'సొంత సైన్యం..!' అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే పరిస్థితి! | - | Sakshi
Sakshi News home page

'సొంత సైన్యం..!' అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే పరిస్థితి!

Published Thu, Nov 2 2023 4:48 AM | Last Updated on Thu, Nov 2 2023 11:28 AM

- - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం, ఇతర పనుల కోసం సొంత బృందాలను సిద్ధం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, నమ్మకమైన స్నేహితులను నియోజకవర్గాలకు రప్పించుకుంటున్నారు. నెల రోజులు ఇక్కడే ఉండి ముఖ్యమైన బాధ్యతులు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థుల సొంత బృందాలు ఎన్నికల పనులు చూసుకుంటుండగా.. ఆయా పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇద్దరిని సమన్వయం చేసేందుకు అభ్యర్థులు, నాయకులు నానాతంటాలు పడుతున్నారు.

రమ్మని కబురు..
ఎన్నికల్లో పోటీ చేయడం ఒక ఎత్తు అయితే.. నామినేషన్‌ నుంచి ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకు అనేక పనులు ఉంటాయి. ఈ పనులు ఎవరికి పడి తే వారికి అప్పగిస్తే తప్పొప్పులకు అభ్యర్థి ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అందుకోసం ముఖ్యమైన పనులు చేసేందుకు అభ్యర్థులు తమ కుమారులు, కుమార్తెలు, అన్నదమ్మలు, అక్కాచెల్లెళ్ల పిల్లలతో పాటు సమీప బంధువులను నియోజకవర్గానికి రప్పించుకుంటున్నారు. అదేవిధంగా క్లాస్‌మేట్స్‌, దగ్గరి మిత్రులను కూడా రమ్మంటున్నారు. ఇలా ఇప్పటికే కొందరు అభ్యర్థుల తమ కుటుంబ, బంధువులను ఇంటికి రప్పించుకొని వారికి ప్రత్యేక విడిదులు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసున్న వారిని కూడా నెలరోజులు సెలవులు పెట్టి రమ్మని కబురు పంపుతున్నారు.

కీలక బాధ్యతలు..
ఎన్నికల ప్రక్రియలో కీలక బాధ్యతలు తమ సొంత బృందాల సభ్యులకు అప్పగిస్తున్నారు. ప్రధానంగా నామినేషన్‌ పత్రంతో పాటు సమర్పించాల్సిన ఓటరు కార్డు, ఆస్తుల వివరాలు, చిరునామా, కేసులు మొదలైన పత్రాలను ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలి. ఈ విషయంలో ఏమాత్రం పొరపాట్లు జరిగినా అభ్యర్థి ఇబ్బందిపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి ఫిరాయింపు దారులతో మాట్లాడటం, డబ్బులు సేకరణ వంటి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

దీంతో పాటు ప్రధానంగా ప్రస్తుత ఎన్నికల్లో పెట్టే ఖర్చు, ఓటరుకు డబ్బులు, మద్యం పంపిణీ మొదలైన లెక్కలు కూడా కీలకంగా భావిస్తున్నారు. గతంలో కొందరు అభ్యర్థులు నాయకులను నమ్మి డబ్బులు పంపిణీ చేయమంటే.. ఓటర్లకు అందజేయకుండా సగం నొక్కేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి రావొద్దని నాయకులు ముందస్తు ప్యూహంతో వెళ్తున్నారు. ఇందు కోసమే సొంత బలగాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నారు.

ద్వితీయ శ్రేణి నాయకుల గుర్రు..
జిల్లాలోని పలు పార్టీల అభ్యర్థులు కీలక బాధ్యతలు తమ సొంత వారికి అప్పగించడంపై ఆయా పార్టీల్లోని నాయకులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా సమావేశాలు పెట్టడం, ఇంటింటి ప్రచారం, ఇతర పార్టీ నాయకులను మచ్చిక చేసుకోవడం వంటి పనుల్లో కాస్తో.. కూస్తో డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తుంది.

ఈ క్రమంలో చీటికి మాటికి తనకంటే చిన్నవయసు, అసలు రాజకీయ అనుభవం లేని వారి వద్ద డబ్బులు అడుక్కొవాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సహచర నాయకులు, కార్యకర్తల ముందు చులకన కావాల్సి వస్తుందని పలువురు నాయకులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభ్యర్థులు సదరు నాయకులను బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. నా మనుషులు కేవలం మీకు మద్దతుగా ఉండేందుకు, అనుభవం వచ్చేందుకే కానీ మీ మీద పెత్తనం చేసేందుకు కాదని చెబుతున్నారు.
ఇవి చదవండి: ఉమ్మడి వరంగల్‌లో.. మరోమారు రాహుల్‌గాంధీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement