
అదుపు తప్పి ఆటో బోల్తా
బనగానపల్లె రూరల్: ఆటో డ్రైవ ర్ అతివేగం, నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం పోయింది. ఎర్రమల కొండల్లో కటికవాని కుంట సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామానికి చెందిన పది మంది తమ బంధువులకు చెందిన పుట్టెంట్రుకల కార్యక్రమం నిమిత్తం బేతంచెర్ల మండలంలోని మద్దిలేటిస్వామి క్షేత్రానికి ఆటోలో చేరుకున్నారు. మధ్యాహ్నం కార్యక్రమం ముగిసిన తర్వాత ఆటోలో స్వగ్రామానికి బయల్దేదారు. మార్గమధ్యలో ఎర్రమల కొండపై ఉన్న కటికవానికుంట గ్రామం దాటిన తరువాత మలుపు వద్ద ఆటో డ్రైవర్ అతివేగంతో వెళ్లడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన చిన్నమ్మ, కాశమ్మ, హుస్సేనమ్మ, పెద్దక్క, ఐదేళ్ల చిన్నారి భువనసాయి, రమేష్, సుబ్బలచ్చమ్మ, ఆటో డ్రైవర్ వీరప్పను 108లో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా చిన్నమ్మ, కాశమ్మ, భువనసాయికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగ్రాతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
మహిళ మృతి,
మరో ఏడుగురికి గాయాలు

అదుపు తప్పి ఆటో బోల్తా