
దర్శకుడు మణిరత్నం ఓసారి తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని, అప్పుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తనకు సపోర్ట్ చేశాడని చెప్తున్నాడు నటుడు గజరాజ్ రావు. షారూఖ్, మణిరత్నం, గజ్‌రాజ్ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దిల్‌సే. 1998లో వచ్చిన ఈ సినిమా తెర వెనుక జరిగిన ఓ సంఘటనను గజరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. దిల్‌సేలో నాది సీబీఐ ఆఫీసర్ పాత్ర. నేను షారూఖ్ ఖాన్‌ను ప్రశ్నించాల్సి ఉంటుంది.
షారూఖ్‌ను గోడకు నెట్టేశా
అందుకు సంబంధించిన సన్నివేశం రిహార్సల్స్ చేస్తున్నాం. అందులో భాగంగా నేను షారూఖ్‌ను గోడకేసి కొట్టాను. అప్పుడు మణిరత్నం నాపై అసహనం వ్యక్తం చేశాడు. షారూఖ్ పెద్ద హీరో.. ఆయనొక స్టార్.. మనం ఈ సినిమా పూర్తి చేయాలి, అర్థమవుతుందా? ఆయన్ను అలా బలంగా నెట్టేయకు అని వారించాడు. కానీ షారూఖ్ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. ఇంతకుముందెలా చేశావో మళ్లీ అలాగే చేయు అని ఎంకరేజ్ చేశాడు
అందరికంటే ఎక్కువ ఎనర్జీ
నా బలాన్నంతా ఉపయోగించమనేవాడు. సెట్‌లో, బయటా అందరూ సమానమే అని చాటిచెప్పేవాడు. ఆయన్ను నేను రఫ్‌గా ఎందుకు హ్యాండిల్ చేశానంటే మేమిద్దరం ఢిల్లీలోని థియేటర్ స్కూల్ నుంచి వచ్చినవాళ్లమే! ఏదేమైనా షారూఖ్ ఎనర్జీ మిగతా అందరు నటులకంటే 10 వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది అని గజ్‌రాజ్ చెప్పుకొచ్చాడు. ఇతడు.. తల్వార్, బదాయి హో, రంగూన్, మేడ్ ఇన్ చైనా, శుభ్ మంగళ్ జ్యాద సావధాన్, మైదాన్, సత్యప్రేమ్ కీ కథ, బ్యాడ్ న్యూజ్, యుద్ర చిత్రాల్లో నటించాడు.