
సినిమా తారలంటే చాలా మందికి డెమీ గాడ్స్ లెక్క. మరీ ముఖ్యంగా హీరోలనైతే ఆరాధ్యదైవాలగానే కొలుస్తారు. వారి కోసం తన్నడానికి , తన్నించుకోవడానికి, వాళ్ల సినిమాలకు ప్రచారం చేయడానికి మాత్రమే కాదు వాళ్ల కోసం ప్రాణాలిచ్చేయడానికి కూడా సై అంటారు. అంతటి ఆదరణ అభిమానాలు పొందినప్పుడు సహజంగానే పేరు ప్రఖ్యాతులతో పాటు దండిగా డబ్బు, సంపద వస్తుంది. దాంతో సెంటిమెంట్స్ కూడా బాగా ఎక్కువే ఉంటాయి.
జ్యోతిష్యాన్ని, వాస్తును, ముహుర్తాలను విపరీతంగా నమ్మే హీరోలు మనకు ఎందరో ఉన్నారు. వీరిలో పలువురు సంఖ్యాశాస్త్రాన్ని కూడా బాగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసంతోనే తమ వాహనాల నెంబర్ల విషయంలో రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన వాహనం కోసం అత్యంత డిమాండ్ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్‌ను రూ.7.75 లక్షలకు దక్కించుకుని బాలకృష్ణ వార్తల్లో నిలిచారు.
అదే విధంగా గ్లోబల్ స్టార్ హీరో జూ.ఎన్.టి.ఆర్ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారు. ఆయన తన లంబోర్గిని ఉరూస్ వాహనం కు టిఎస్09ఎఫ్‌ఎస్ 9999 నెంబర్ ను రూ.17లక్షలు ఖర్చు పెట్టారు. ఎన్టీయార్ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్‌నే ఎంచుకుంటారు.
సూపర్ స్టార్ మహేష్‌బాబు తన వాహనాలైన రేంజ్ రోవర్, మెర్సిడెస్ జిఎల్ ఎస్ ల కోసం Výటిఎస్09 ఇకె 600, టిఎస్09జిఒ600 లను కొనుగోలు చేశారు. నాగార్జున బిఎండబ్ల్యూ 7 సిరీస్ కోసం ఎపి 09బిడబ్ల్యు 9000ను వేలంలో దక్కించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రేంజ్‌రోవర్, వోల్వో ఎక్స్‌సి 90ల కోసం టిఎస్07 జిఇ9999 నెంబర్ లపై రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారు. సీనియర్ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్ వాహనం బివైడి అట్టో 3 నెంబరు టిఎస్09జిబి 2628 కోసం రూ.17,628 వెచ్చించారు.
అమితాబ్ ఆద్యుడు అనుకోవాలేమో...
స్టార్‌డమ్ కి దేశంలోనే అందరికీ బిగ్ బి అని పేర్కొనదగ్గ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కు కూడా నెంబర్ సెంటిమెంట్ ఎక్కువే. ఆయన తన వాహనాలన్నింటికీ 11 నెంబర్ వచ్చేలా చూస్తారు. ఆయన పుట్టిన రోజు కూడా అదే కావడం విశేషం. అలాగే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కి ఇష్టమైన నెంబర్ 2222, ధనుష్ 106 నెంబర్‌ని ఇష్టపడతారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 2727 నెంబర్‌ని ఎంచుకుంటారు. షారూఖ్ ఖాన్ 555, సంజయ్ దత్ 4545 తమ వాహనాలకి తరచూ కోరే నెంబర్స్. ఈ తరహా సెంటిమెంట్స్ హీరోయిన్స్‌కు పెద్దగా లేకపోవడం ఆసక్తికరం. హీరోలు నెంబర్ల వేటలో రూ.లక్షలు వెచ్చిస్తున్నప్పటికీ.. వారితో ధీటుగా ఫాలోయింగ్ అందుకుంటున్న హీరోయిన్లు మాత్రం ఈ నెంబర్ల పిచ్చికి దూరంగా ఉండడం విశేషం.