
ఆదోనిలో ఎమ్మెల్యే పేరుతో పీఏ, అనుచరుల దందా
● ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లకు నెల మామూళ్లు ఫిక్స్ ● కర్ణాటక నుంచి ఏపీ, తమిళనాడుకు వెళ్లే సరుకు రవాణా వాహనాల నుంచి వసూళ్లు ● మామూళ్లు ఇవ్వని వాహనాలపై అనుచరుల దాడులు, పోలీసు కేసులు ● ప్రత్యేకంగా ఓ ముఠాను నియమించుకున్న ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి కర్నూలు: బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పేరు చెప్పి ఆయన పీఏ నాగరాజు గౌడ్, అనుచరులు చేస్తున్న అక్రమాలపై ఆదోనిలో టీ అంగళ్లు, హోటళ్లతో పాటు ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ. ఆదోనిలో ఓ ప్రత్యేక ముఠా ఉంది. ఇసుక, కర్ణాటక నుంచి ఏపీ, తమిళనాడుకు ఫ్లయాస్ వెళ్లే లారీలు ఆపి బెదిరిస్తున్నారు. అర్ధరాత్రి ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లు, టిప్పర్లను ఆపి డ్రైవర్లపై దాడులు చేసి మామూళ్ల కోసం బెదిరిస్తున్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో రెవె న్యూ, పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకుని వారికి మా మూళ్లు ఇస్తూ, తక్కిన డబ్బు టీడీపీ నేతలు పంచుకుంటూ భారీగా ఆర్జిస్తున్నారు. వీరి దెబ్బకు ఫైనాన్స్‌లో ట్రాక్టర్లు తెచ్చుకుని ఇసుక అవసరం ఉన్న వాళ్లకు ఉచితంగా తోలి, టిప్పునకు రూ.400–500 బాడుగ వస్తే బతుకుతాం’ అనేవాళ్ల కడుపుపై కొడుతున్నారు. దీంతో కడుపు రగిలిన కొందరు డ్రైవర్లు బీజేపీ ఎమ్మెల్యే అనుచరులపై ఎదురు తిరుగుతున్నారు. జరుగుతున్న దందా, రౌడీయిజంపై ధైర్యంగా గళం విప్పుతున్నారు.
మున్సిపాలిటీలో ఏ పని చేయాలన్నా 10శాతం కప్పం కట్టాల్సిందే..
ఆదోని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు టెండర్ వేయాలంటే ముందుగా ఎమ్మెల్యే పీఏతో మాట్లాడాలి. 10శాతం కప్పం కట్టాలి. లేదంటే పనులు చేయలేరు. చేసినా బిల్లులు రావు. గత ప్రభుత్వంలో మొదలై పురోగతిలో ఉన్న పనుల బిల్లులు కూడా ఆపేశారు. వాటి నుంచి కూడా కప్పం చెల్లించుకుని ఆ తర్వాత మంజూరు చేయించారు. పాతబస్టాండ్ వద్ద మునిసిపల్ కాంప్లెక్స్ భవనాన్ని ఇలాగే ఆపేశారు. కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు చెల్లించిన తర్వాత తిరిగి పనులకు ‘గ్రీన్‌సిగ్నల్’ ఇచ్చారు.
ఈ సర్వేనెంబర్లలో
క్రయ విక్రయాలు పూర్తిగా బంద్
ఆదోనిలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న సర్వే నెంబర్ 352లో పూర్తిగా రిజిస్ట్రేషన్లను ఆపేసినట్లు తెలుస్తోంది. 1922లో బ్రిటీష్ ప్రభుత్వంలోని కొందరికి హక్కుగా వచ్చిన భూమి వంశపారపర్యంగా విక్రయిస్తూ వచ్చారు. ఇందులో కొంత తమకు ఇవ్వాలని కూటమి నాయకులు వారిని డిమాండ్ చేశారు. దీనికి భూ యజమానులు ఒప్పుకోకపోవడంతో ఈ భూమి రిజిస్ట్రేషన్‌లు ఆపేసినట్లు తెలిసింది. అలాగే సర్వే నెంబర్ 444లో కూడా రిజిస్ట్రేషన్‌లు ఆపేసినట్లు సమాచారం. ప్రతీ శాఖ కార్యాలయంలో ఇక్కడి ప్రజాప్రతినిధి తమ మనుషులను నియమించుకున్నారు. దీంతో రోజు ముఖ్యమైన ఫైళ్లు ఎవి కదులుతున్నాయి? భారీ లావాదేవీల సమాచారం ప్రజాప్రతినిధికి వస్తోంది. ఆ ప్రకారం పీఏ ఫోన్ చేసి లావాదేవీని బట్టి ‘కప్పం’ నిర్ణయిస్తారు.
– ఆదోని ఎస్కేడీ కాలనీలో పార్థసారథి సన్నిహితుడు డాక్టర్ రవికిరణ్ 6.71 ఎకరాల భూమిని అక్రమంగా తమ తల్లిపేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో రిజిస్ట్రేషన్ రద్దు చేశారు.
ప్రైవేటు ఆస్పత్రులకు వేధింపులు:
ఆదోనిలో మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి ఉంది. ఇక్కడ 5గురు డాక్టర్లు ఉన్నారు. నెలకు 500 ప్రసవాలు జరుగుతాయి. ఇది తెలీకుండా అక్కడ రెండు ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా చికిత్స అందించే రెండు ఆస్పత్రులకు ఎక్కువగా కేసులు వెళ్తున్నాయని కలెక్టర్, డీఆర్‌సీ మీటింగ్‌లో ప్రస్తావించారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణల్లో వాస్తవాలు లేవని అధికారులు ఆయన ఫిర్యాదు తేలిగ్గా తీసుకున్నారు. కానీ అధికారుల విచారణలో ఆస్పత్రుల యజమానులను ‘కప్పం’ చెల్లించాలని వేధిస్తే వారు దారికి రాకపోవడంతోనే వేధింపులకు పాల్పడుతున్నారని తేలినట్లు తెలుస్తోంది.
నన్ను కొట్టి, ఫోన్ లాక్కుని
దౌర్జన్యం చేశారు
‘నా పేరు మహ్మద్ హుస్సేన్. నదీచాగి నుంచి ఇసుక తీసుకొస్తున్నా. రాత్రి ఒంటిగంట తర్వాత బీజేపీ వాళ్లు బండిని ఫాలో అయ్యారు. సాయి, రమాకాంత్, సాయన్న బండి నిలిపారు. నా వద్ద ఉన్న బిల్లు తీసుకుని చించేశారు. అన్‌లోడింగ్‌కు పోతున్నామని చెబుతుంటే మీ ఓనర్ ఎవరు? ఇప్పుడు ఇక్కడికి రమ్మను అని అర్ధరాత్రి చెబుతున్నారు. వారితో 7–10మంది ఉన్నారు. వారు నన్ను కొట్టి బండి ఆపి దౌర్జన్యం చేశారు. ఫోన్ లాక్కున్నారు. మేం డ్రైవర్లు ఏం చేస్తాం అన్నా వినలేదు.’

ఆదోనిలో ఎమ్మెల్యే పేరుతో పీఏ, అనుచరుల దందా