రూ.21,682 లభించగా.. సగటు ధర రూ.12,699 నమోదైంది.

60 ఏళ్లు పైబడిన వృద్ధులకు గుర్తింపు కార్డులు

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో 60 సంవత్సరాల వయస్సు పైబడిన వయో వృద్ధులు సీనియర్‌ సిటిజన్‌ గుర్తింపు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్డు సచివాలయాల పరిధిలోని వారు వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రెటరీ, గ్రామ సచివాలయాల పరిధిలోని వారు డిజిటల్‌ అసిస్టెంట్లను సంప్రదించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌కార్డు, ఒక పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్డుకు పురుషులు 60 సంవత్సరాలకు పైబడి, మహిళలు 58 సంవత్సరాలకు పైబడిన వారు అర్హులన్నారు. గుర్తింపు కార్డుల జారీకి ఎలాంటి ఆన్‌లైన్‌ దరఖాస్తులు తమ కార్యాలయంలో స్వీకరించబడవని ఆమె స్పష్టం చేశారు.

ముఖ ఆధారిత హాజరులో అవకతవకలు

ఏడుగురికి చార్జి మెమోలు జారీ

కర్నూలు(హాస్పిటల్‌): వైద్య ఆరోగ్యశాఖలో ముఖ ఆధారిత హాజరులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏడుగురి కి చార్జి మెమోలు జారీ చేశారు. ఇందులో ముగ్గురు మెడికల్‌ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక ఫార్మాసిస్టు ఉన్నారు. వీరు తమ ఐ ఫోన్‌ ద్వారా హాజరును మార్ఫింగ్‌ చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు జాబితాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.శాంతికళకు పంపించడంతో ఆమె ఏడుగురికి చార్జి మెమోలు పంపించారు. ఈ మేరకు వివరణ ఇచ్చిన వారు సాంకేతిక లోపం కారణంగానే హాజరు తప్పుగా నమోదైందని, ఇందులో తాము కావాలని చేసిందేమీ లేదని వివరణ ఇచ్చినట్లు సమాచారం. వారు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే కాంట్రాక్టు వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని, రెగ్యులర్‌ వారిని సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.

ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్‌

హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి నీటిమట్టాన్ని తగ్గిస్తూ వచ్చారు. బుధవారం పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేశారు. జిల్లా సరిహద్దులోని 250 కి.మీ వద్ద కాలువలో గురువారం నీటి ప్రవాహం కనిపించలేదు. టీబీ డ్యాంలో 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.037 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంకు ఇన్‌ఫ్లో ఏమీ లేక పోగా అవుట్‌ఫ్లో 325 క్యూసెక్కులుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement