నిషేధిత ప్రదేశంలో తవ్వకాలు సాధ్యమేనా? | - | Sakshi
Sakshi News home page

నిషేధిత ప్రదేశంలో తవ్వకాలు సాధ్యమేనా?

Published Thu, Apr 24 2025 12:47 AM | Last Updated on Thu, Apr 24 2025 12:47 AM

నిషేధిత ప్రదేశంలో తవ్వకాలు సాధ్యమేనా?

నిషేధిత ప్రదేశంలో తవ్వకాలు సాధ్యమేనా?

అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో గుర్తించిన నిషేధిత ప్రదేశంలో తవ్వకాలు చేపట్టడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. సొరంగం ప్రమాదం జరిగి బుధవారం నాటికి 61 రోజులు అవుతుంది. నాటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా.. గల్లంతైన ఆరుగురి కార్మికుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. సొరంగం పైకప్పు కుప్పకూలిన 13.936 కి.మీ. నుంచి ఇన్‌లేట్‌ వైపు 324 మీటర్ల వరకు మట్టి, బురద, పెద్దపెద్ద బండరాళ్ల, టీబీఎం మిషన్‌ ప్లాట్‌ఫాం శిథిలాలు భారీగా పేరుకుపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 విభాగాల ఉన్నతాధికారులు ప్రమాద ప్రదేశాన్ని డీ–2, డీ–1గా గుర్తించారు. సొరంగం పైకప్పు కూలిన 43 మీటర్ల ప్రదేశాన్ని డీ–1 డేంజన్‌ జోన్‌గా గుర్తించారు. భారీగా ఉబ్బికి వస్తున్న నీటి ఊట కారణంగా ఇక్కడ ఎలాంటి తవ్వకాలు చేపట్టినా మరింత ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రదేశంలో కంచె ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన చోట చివర కాంక్రీట్‌ సెగ్మెంట్‌లు కూలే ప్రమాదం ఉందని గుర్తించి.. రక్షణ కోసం సింగరేణి మైన్స్‌ రెస్క్యూ బృందాలు టైగర్‌ టింబర్‌ ఉడెన్‌ కాగ్స్‌ సపోర్టు ఏర్పాటుచేశారు. నిషేధిత ప్రదేశం మినహా డీ–2 ప్రాంతంలో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, బురద, టీబీఎం భాగాలు, రాళ్లను తొలగించే పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. చివరగా సొరంగం ఇరువైపులా ఆరు మీటర్ల మేర ఉన్న టీబీఎం ప్లాట్‌ఫాం భాగాలను దక్షిణమధ్య రైల్వే సిబ్బంది ప్లాస్మా కట్టర్‌తో కట్‌ చేసి లోకో ట్రైన్‌ ద్వారా సొరంగం బయటకు తరలిస్తున్నారు. ఉబ్చికి వస్తున్న నీటిని సొరంగం మధ్య గుండా దారి ఏర్పాటుచేసి.. భారీ మోటార్ల సాయంతో కృష్ణానదిలోకి పంపింగ్‌ చేస్తున్నారు. సహాయక చర్యలు మరో రెండు రోజుల్లో పూర్తి అవుతాయని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, సింగరేణి మైన్స్‌ రెస్క్యూ, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, ఆర్మీ, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ తదితర బృందాల సిబ్బంది నిషేధిత ప్రదేశం వరకు శిథిలాలను తొలగిస్తున్నారు. డీ–2 ప్రదేశం వరకు శిథిలాలను తొలగించినా ఆరుగురి కార్మికుల జాడ లభించలేదు. నిషేధిత ప్రదేశంలో ఉండి ఉండవచ్చని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లేట్‌ జేపీ కార్యాలయం వద్ద ప్రత్యేకాధికారి శివశంకర్‌ లోతేటి ఆధ్వర్యంలో టెక్నికల్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. టెక్నికల్‌ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిషేధిత ప్రదేశంలో తవ్వకాలు చేపట్టాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ

మరో రెండు రోజుల్లో ముగియనున్న సహాయక చర్యలు

నేడు ప్రత్యేకాధికారితో

టెక్నికల్‌ కమిటీ సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement