
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరిట పార్టీని కూడా స్థాపించారు. ఇటీవల ఆయన నిర్వహించిన తొలి రాజకీయ సభకు దాదాపు పది లక్షలకు పైగా ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు.
అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అతన్ని రానివ్వండి.. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్ కూడా వచ్చాడు. అలాగే విజయ్ కూడా ప్రయత్నించనివ్వండని అన్నారు.
విజయ్ గెలుపు అసాధ్యం
కానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడం అంత సులభం కాదని సత్యనారాయణ రావు అన్నారు. విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ శతవిధాల ప్రయత్నించినా తమిళనాడులో గెలవలేడని షాకింగ్ కామెంట్స్ చేశారు.
సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. "ఆయనకు రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే ఈ రంగంలోకి దిగాడు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేస్తాడో నాకైతే కచ్చితంగా తెలియదు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అది చాలా కష్టం' అని అన్నారు. కాగా.. విజయ్ చివరిసారిగా ది గోట్ మూవీతో అభిమానులను అలరించాడు. త్వరలోనే మరో మూవీలో ఆయన నటించనున్నారు.