
‘భూ భారతి’తో రైతులకు ప్రయోజనాలు
కురవి: భూభారతి చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. ఆదివారం సీరోలు మండలం కాంపెల్లి రైతు వేదికలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. నూతన చట్టంతో రైతుల భూములకు భరోసా కల్పిస్తుందన్నారు. ఏమైనా ఇతర అంశాలు, సమస్యలున్నా పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందన్నారు. భూసమస్యలు తెలుసుకుని సులభతరంగా పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందన్నారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. కాగా నూతన చట్టంపై సాంస్కృతిక సారఽథి సభ్యులు పాడిన పాటలు రైతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, ఏడీ సర్వేల్యాండ్ నరసింహమూర్తి, తహసీల్దార్ శ్రీనివాస నారాయణమూర్తి, ఎంపీడీఓ ఎండి.గౌస్, ఏఓ ఛాయ, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్