
పల్లె ముంగిట్లోనే ‘పాలన’
వైఎస్సార్‌సీపీ హయాంలో విప్లవాత్మక సంస్కరణలు
● దేశంలోనే ఆదర్శంగా సచివాలయ వ్యవస్థ ● ఆర్‌డీఓల తరహాలో డీఎల్‌డీఓ పోస్టులు ● నెరవేరిన ఎంపీడీఓల దశాబ్దాల కల ● జిల్లా అధికారులుగా పదోన్నతి పొందిన ఎంపీడీఓలు ● పర్యవేక్షకులను ఏఓలుగా గుర్తించి గెజిటెడ్ హోదా ● సచివాలయ ఉద్యోగులకు పేస్కేల్ అమలు ● నేడు పంచాయతీరాజ్ దినోత్సవం
కర్నూలు(అర్బన్): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వందల సంఖ్యలో ఉద్యోగులకు పదోన్నతుల పరంపర ప్రారంభమైంది. ముఖ్యంగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ అయ్యేంతవరకు ఎలాంటి పదోన్నతులు లేకుండా ఉన్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించి గత ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 2022 ఆగష్టు నెలలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో అర్హులైన దాదాపు 17 మంది ఎంపీడీఓలు వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులుగా పదోన్నతి పొందారు. వీరి కంటే ముందు ( 2020 అక్టోబర్ నెలలో ) రెవెన్యూ శాఖలో ఉన్న విధంగానే ( ఆర్‌డీఓ తరహాలో ) పంచాయతీరాజ్ శాఖలో కూడా డివిజన్ స్థాయిలో డీఎల్‌డీఓ పో స్టును క్రియేట్ చేసి అర్హులకు పదోన్నతులు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాకు ముగ్గురు డీఎల్‌డీఓలు వచ్చారు. ఎంపీడీఓలకు పదోన్నతులు ప్రారంభం కాగానే, క్షేత్ర స్థాయి (ఆఫీస్ సబార్డినేట్) నుంచి పదోన్నతుల ప్రక్రియ ఊపందుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హత కలిగిన 17 మంది ఎంపీడీఓలు జిల్లా స్థాయి అధికారులుగా పదోన్నతిపై వెళ్లగా, వారి స్థానంలో 14 మంది ఏఓ, 13 మంది ఈఓఆర్‌డీలకు 2023 మే నెలలో ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పించారు. వీరి స్థానంలో 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, 15 మంది గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు ఈఓఆర్‌డీలుగా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లకు వారి అర్హతలను బట్టి పదోన్నతులు దక్కాయి.
పర్యవేక్షకులను ఏఓలుగా గెజిటెడ్ హోదా
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కార్యాలయాల్లో (ఎంపీడీఓ, జెడ్పీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షకులుగా(సూపరింటెండెంట్ ) ఉన్న వారిని పరిపాలనాధికారులుగా (ఏఓ)లుగా గుర్తించారు. వీరికి గెజిటెడ్ హోదా కల్పించిన ఘనత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కింది.
దేశానికే తలమానికంగా సచివాలయ వ్యవస్థ
వైఎస్సార్‌పీపీ పాలనలో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 10వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 1188 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా, వీటిలో కర్నూలు జిల్లాలో 465 గ్రామ సచివాలయాలు, 207 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి.
నంద్యాల జిల్లాలో 420 గ్రామ సచివాలయాలు, 96 వార్డు సచివాలయాలు ఉన్నాయి.
సచివాలయాల్లో మొత్తం మంజూరైన పోస్టులు 9,878 కాగా, 8,630 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
వీరిలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు డిపార్టుమెంటల్ టెస్ట్ ఉత్తీర్ణులైన 7,466 మంది ఉద్యోగుల ప్రొబేషన్ ముందుగా డిక్లేర్ కాగా, మిగిలిన వారికి విడతల వారీగా డిక్లేర్ చేశారు.
ప్రొబేషన్ డిక్లేర్ కావడంతో పే స్కేల్‌ను కూడా అమలు చేశారు.
ఉద్యోగంలో చేరిన సమయంలో నెల జీతం రూ.15 వేలు ఉండగా, ప్రస్తుతం గ్రాస్‌గా ప్రతి సచివాలయ ఉద్యోగి దాదాపు నెలకు రూ.30 వేల వరకు డ్రా చేస్తున్నారు.
అలాగే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు నెలకు రూ.32 వేల వరకు డ్రా చేస్తున్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఘనత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. పాలనను ప్రజలకు అత్యంత చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందనడలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వ పథకాలను ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో అన్ని విభాగాల ఉద్యోగులకు న్యాయం జరిగింది.
జిల్లా అధికారులుగా ఎంపీడీఓలు
గత ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం వల్ల అనేక మంది ఎంపీడీఓలు వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులయ్యారు. పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా, డీఆర్‌డీఏ, మెప్మా, హౌసింగ్ శాఖల్లో పీడీలుగా, పలు శాఖల్లో కీలకమైన పోస్టుల్లో పదోన్నతి పొందారు