
ఆదివారం అధికారులకు దావత్!?
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని జన్నారం, బెల్లంపల్లి, కోటపల్లి, హాజీపూర్ తదితర మండలాల్లో శని వారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతుంటే.. అధికారులు మా త్రం ఆదివారం మిల్లర్ల దావత్‌లో మునిగితేలడం వివాదాస్పదమైంది. వేంపల్లి శివారులోని మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రారైస్, బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఏర్పాటు చేసిన ఈ దావత్‌లో ఒక ఉన్నతాధికారితోపాటు సంబంధిత శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధా న్యం సరఫరా, మిల్లింగ్ తర్వాత సీఎంఆర్ బియ్యం స్వీకరణ వంటి అంశాలకు సంబంధించిన అధికా రుల హాజరు, మిల్లర్లతో సన్నిహిత సంబంధాలపై ఆనుమానాలను రేకెత్తిస్తోంది. మిల్లర్ల తిరకాసు కారణంగా జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరుగు పేరుతో ధాన్యంలో కోత విధిస్తున్నారు. మిల్లులకు ధాన్యం తరలింపులో ఆలస్యం చేస్తున్నారు. లారీలు రోజుల తరబడి మిల్లుల వద్ద నిలిచిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలను సందర్శించాల్సిన అధికారులు మిల్లర్లతో దావత్‌లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.