
విజయ డెయిరీ అభివృద్ధికి సహకరించాలి
కల్వకుర్తి రూరల్: విజయ డెయిరీ లాభాల బాటలో నడవాలంటే రైతులే ప్రచారకర్తలుగా మారాలని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో జిల్లా అధికారి ధనరాజ్ అధ్యక్షతన డివిజన్ పరిధిలోని పాడి రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు పాడి రైతులకు గుదిబండగా మారాయని.. ఇతర ప్రాంతాల్లో పాల విక్రయం అధికంగా ఉండటంతో రాష్ట్రంలో పాల సేకరణ పెంచాలనే లక్ష్యంతో ధర పెంచిందన్నారు. దీంతో రోజు 2.25 లక్షల లీటర్ల పాల సేకరణ ఉండగా.. అది ఒక్కసారిగా 4.50 లక్షల లీటర్లకు పెరిగిందని, ప్రైవేట్ డెయిరీలు పక్క రాష్ట్రాల్లో పాలను కొనుగోలు చేయడంతో విజయ డెయిరీ నష్టాల్లో కూరుకుపోయిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో 15 నెలలుగా అనేక సందర్భాల్లో చర్చించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని వివరించారు. విజయ డెయిరీ అభివృద్ధికి ప్రతి ఒక్క రైతు కృషి చేయాలని.. గేదె పాలు అధికంగా సేకరించాలన్నారు. మార్కెట్‌లో పాల ధరను నిర్ణయించే శక్తి విజయ డెయిరీకే ఉందని చెప్పారు. రోజు రెండు లక్షల లీటర్ల పాలు మిగిలిపోతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గురుకులాలు, అంగన్‌వాడీలు, దేవాదాయశాఖకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్లర్లు..
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి పార్లర్లు ఏర్పాటు చేస్తున్నామని.. హైదరాబాద్‌లోనే 500 ఉండనున్నాయని, వీటిలో అన్నిరకాల పదార్థాలు విక్రయిస్తామని అమిత్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఆరు నెలల్లో పాడి రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. పలువురు రైతులు సమావేశంలో పాల ధరపై తమ అభిప్రాయాలు తెలిపారు. రాయితీ విత్తనాలను అన్నదాతలకు చైర్మన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాచమళ్ల శ్రీనివాస్, జనరల్ మేనేజర్ మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పాడి రైతులకు అండగా ప్రభుత్వం
వంగూరు: పాడి రైతులను ఆదుకునేందుకు విజయ డెయిరీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొండారెడ్డిపల్లిలో నిర్మిస్తున్న బల్క్ మిల్క్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం పాడి రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులకు దాదాపుగా బకాయి బిల్లులు చెల్లించామని.. రానున్న రోజుల్లో ఎప్పటి బిల్లులు అప్పుడే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పాల ఉత్పత్తి అధికమని.. అందుకే బల్క్ కూలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నెలరోజుల్లో పనులు పూర్తిచేసి పాల సేకరణ జరగాలన్నారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. గ్రామస్తులు వేమారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాడి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు
విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి