
పాలమూరులో 9 మంది జీహెచ్‌ఎంలకు నోటీసులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 9మంది జీహెచ్‌ఎంలకు ఆర్‌జేడీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. బదిలీల్లో తమ స్పౌజ్ ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం ఉండగా.. స్పౌజ్ పనిచేస్తున్న పాఠశాల సమీపంలో ఆప్షన్ పెట్టుకోకుండా హెచ్‌ఆర్‌ఏ పాఠశాలలకు ఆప్షన్ పెట్టుకున్నారని ‘సాక్షి’లో సైతం పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో నోటీసులు జారీ చేసిన అధికారులు విచారణ పూర్తిచేశారు. అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 9మంది జీహెచ్‌ఎంలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని మరోమారు నోటీసులు ఇచ్చినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత గడువులోగా సదరు జీహెచ్‌ఎంలు నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంలపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని.. వీరిపై త్వరలో అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తండ్రిని హత్య చేసిన
తనయుడికి రిమాండ్
బల్మూర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తనయుడే తండ్రిని కొట్టి చంపిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేట సీఐ రవీందర్ తెలిపిన వివరాలు.. బల్మూర్ మండలం కొండనాగులలో ఈనెల 12న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎర్రం శ్రీను(60) ఘటనలో మృతుని భార్య ఉశమ్మ ఫిర్యాదు మేరకు విచారణలో అనుమానితుడైన కుమారుడు రాంప్రసాద్‌ను అదుపులోకి తీసుకోని విచారించగా మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కొట్టడంతోనే మృతి చెందినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కల్వకుర్తి మేజిసే్ట్రట్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధిచినట్లు పేర్కొన్నారు.