
'ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సమానంగా చూడరు' ఇది చాలామంది ఇళ్లలో ఉండేదే. తన ఇంట్లో కూడా ఇదే వివక్ష చూపించారంటోంది బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ (Vishnupriyaa bhimeneni). తాజాగా ఆమె సోషల్ మీడియాలో తను బాధపడ్డ క్షణాలను గుర్తు చేసుకుంది. నేను ఎప్పుడూ నా సంతోషకర క్షణాలనే మీతో పంచుకున్నాను కానీ నేను బాధపడ్డ విషయాల గురించి మీకెప్పుడూ చెప్పలేదు. అందుకే నేను డిస్టర్బ్ అయిన ఓ సందర్భాన్ని ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను.
వ్యత్యాసం చూపించేవారు
చిన్నప్పుడు మేము మా నానమ్మవాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం. అక్కడ నన్ను, మా చెల్లిని ఒక రకంగా.. మా బావ, తమ్ముడిని మాత్రం మరోరకంగా చూసేవారు. వాళ్లకు ఎక్కువ పాకెట్‌మనీ, ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చేవారు. మా పరిస్థితి మాత్రం అలా ఉండేది కాదు. ఇంకా చెప్పాలంటే పొలాల దగ్గరకు వెళ్లినా సరే సాయంత్రం ఆరింటిలోపు ఇంటికొచ్చేయాలి. అబ్బాయిలకైతే మాత్రం వాళ్లకు నచ్చినంత సేపు బయట తిరగొచ్చు. ఎండలో కూడా ఆడుకోవచ్చు.

మమ్మల్ని కన్నందుకు అమ్మపై కోపం
మేము ఎండలో అడుగు కూడా బయటపెట్టడకూడదు. మా అమ్మ వరుసగా ఇద్దరు ఆడపిల్లల్ని కన్నందుకు అత్తమామలు తీవ్ర నిరాశచెందారట. ఈ విషయం అమ్మ చెప్పింది. ఇలాంటి అసమానతలపై హోంటౌన్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఆ సిరీస్‌కు చాలా కనెక్ట్ అయ్యాను అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్ ఆహాలో ప్రసారం అవుతోంది.
బిగ్‌బాస్ షోలో మెరిసిన విష్ణు
విష్ణుప్రియ విషయానికి వస్తే.. ఆమె తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొంది. ఈ షోలో గేమ్‌పై ఫోకస్ పెట్టడానికి బదులు పిక్‌నిక్‌కు వచ్చినట్లుగా ఎంజాయ్ చేసేది. కాకపోతే తను మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడటం.. అమాయకత్వంతో అభిమానులను ఆకర్షించింది. అలా ఆ సీజన్‌లో ఫైనల్స్‌కు అడుగుదూరంలో ఆగిపోయింది. ఫినాలేకు ముందు వారమే ఎలిమినేట్ అయిపోయింది.
చదవండి: నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ