
బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీ ప్రధాన పాత్రలో వస్తోన్న పీరియాడికల్ చిత్రం 'కేసరి వీర్..లెజెండ్స్ ఆఫ్ సోమనాథ్'. ఈ సినిమాలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమనాథ్ ఆలయాన్ని విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడిన రాజ్‌పుత్ యోధుడు హమీర్జి గోహిల్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ ఈవెంట్‌కు హాజరైన సునీల్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి మరోసారి మాట్లాడారు.
కశ్మీర్‌లో అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఉగ్రవాదులని సునీల్ శెట్టి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కానీ కొందరు ఈ పురోగతిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి నిలబడాలి.. భారత్ మాతా కీ జై అని అన్నారు. అంతకుముందే తాను త్వరలోనే వేకేషన్ కోసం కశ్మీర్‌లో పర్యటిస్తానని సునీల్ శెట్టి చెప్పారు. అక్కడి ప్రజలు భయంతో జీవించకూడదని ఆయన ఆకాంక్షించారు.
కాగా.. ఈ చిత్రంలో సునీల్ శెట్టి యోధుడు వేగదా జీ పాత్రను పోషిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో జాఫర్ ఖాన్‌గా కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ రాజల్ అనే మహిళా యోధురాలిగా తొలిసారిగా నటించింది. ఈ ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన సూరజ్ పంచోలి ఎమోషనలయ్యారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశామని వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసరి వీర్ మే 16న 2025న థియేటర్లలోకి రానుంది.