
మానుకోటలో ఏసీబీ అధికారుల సోదాలు
మహబూబాబాద్ రూరల్: సస్పెన్షన్కు గురైన జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషాపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న గౌస్ పాషా ఇంటికి ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ తన బృందంతో చేరుకుని విస్తృత సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఉంటున్న గౌస్ పాషా బంధువుల ఇళ్లలో ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.3.51 కోట్ల రూపాయల విలువైన వాహనాలు, వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, భవనాలకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ ఇంకా అధికంగా ఉంటుందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో, హైదరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ఉంటున్న బంధువు ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఏసీబీ అధికారుల సోదాల్లో గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావు, పలువురు ఏజెంట్లు, జూనియర్ అసిస్టెంట్ రవీందర్ వద్ద అదనంగా ఉన్న రూ.895, కిటికీలో పడేసిన రూ.300, మొత్తంగా రూ.62,795 నగదు, నూతన లైసెన్సులు, రెన్యువల్స్, ఫిట్ నెస్ కు సంబంధించిన కాగితాలు, పలు వాహనాల తాళం చేతులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో 2024 మే 28న జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా సస్పెన్షన్ కు గురయ్యారు. ఇప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే పలు ఆరోపణలు రావడంతో మాజీ జిల్లా రవాణా శాఖ అధికారి ఇంట్లో, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
సస్పెండ్ అయిన డీటీఓ గౌస్ పాషాపై కేసు