
ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం
ఎమ్మిగనూరురూరల్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని పిల్లల వార్డులో గురువారం నాగుపాము కలకలం సృష్టించింది. పిల్లల వార్డులో పామును గుర్తించిన తల్లులు కేకలు వేయటంతో అక్కడ ఉన్న బంధువులు వచ్చి పామును కర్రలతో వార్డు నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అనంతరం బయటకు వచ్చిన పామును చంపటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో చాలా సార్లు పాములు ఆసుపత్రిలో వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అసుపత్రి అవరణలో అపరిశుభ్రంగా ఉండటంతో పాములు వార్డుల్లోకి వస్తున్నాయని రోగులు వాపోతున్నారు.
శ్రీశైలం ఘాట్‌లో అదుపుతప్పిన బస్సు
● డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
● 20 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కొండచరియను ఢీ కొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరిగుప్ప ప్రాంతానికి చెందిన 40 మంది భక్తులు తీర్ధయాత్రలకు బయలుదేరారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చిన్నారుట్ల ఘాట్ రోడ్డులో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సు లోయలో పడకుండా పక్కనే ఉన్న కొండ చరియలను ఢీ కొడ్డాడు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఫయాజ్ (28) తీవ్ర గాయాలయ్యాయి. 20 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఫయాజ్‌ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం