
రహదారికి ప్రాధాన్యత!
● ఎన్‌హెచ్–63పై కదలిక ● కేంద్రమంత్రి పర్యటన ముందు టెండర్లు ● గత కొంతకాలంగా పనుల్లో జాప్యం ● భూములు ఇచ్చేందుకు రైతుల వ్యతిరేకత
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జాతీయ రహదారి–63 పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. ‘ప్రధానమంత్రి ప్రాధాన్యత జాబితా’లో చ్చేడంతో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆర్మూర్, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల వరకు నాలుగు వరుసల రహదారికి ప్రణాళిక రచించిన విషయం తెలిసిందే. చెన్నూర్ మీదుగా ఛత్తీస్‌గఢ్ వరకు కలుపుతూ ప్రతిపాదించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కీలక ప్రాజెక్టుల్లో ఈ హైవే చేర్చినప్పటికీ జాప్యం జరిగింది. సాంకేతిక, పర్యావరణ, అటవీ అనుమతులు, భూ సేకరణ, కోర్టు కేసులతో జాప్యం జరుగుతోంది. తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ రాష్ట్ర పర్యటన ముందు మళ్లీ పురోగతి కనిపిస్తోంది. మరోవైపు భూ సేకరణతో ప్రభావితం అవుతున్న రైతులు వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. స్థానికంగా, జిల్లా ఉన్నతాధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ, పర్యావరణ, ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనూ నిర్వాసితులు భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. అంతేగాక భూ సేకరణ, హైవే అలైన్‌మెంటు మార్పుపైనా హైకోర్టులోనూ ఐదు కేసులు విచారణలో ఉన్నాయి.
పనులు సాగేనా?
మొత్తం నాలుగు ప్యాకేజీల్లో నిర్మిస్తున్నప్పటికీ ఆర్థిక పర బిడ్‌లో రెండు ప్యాకేజీల్లోనే నిర్మించనున్నారు.
గ్రీన్, బ్రౌన్ ఫీల్డ్, అంటూ ఇప్పటికే రెండుసార్లు అలైన్‌మెంట్లు మార్చారు. చివరగా గీన్ ఫీల్డ్ హైవేగానే నిర్మితం కావడంతో పంట పొలాల నుంచి రోడ్డు వెళ్లనుంది. కొద్దిమేర ప్రస్తుతమున్న రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఇక ముల్కల శివారు నుంచి బైపాస్ మందమర్రి మండలం కుర్మపల్లి క్రాస్ జంక్షన్ వద్ద ఎన్‌హెచ్–363కి కలుపనున్నారు. రాష్ట్ర జాతీయ రహదారుల పరిధిలోని పాత మంచిర్యాల మీదుగా, శ్రీరాంపూర్ జంక్షన్, జైపూర్, చెన్నూరు బైపాస్‌తో మహారాష్ట్ర సరిహద్దు వరకు పూర్తయింది. ఇక్కడ టోల్‌గేటు సిద్ధమైంది. అటు నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు వెళ్లనుంది. తాజాగా అన్ని అనుమతులు రావడంతో పనులు మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. భూ సేకరణ, పరిహారం చెల్లింపులు పూర్తయి, టెండరు పిలిచి, కాంట్రాక్టర్లతో ఒప్పందమైతే పూర్తిస్తాయిలో నిర్మాణం మొదలు కానుంది. అయితే స్థానికంగా నిర్వాసితుల వ్యతిరేకతతో పనులు సాగుతాయా? అనే సందేహాలు వస్తున్నాయి.
మంచిర్యాల–లక్సెట్టిపేట రోడ్డు
ఆర్మూర్–మంచిర్యాల హైవే సెక్షన్
భూ సేకరణ వివరాలు(ఎకరాల్లో)
ప్రభుత్వ 176.11
ప్రైవేటు 1317
అటవీ 38.05
ప్రభావిత నిర్మాణాలు 135
నిర్వాసిత కుటుంబాలు 162
నిర్మించే రోడ్డు 131.895కి.మీ
వ్యయం రూ.2937.36కోట్లు
పట్టణాలు:
ఆర్మూర్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల