నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.? | - | Sakshi
Sakshi News home page

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.?

Published Mon, Apr 21 2025 1:01 AM | Last Updated on Mon, Apr 21 2025 1:01 AM

నాన్‌

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.?

తెలంగాణలో కన్నడ మీడియం.. ప్రశ్నార్థకం

కృష్ణా: రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా మండలం విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి ప్రజల వేషం, భాష, అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అందుకే కృష్ణా మండలాన్ని మినీ ఇండియాగా కూడా పిలుస్తారు. ఇక్కడ నివసించే ప్రజలు వందకు 70 శాతం మంది కన్నడ భాషలో మాట్లాడుతారు. ప్రజల మాతృభాషకు అనుగుణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మండలంలోని ప్రతి గ్రామంలో కన్నడ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇక్కడ కన్నడ మీడియం చదివిన విద్యార్థులు ఉన్నత చదువుల నిమిత్తం తప్పనిసరిగా కర్ణాటకకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం పదోతరగతి వరకు మాత్రమే కన్నడ మీడియం ఉంది. మిగతా ఉన్నత చదువులు చదివేందుకు తెలంగాణలో ఎక్కడా అవకాశం లేకపోవడంతో కర్ణాటకకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యోగ పోటీ పరీక్షలు రాయాలన్నా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఇక్కడ చదివి ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. దీంతో కర్ణాటకలో ఇంటర్‌ చదివిన విద్యార్థులు స్థానికతను కోల్పోతున్నారు. అటు కర్ణాటకలోనూ ఇవే నిబంధనలు ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్థానికత అవసరం ఉంటుంది. ఇక్కడ పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నాన్‌లోకల్‌ కిందకు వస్తున్నారు. అక్కడ, ఇక్కడ విద్య, ఉద్యోగ అవకాశాలు రాక మధ్యలోనే చదువులు నిలిపివేస్తున్నారు.

కన్నడ మీడియంలో

871 మంది విద్యార్థులు..

కృష్ణా ఉన్నత పాఠశాలలో 270 మంది, తంగిడి ప్రాథమికోన్నత పాఠశాలలో 170, చేగుంటలో 120, క్రిష్ణ ప్రాథమిక పాఠశాలలో 60, గుర్జాల్‌లో 70, కుసుమర్తిలో 40, ఐనాపూర్‌లో 36, హిందూపూర్‌ 80, గుడెబల్లూర్‌లో 25 మందితో కలిపి మొత్తం 871 మంది విద్యార్థులు కన్నడ మీడియం చదువుతున్నారు. ప్రతి విద్యాసంవత్సరం 200 నుంచి 250 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసుకొని ఉన్నత చదువులకు కర్ణాటకకు వెళ్తుంటారు. వీరిని అక్కడ నాన్‌లోకల్‌గా పరిగణిస్తున్నారు. తెలంగాణలోనూ నాన్‌లోకల్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. దీంతో చాలా మంది విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ.. నాన్‌లోకల్‌ కారణంగా విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు.

కృష్ణా స్కూల్‌కు రూ. 10లక్షలు మంజూరు..

కృష్ణాలోని కన్నడ మీడియం ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 10లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో భవన నిర్మాణం పూర్తయింది. దీంతో పాటు కన్నడ భాషకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ప్రతి సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం కృష్ణా మండలంలోని కన్నడ మీడియం పాఠశాలలకు సరఫరా చేస్తోంది.

ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం..

నేను 1994–95లో కృష్ణా ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకొని కర్ణాటకలోని రాయచూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశాను. 1998లో టీటీసీ చేసేందుకు ప్రయత్నించగా.. అక్కడి ప్రభుత్వం నాన్‌లోకల్‌ కారణంగా టీటీసీలో అవకాశం కల్పించలేదు. 2002లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం రాగా.. అప్పడు కూడా నాన్‌లోకల్‌ కారణం చూపుతూ ఉద్యోగం ఇవ్వలేదు. నాలా చాలా మంది నష్టపోతున్నారు. తెలంగాణలోని కన్నడ మీడియం పాఠశాలల మూలంగా ఇటు తెలంగాణ, అటు కర్ణాటకలో నష్టపోతున్నాం. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగు నిర్ణయం తీసుకోవాలి.

– భీంసీ, కృష్ణా

బడుల

బలోపేతానికి కృషి..

రాష్ట్రంలోని కన్నడ మీడియం పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నాం. అందుకు అటు కర్ణాటక, ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పోరాడుతున్నాం. గతంలో కృష్ణా ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం నిధులు కేటాయించింది. గడినాడ విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ‘వరనాడు’ ద్వారా ప్రత్యేక రిజర్వేషన్లు అమలుచేస్తుంది. దాంతో పాటు హాస్టల్‌ సౌకర్యం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశాం.

– రాంలింగప్ప,

గడినాడ కన్నడ సంఘం అధ్యక్షుడు, కున్సీ

పోరాడుతున్నాం..

కన్నడ భాషపై ఉన్న అభిమానంతో తాము కన్నడ మీడియం పాఠశాలలను అన్నివిధాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నాం. మూతపడిన రెండు కన్నడ మీడియం పాఠశాలలను పునఃప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆయన చొరవతో ఆ పాఠశాలలను త్వరలోనే పునరుద్ధరిస్తాం.

– నిజాముద్దీన్‌, ఎంఈఓ,

గడినాడ కన్నడ సంఘం గౌరవాధ్యక్షుడు, కృష్ణా

స్థానికత కోసం కర్ణాటకకు ఇక్కడి విద్యార్థులు

రాష్ట్ర సరిహద్దులో ఆదరణ కోల్పోతున్న పాఠశాలలు

ఇప్పటికే రెండు ప్రాథమిక పాఠశాలలు మూత

గడినాడ ఉద్యమంతో కర్ణాటక ప్రభుత్వంలో చలనం..

కన్నడ భాషపై అభిమానంతో ఈ ప్రాంతంలోని నాయకులు, ఉపాధ్యాయులు గడినాడ (రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతం) కన్నడ సంఘం ఏర్పాటు చేసుకొని కర్ణాటక ప్రభుత్వంతో అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఫలితంగా కొంతకాలం క్రితం కన్నడ మీడియం చదివిన ఇతర రాష్ట్ర విద్యార్థులకు కర్ణాటకలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో గడినాడ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.? 1
1/4

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.?

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.? 2
2/4

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.?

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.? 3
3/4

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.?

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.? 4
4/4

నాన్‌‘లోకల్‌’ ఎక్కడ.?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement