
పవిత్ర లక్ష్మి (Pavithralakshmi).. ఈ తమిళమ్మాయి ఓ కాదల్ కణ్మని (2015) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో అతడి కొలీగ్‌గా చిన్న పాత్రలో కనిపించింది. అదే ఏడాది ఈమె మిస్ మద్రాస్ కిరీటాన్ని సైతం గెల్చుకుంది. కూకు విత్ కోమలి అనే కుకింగ్ షోలో పాల్గొని ఎక్కువ ఫేమస్ అయింది. దీంతో ఒక్క ఏడాదిలోనే నాయి శేఖర్ (తమిళ చిత్రం), ఉల్లాసం (మలయాళం), అదృశ్యం(తమిళ, మలయాళం) అనే సినిమాలు చేసింది. జిగిరీ దోస్తు, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్ చిత్రాల్లోనూ తళుక్కుమని మెరిసింది.
ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు
అయితే ఈ బ్యూటీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ ఈ మధ్య పుకార్లు వైరల్‌గా అయ్యాయి. ఈ రూమర్లపై పవిత్ర లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. నా లుక్ మారడం, బరువు పెరగడంతో నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. చాలాసార్లు వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని కామెంట్లు అయితే చెప్పడానికి కూడా వీలు లేనంత దారుణంగా ఉన్నాయి.

నా భవిష్యత్తు ఆగం చేయొద్దు
అందుకే మీ అందరికీ మరోసారి చెప్తున్నా.. నేను తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. దయచేసి మీ వినోదం కోసం నా గురించి లేనిపోని వార్తలు రాయొద్దు. నాపై రూమర్లు సృష్టించకండి. నాకంటూ ఓ జీవితం ఉంది.. దయచేసి నా పేరు చెడగొట్టకండి.. నా భవిష్యత్తును ఆగం చేయకండి. కొంత ప్రేమ, మరికొంత గౌరవం.. మీనుంచి ఈ రెండే కోరుకుంటున్నా.. మీరెప్పుడూ నాపై ప్రేమాభిమానాలే చూపించేవారు. దాన్ని అలాగే కొనసాగించండి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అని పవిత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.