
నేడు మార్కెట్‌యార్డుకు సెలవు
ఆదోని అర్బన్: జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ శుక్రవారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సెలవు ఇవ్వాలని కమీషన్ ఏజెంట్లు, గుమస్తా, మర్చంట్ అసోసియేషన్ నాయకులు గురువారం యార్డు అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు రాజాగౌడ్, లక్ష్మన్న మాట్లాడారు. ముస్లిం దేశాల్లో హిందువులకు రక్షణలేదని, హిందువులున్న దేశంలో కూడా హిందువులకు రక్షణ లేకపోవడం ఘోరమన్నారు. జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం సెలవు ప్రకటించాలని కోరారు. ఇందుకు యార్డు అధికారులు అంగీకరించారు.
ఎన్‌టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీగా డాక్టర్ పి.చంద్రశేఖర్
కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్‌టిఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కర్నూలుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ పి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గురువారం జీఓ విడుదల చేశారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఆయన 1960 సంవత్సరం ఆగస్టు 14న జిడి.లక్ష్మణదాస్, జి.సావిత్రమ్మలకు కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో జన్మించారు. తండ్రి జిడీ. లక్ష్మణదాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశారు. డాక్టర్ పి.చంద్రశేఖర్ కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్‌గా 38 ఏళ్ల పాటు పనిచేసి పదవీ విరమణ చెందారు. అనంతరం ఆయన కార్డియాలజి విభాగంలోనే తిరిగి ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.
కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న రాత పరీక్ష
కర్నూలు: కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. పోలీస్ కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి 2024 డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఇందులో అర్హత సాధించిన వారందరికీ జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు htt pr://rprb.ap.gov.inను సందర్శించాలని పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యాయురాలు సర్వీస్ నుంచి తొలగింపు
కర్నూలు సిటీ: కర్నూలు నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.శారదాదేవిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఆర్జేడీ శామ్యూల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఆమెను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. గతంలో కర్నూలులో పని చేసే సమయంలో జరిగిన కొన్ని వివాదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే శారదాదేవి అక్కడ విధుల్లో చేరకపోవడంతో సర్వీసు నుంచి తొలగించారు.
తనయుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య
కర్నూలు: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కుమారుడు భరత్‌బాబు ఫెయిల్ అయ్యాడనే మనస్థాపంతో తల్లి బెజవాడ లక్ష్మీజ్యోతి (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రవి, లక్ష్మీజ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా మొదటి కుమారుడు భరత్ బాబు పదవ తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. బుధవారం ఫలితాలు వెలువడగా రాత్రి తల్లి లక్ష్మీజ్యోతి కర్నూలు నగరంలోని ఇంట్లోనే చీరతో ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఉరి నుంచి తప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి రేపల్లె సుగుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్‌ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు మార్కెట్‌యార్డుకు సెలవు

నేడు మార్కెట్‌యార్డుకు సెలవు